దివ్యాంగుల గుడిసెల తొలగింపునకు యత్నం

ABN , First Publish Date - 2022-05-15T05:20:18+05:30 IST

దివ్యాంగుల గుడిసెల తొలగింపునకు యత్నం

దివ్యాంగుల గుడిసెల తొలగింపునకు యత్నం

 అడ్డుకున్న బాధితులు.. వెనుదిరిగిన అధికారులు

నెహ్రూసెంటర్‌, మే 14 : మహబూబాబాద్‌ శివారులో దివ్యాంగులు గత కొంతకాలంగా గుడిసెలు వేసుకుని జీవిస్తున్నారు. తహసీల్దార్‌ నాగభవాని శనివారం రెవెన్యూ సిబ్బంది, పోలీసు బలగాలతో కలిసి  ఆ గుడిసెలను తొలగించేందకు వెళ్లగా దివ్యాంగులు అడ్డుకోవడంతో చేసేది ఏమిలేక అధికారులు వెనుదిరిగారు.  జిల్లా కేంద్రంలోని 557 సర్వే నెంబర్‌లో వికలాంగుల హక్కుల పోరాట సమితి (వీహెచ్‌పీఎ్‌స) ఆధ్వర్యంలో నిరుపేద దివ్యాంగులు గత కొంతకాలంగా గుడిసెలు వేసుకుని జీవిస్తున్నారు. ఈ క్రమంలో తహసీల్దార్‌ నాగభవాణి, రెవెన్యూ సిబ్బంది, పోలీస్‌ బలగాలతో పాటు గుడిసెల వద్దకు చేరుకున్నారు. గుడిసెలు వెంటనే తొలగించాలని లేకపోతే కఠిన చర్యలు ఉంటాయని తహసీల్దార్‌ దివ్యాంగులను హెచ్చరించారు. అయినా దివ్యాంగులు తమ గుడిసెలు తొలగించవద్దని అధికారులు, పో లీసుల కాళ్లావేళ్లపడి వేడుకున్నారు. అయినా కనికరించకుండా అధికారులు జేసీబీ, డోజర్‌లతో గుడిసెలు తొలగించే ప్రయత్నం చేశారు. దీంతో ఓ దివ్యాంగుడు ఏకంగా జేసీబీ టైర్లకింద పడుకుని తనను తొక్కించుకుంటూ వెళ్లి గుడిసెలు కూల్చలని ఆవేదన వ్యక్తం చేశారు. మరో పక్క ఓ యువతి జేసీబీ పైకి ఎక్కి నిరసన వ్యక్తం చేసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు గుడిసెలు తొలగించేందుకు ప్రయత్నించిన అధికారులు దివ్యాంగుల ఆందోళనతో చేసేది ఏమిలేక వెనుదిరిగారు. 

Read more