కృష్ణా ట్రైబ్యునల్ విచారణ జూలై13కి వాయిదా
ABN , First Publish Date - 2022-05-14T08:05:14+05:30 IST
కృష్ణా నదీ జలాల్లో సాగు నీటి వినియోగానికి సంబంధించిన వివాదంపై విచారణను బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ జూలై 13, 14, 15వ తేదీలకు వాయిదా వేసింది.
హైదరాబాద్, మే 13 (ఆంధ్రజ్యోతి): కృష్ణా నదీ జలాల్లో సాగు నీటి వినియోగానికి సంబంధించిన వివాదంపై విచారణను బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ జూలై 13, 14, 15వ తేదీలకు వాయిదా వేసింది. తెలంగాణ చేసిన విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. నిజానికి, ఈ విచారణ మే 18, 19వ తేదీల్లో జరగాల్సి ఉంది. సాగు నీటి వినియోగంపై తెలంగాణ అఫిడవిట్ వేయగా. రాష్ట్రం తరపున పళినిస్వామి సాక్షిగా ఉన్నారు. పళినిస్వామి విచారణకు హాజరయ్యే పరిస్థితిలో లేనందున వాయిదా వేయాలని తెలంగాణ అభ్యర్థించింది. ఇక, శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల ఆపరేషన్ ప్రోటోకాల్, రూల్‌కర్వ్‌పై వేసిన మరో అఫిడవిట్‌లో సీడబ్ల్యూసీ మాజీ అధికారి చేతన్ పండిట్ సాక్షిగా ఉన్నారు. చేతన్ పండిట్‌ను త్వరలోనే ట్రైబ్యునల్‌లో క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు.

