పేదలకు అప్పులు.. కల్వకుంట్ల కుటుంబానికి ఆస్తులు

ABN , First Publish Date - 2022-05-14T05:39:59+05:30 IST

కల్వకుంట్ల కుటుంబం పేదలపై అప్పులు మోపి, ఆస్తులను కూడబెట్టుకుంటోందని, యాభై ఎకరాలున్న కేసీఆర్‌కు 300 ఎకరాల ఫాంహౌస్‌ ఎలా వచ్చిందని, బీఎస్పీ అధికారంలోకి రాగానే కల్వకుంట్ల కుటుంబం అక్రమంగా సంపాదించిన ఆస్తులను అమ్మి పేదలకు ఖర్చు

పేదలకు అప్పులు.. కల్వకుంట్ల కుటుంబానికి ఆస్తులు

ప్రభుత్వ పథకాలతో కేసీఆర్‌ కుటుంబానికే లబ్ధి

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరిగింది 

నిత్యం ప్రజలతో ఉండే పార్టీ బీఎస్పీ

రాజ్యాధికార యాత్రలో ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌

కొణిజర్ల/కారేపల్లి, మే 13: కల్వకుంట్ల కుటుంబం పేదలపై అప్పులు మోపి, ఆస్తులను కూడబెట్టుకుంటోందని, యాభై ఎకరాలున్న కేసీఆర్‌కు 300 ఎకరాల ఫాంహౌస్‌ ఎలా వచ్చిందని, బీఎస్పీ అధికారంలోకి రాగానే కల్వకుంట్ల కుటుంబం అక్రమంగా సంపాదించిన ఆస్తులను అమ్మి పేదలకు ఖర్చు చేస్తామని బీఎస్పీ కో ఆర్డినేటర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ పేర్కొన్నారు. ఆయన చేపట్టిన బహుజన రాజ్యాధికార యాత్ర 58వరోజైన శుక్రవారం ఖమ్మంజిల్లా కొణిజర్ల, కారేపల్లి మండలాల్లో కొనసాగింది. తొలుత కొణిజర్ల మండలంలోపర్యటించిన ఆయన పలుచోట్ల మాట్లాడారు. బహుజన సమాజపార్టీ అంటే ప్రజలతో ఉండే పార్టీ అని, ప్రజల కష్టాలను పంచుకునే పార్టీ అని, కబ్జాలు చేసే, దోచుకునే మోసాల పార్టీ కాదని, ఫాంహౌస్‌లలో బతికే పార్టీ అసలే కాదన్నారు. అనేక చోట్ల అధికారపార్టీ వారు తమ పార్టీ జెండాలను కూల్చాలని చూశారని, ప్రజలు మాత్రం బహుజన పార్టీకి అండగా నిలుస్తున్నారన్నారు. హైదరాబాద్‌లో రూ.100 కోట్ల భూమిని కేవలం రూ.4లక్షలకే గుంజుకున్న పార్టీ టీఆర్‌ఎస్‌ అని ఆరోపించారు. అన్ని వర్గాలను మోసం చేస్తున్న కేసీఆర్‌.. దళితులకు, మూడెకరాలు ఇస్తానని, దళితుడిని సీఎం చేస్తానని చెప్పి మాట తప్పారన్నారు. రూ. 36వేల కోట్లతో మిషన భగీరథ పథకం పెట్టి జేబులు నింపుకొన్నారని, ఈ పథకం అంతా ఒక మాయని, ఈ పథకంతో కల్వకుంట్ల కుటుంబానికి మాత్రమే లబ్ధి చేకూరిందని ఆరోపించారు. రాష్ట్రంలో 100కు 50మంది ఉన్న బీసీలు అన్యాయానికి గురవుతున్నారని, రానున్న ఎన్నికల్లో బీసీలకు 70శాతం సీట్లు ఇస్తామని తెలిపారు. దమ్ముంటే కేసీఆర్‌, రేవంతరెడ్డి, బండి సంజయ్‌ ఎన్ని సీట్లు ఇస్తారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. అనంతరం కారేపల్లి మండలం చింతలపాడులో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఏజెన్సీ గ్రామాల్లో సరైన వైద్య సదుపాయలు అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏడేళ్లలో ప్రజల కోసం ముఖ్యంగా అణగారిన వర్గాలకు ఏం చేయలేకపోయిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మిగిలిన కాలంలో ఏం చేస్తుందని ప్రశ్నించారు. ఉద్యోగులకు జీతాలు సమయానికి ఇవ్వలేక పోతోందని, 11లక్షల ఫించన్లు పెండింగ్‌లో ఉన్నాయని, ఇలా రాష్ట్రంలో అస్తవ్యస్త పాలన సాగుతోందన్నారు. 

Read more