బాస్కెట్‌బాల్ నూతన సంఘాన్ని ఎన్నుకోండి
ABN, First Publish Date - 2022-05-14T06:14:37+05:30
జిల్లా బాస్కెట్‌బాల్ అసోసియేషన్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవాలని రాష్ట్ర బాస్కెట్‌బాల్ అసోసియేషన్ ఆదేశాలు జారిచేసింది.
రాష్ట్ర బాస్కెట్‌బాల్ సంఘం ఆదేశం
ఖమ్మం స్పోర్ట్స్, మే 13: జిల్లా బాస్కెట్‌బాల్ అసోసియేషన్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవాలని రాష్ట్ర బాస్కెట్‌బాల్ అసోసియేషన్ ఆదేశాలు జారిచేసింది. ప్రస్తుత జిల్లా కమిటీ కార్యదర్శి అవినీతి ఆరోపణలు ఎదురుకుంటున్న నేపధ్యంలో కొత్త కమిటీని ఎన్నుకోవాలని జిల్లా సంఘానికి సూచించినట్లు సమాచారం. మార్చి 3న ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన ‘మైదానంలో మోనార్క్, ప్రతిభ ఉన్న క్రీడాకారులకు పదేళ్లుగా నరకం’ అనే శీర్షికలపై రాష్ట్ర బాస్కెట్‌బాల్ సంఘం సీరియస్ అయింది. దీంతో ఖమ్మం జిల్లాకు నూతన బాస్కెట్‌బాల్ సంఘానికి ఎన్నికలు తక్షణమే నిర్వహించాలని, నూతన కార్యదర్శిని ఎన్నుకోవాలని జిల్లా కార్యవర్గానికి సూచించింది. దీంతో ఈ నెల 29న నగరంలోని ఐఎంఏ హాలులో జిల్లా బాస్కెట్‌బాల్ సంఘానికి ఎన్నికలు నిర్వహించడానికి జిల్లా బాస్కెట్‌బాల్ సంఘం నిర్ణయం తీసుకుంది. కాగా ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే వివిద బాస్కెట్‌బాల్ క్లబ్‌ల బాధ్యులను, జిల్లా కమిటీలో ప్రస్తుతం పదవిలో ఉన్న కార్యవర్గ సభ్యులను, క్రీడాకారుల తల్లిదండ్రులను ప్రసన్నం చేసుకునేందుకు పలువురు ఆశావహులు సిధ్దం అయ్యారు. ప్రస్తుతం అవినీతి ఆరోపణలు ఎదురుకుంటున్న సదరు మోనార్క్ ఎలాగైనా మళ్లీ సెక్రెటరీ పదవి తనకే దక్కాలని ఇప్పటికే ఓటర్లకు ప్రలోభపెడు తూ, వత్తిడి తెస్తున్నాడని పలువురు విమర్శిస్తున్నారు. సీనియర్ క్రీడాకారులు జిల్లా బాస్కెట్‌బాల్ సంఘంలో ఈ సారి కొత్తవారికి అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నారు.