కాంగ్రెస్ అభివృద్ధిచేస్తే.. టీఆర్‌ఎస్ నాశనం చేస్తోంది
ABN, First Publish Date - 2022-05-14T06:17:26+05:30
కాంగ్రెస్ హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తే టీఆర్‌ఎస్ పాలనలో తెలంగాణా రాష్ర్టాన్ని సర్వ నాశనం చేసిందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కోటూరి మానవతా రాయ్ ఆరోపించారు.
తెలంగాణ రియల్‌ఎస్టేట్ సమితిగా టీఆర్‌ఎస్
అవినీతి, అక్రమాలకు నిలయం పాలన
టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మానవతా రాయ్
సత్తుపల్లి, మే 13: కాంగ్రెస్ హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తే టీఆర్‌ఎస్ పాలనలో తెలంగాణా రాష్ర్టాన్ని సర్వ నాశనం చేసిందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కోటూరి మానవతా రాయ్ ఆరోపించారు. శుక్రవారం ఆయన సత్తుపల్లిలో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో పేదలకు మూడున్నర లక్షల ఎకరాలు భూమి పంపిణీ చేస్తే ఆయా భూములను రియల్ ఎస్టేట్ పేరుతో పేదల నుంచి ఎస్సైన్‌మెంట్ భూములు లాక్కుంటోందని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో 4.5లక్షల ఎకరాలకు 2006లో పోడు భూములకు హక్కు పత్రాలివ్వగా హరిత హారం పేరుతో గిరిజనుల నుంచి భూములను లాక్కుని వారిని అన్యాయం చేసిందని ఆరోపించారు. తెలంగాణా రాష్ట్ర సమితి పార్టీ తెలంగాణా రియల్ ఎస్టేట్ సమితిగా మారిందని విమర్శించారు. జిల్లాలో ముఖ్యంగా సత్తుపల్లి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన మహామహులు ఎందరో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభవృద్ది చేస్తే గత ఎనిమిదేళ్ల కాలంలో నియోజకవర్గం అభివ ృద్దిలో వెనుకబడిందని అన్నారు. ఈ నియోజకవర్గంలో ఎనిమిదేళ్ల కాలంలో ఒక్క అభివృద్ది కార్యక్రమం కూడా జరగలేదని ఆరోపించారు. సత్తుపల్లి నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకులు మట్టి, ఇసుక మాఫియాలుగా మారి వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. నియోజకవర్గం పేకాట స్థావరాలకు, నిర్వాహకులకు అడ్డాగా మారిందని విమర్శించారు. సత్తుపల్లి మండలంలో సింగరేణి సంస్థ బొగ్గుగనునల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, ఒక్కో గ్రామంలో ఒక్కో రకంగా నష్టపరిహారం ఇస్తున్నారని ఆరోపించారు. వరి సాగు చేయొద్దని రైతులను ప్రభుత్వం బ్లాక్ మెయిల్ చేసిందని తద్వారా రాష్ట్రంలో రైతులు 16లక్షల ఎకరాల్లో వరి సాగు చేయకుండా బీడు పెట్టారని అన్నారు. వరి సాగు చేయని రైతులకు ఎకరాలకు రూ.15వేల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేసారు. రైతులు పండించిన ధాన్యం కూడా పూర్తి స్థాయిలో కొనుగోలు చేయలేని స్థితిలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉందన్నారు. రాహుల్ గాంఽధీ, రేవంత్‌రెడ్డి నాయకత్వంలో నిర్వహించిన వరంగల్ సభలో డిక్లరేషన్ ఖచ్చితంగా అమలు చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫపల్యాలను ప్రశ్నించిన వారిని హతమారుస్తున్నారని ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో సత్తుపల్లి జిల్లా
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సత్తుపల్లి కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేస్తామని మనవతారాయ్ చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సత్తుపల్లి జిల్లా కోసం జిల్లా కాంగ్రెస్ నాయకులంతా గట్టిగా ఆ కృషి చేస్తామని చెప్పారు. సత్తుపల్లి జిల్లా గురించి హామీ ఇచ్చిన నాయకులు ఆ విషయం మర్చిపోయారని ఎద్దేవా చేసారు. విలేకర్ల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు రామిశెట్టి సుబ్బారావు, నున్నా రామకృష్ణ, గాదె చెన్నకేశవరావు, రావి నాగేశ్వరరావు, రషీద్, గాదెరెడ్డి సుబ్బారెడ్డి, మానుకోట ప్రసాద్; యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి శివశంకర్ నాయక్ పాల్గొన్నారు.