నూకపేరుతో దోపిడీ

ABN , First Publish Date - 2022-05-14T05:37:41+05:30 IST

మంత్రులు, అధికారులు ఎన్ని హెచ్చరికలు చేసినా కొందరు రైస్‌మిల్లర్లు తమ తీరు మార్చుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. యాసంగి ధాన్యంలో నూకశాతం అధి

నూకపేరుతో దోపిడీ

 మిల్లర్లకు వరంగా దొడ్డురకం ధాన్యం

రైతుల్లో వ్యక్తమవుతున్న అసంతృప్తి

వైరా, మే 13: మంత్రులు, అధికారులు ఎన్ని హెచ్చరికలు చేసినా కొందరు రైస్‌మిల్లర్లు తమ తీరు మార్చుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. యాసంగి ధాన్యంలో నూకశాతం అధికంగా ఉందనే సాకుతో పాటు రైతుల అవసరాలను ఆసరా చేసుకుని తరగు పేరుతో అడ్డగోలుగా దోచుకుంటున్నారు. ముఖ్యంగా దొడ్డురకం(లావు) ధాన్యం మిల్లర్లకు వరంగా మారింది. సన్నరకం ధాన్యానికి ఎలాంటి కోత పెట్టని మిల్లర్లు.. లావురకం ధాన్యానికి మాత్రం అడ్డగోలుగా కోత పెడుతున్నారు. ఈ వ్యవహారం మరింత శ్రుతిమిండంతో రైతుల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది. సుదీర్ఘ సందిగ్ధం అనంతరం రాష్ట్ర ప్రభుత్వమే యాసంగి ధాన్యాన్ని కొంటామని ప్రకటించి ఆమేరకు కేంద్రాలను ఏర్పాటుచేసింది. అయితే యాసంగి ధాన్యంలో నూకశాతం అధికంగా ఉంటుందని ఆ నష్టాన్ని ప్రభుత్వమే భరించాలని మిల్లర్లు డిమాండ్‌ చేయగా.. ఆమేరకు పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌, అధికారులు మిల్లర్లతో నూకశాతం నష్టం విషయమై చర్చలు జరిపారు. కానీ దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే ముందైతే ధాన్యం దిగుమతి చేసుకోవాలని మిల్లర్లను ప్రభుత్వం ఆదేశించింది. ఆ తర్వాత కొనుగోలు కేంద్రాలను తెరిచి ధాన్యాన్ని సేకరిస్తోంది. ఇదే సమయంలో అకాల వర్షాలు, అసాని తుఫాన్‌ ప్రభావంతో జల్లులు పడి.. పలుచోట్ల స్వల్పంగా ధాన్యం తడిసింది. అప్పటికే అయిష్టంగా ఉన్న మిల్లర్లు ఈ వర్షాలను సాకుగా చూపి ధాన్యాన్ని తరుగు తీయటం ప్రారంభించారు. మొదట క్వింటాకు మూడుకిలోల చొప్పున తరుగు తీసిన మిల్లర్లు ఆ తర్వాత కటింగ్‌ శాతాన్ని మరింత పెంచారు. ముఖ్యంగా లావురకం ధాన్యంలో ఇష్టారీతిన కోత విఽధిస్తున్నారు. అయితే ఎట్టిపరిస్థితుల్లోనూ ఎక్కడా ధాన్యం రాసులు కనిపించకూడదని, కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉండటంతో పౌరసరఫరాలశాఖ అధికారులు కూడా మిల్లర్లపై చర్యలు తీసుకోలేని పరిస్థితులున్నాయి. మిల్లర్లను బుజ్జగించి ధాన్యాన్ని మిల్లులకు తరలించడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి. దీన్ని అలుసుగా తీసుకుంటున్న కొందరు మిల్లర్లు ధాన్యం కొనుగోలులో పేచీలు పెడుతూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ ఈ సమస్యపై ప్రత్యేక దృష్టిసారించి తాము నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

Read more