తారం.. భారం
ABN, First Publish Date - 2022-05-14T05:36:49+05:30
యాసంగి ధాన్యం అమ్ముకునే క్రమంలో రైతు దగాపడుతున్నాడు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలున్నా అక్కడ తారం (తరుగు).. భారం కావడం, అసాని
కొనుగోలు కేంద్రాల్లో దగాపడుతున్న రైతు
ప్రైవేటు వ్యాపారుల చేతిలోనూ అదే నష్టం
ఖమ్మం, మే 13 (ఆంధ్రజ్యోతిప్రతినిధి) : యాసంగి ధాన్యం అమ్ముకునే క్రమంలో రైతు దగాపడుతున్నాడు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలున్నా అక్కడ తారం (తరుగు).. భారం కావడం, అసాని తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో గత నాలుగురోజులుగా రైతులు పంటలను ఎలాగైనా అమ్ముకోవాలన్న భావనతో అవసరమైతే ప్రైవేటు వ్యాపారులకు తక్కువ ధరకు అమ్ముకుంటున్నారు. ఈ క్రమంలో రైతులు క్వింటాకు రూ.300 నుంచి రూ.400కుపైగా నష్టపోతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో తేమశాతం పేరుతో రూ.5 నుంచి రూ.10కిలోలు తారం తీయడం, కాంటాల్లో జాప్యం లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులు చివరకు ప్రైవేటు వ్యాపారులకు తక్కువ ధరకే అమ్ముకుంటున్నారు. దీంతో వ్యాపారులు కూడా పోటీపడి కల్లాల వద్దే ధాన్యం కొని మిల్లులకు తరలిస్తున్నారు. ప్రభుత్వం వరి వేయొద్దని చెప్పినా.. ఖమ్మం జిల్లాలో సుమారు లక్ష25వేల ఎకరాల్లో యాసంగి వరి సాగైంది. పంట కూడా పుష్కలంగా పండింది. అయితే సీజన్ ప్రారంభంలో కొనుగోలు విషయంలో ఏర్పడిన సందిగ్ధతతో రైతులు ఆందోళన చెందినా.. చివరకు రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలని తీసుకున్న నిర్ణయంతో వారిలో ఆనందం కనిపించింది. జిల్లాలో 236 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి.. లక్షా50వేల మెట్రిక్‌టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యం పెట్టుకోగా ఇప్పటి వరకు సహకారసంఘాలు, స్వయంసహాయక సంఘాలు, డీసీఎంఎస్, మార్కెటింగ్‌శాఖల ద్వారా 216 కేంద్రాలు తెరిపించారు ఇందులో కేవంలో 128కేంద్రాల ద్వారా కొనుగోళ్లు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు 33,092మె.ట ఏగ్రేడు రకం ధాన్యం, 702.320మె.ట. సాధారణ రకం కొన్నారు. ఏగ్రేడు రకానికి రూ.1960, సాధారణ రకానికి రూ.1940 ధరను నిర్ణయించిన ప్రభుత్వం ఇప్పటి వరకు 1782 మంది రైతులకు రూ.28.48కోట్లు చెల్లించారు. ఇంకా రూ37.75కోట్లు బకాయి ఉంది.
ప్రైవేటు వ్యాపారులకే ఎక్కువ..
జిల్లాలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు మందకొడిగా సాగుతున్నాయి. 1.55లక్షల మెట్రిక్‌టన్నుల లక్ష్యానికి గాను.. ఇప్పటి వరకు కేవలం 33,795మెట్రిక్‌టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. దాంతో పాటు కాంటాల్లో జాప్యం, తేమ నిబంధనలు, తరుగు లాంటి వాటిని దృష్టిలో పెట్టుకుని రైతులు ప్రైవేట్ వ్యాపారులు, మిల్లర్లకే ఎక్కువగా అమ్ముకుంటున్నారు. మరోవైపు గత నాలుగురోజులుగా అసని తుఫాన ప్రభావంతో వాతావరణం మబ్బులు చేసి ఉండటం, అక్కడక్కడా జల్లులు పడటంతో పంట తడిసి నష్టపోతామేమో అన్న బయంతో క్వింటా రూ.1600, రూ.1700కూడా రైతులు ధాన్యాన్ని విక్రయిస్తున్నారు. కొందరు రైతులైతే మిషన్లతో కోతలు కోయించి.. పచ్చివడ్లనే నేరుగా అమ్మేస్తున్నారు. ధరలో కొంత నష్టపోయినా ధాన్యం త్వరగా అమ్ముడవుతుందని, నిరీక్షణ అవసరం లేదని రైతులు భావిస్తుండగా.. ప్రైవేటుకు అమ్ముకుని సుమారు రూ.400 వరకు నష్టపోతున్నారు.