‘చెత్త’గించండి సారూ

ABN , First Publish Date - 2022-05-15T05:23:23+05:30 IST

మండల అధికారుల నిర్లక్ష్యం కారణంగా రాష్ట్ర ప్రభుత్వం రూ. లక్షలు ఖర్చు చేసి నిర్మించిన చెత్త డంపింగ్‌ యార్డులు అలంకార ప్రాయంగా మారాయి.

‘చెత్త’గించండి సారూ
మండలంలో ఓ డంపింగ్‌షెడ్డు వద్ద ఇదీ పరిస్థితి

పేరుకే చెత్త డంపింగ్‌ యార్డ్‌లు

తడి, పొడి చెత్త సేకరణకు మంగళం

అలంకార ప్రాయంగా నిర్మాణాలు

పట్టించుకోని అధికారులు 

ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు

చర్ల, మే 14: మండల అధికారుల నిర్లక్ష్యం కారణంగా రాష్ట్ర ప్రభుత్వం రూ. లక్షలు ఖర్చు చేసి నిర్మించిన చెత్త డంపింగ్‌ యార్డులు అలంకార ప్రాయంగా మారాయి. గ్రామ శివారుల్లో ఎక్కడ చూసినా చెత్తా చెదారం కనిపిస్తుండగా, కనీసం వాటి నుంచి తడి, పొడి చెత్తను సేకరించడం లేదు. ఉన్నతాధికారులు వచ్చినప్పుడు వారికి కనపడేలా కొంత తడి పొడి చెత్తను డంపింగ్‌ షెడ్డుల్లో పెట్టి కార్యదర్శులు తప్పు దోవ పట్టిస్తున్నారు. ఇదంతా మండల అధికారుల కనుసన్నల్లోనే జరుగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫలితంగా ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు పడుతుండగా రూ.లక్షల నిధులు వృధా అవుతున్నాయి.

అంతా తూచ్‌

చర్ల మండలంలో మొత్తం 26 పంచాయితీలున్నాయి. పంచాయితీల్లో ఉన్న చెత్తా చెదారం నుంచి తడి చెత్త పొడి చెత్తలను వేరు చేసేందుకు ప్రభుత్వం డంపింగ్‌ యార్డులను నిర్మించింది. అలాగే చెత్తను సేకరించేందుకు ప్రతీ పంచాయితీకి ఒక ట్రాక్టర్‌ను కూడా కేటాయించింది. పంచాయతీ లోని ప్రతీ వీధి నుంచి చెత్తను సేకరించి డంపింగ్‌ యార్డు వద్ద తడి, పొడి చెత్తగా వేరు చేయాల్సి ఉంటుంది. కానీ చర్ల మండలంలో ఇవేమీ జరగడం లేదు. కొంత మంది పంచాయితీ కార్యదర్శులు మాత్రమే ఈ పనులు సక్రమంగా చేస్తున్నారు. మరి కొంత మంది అధికారులు సహకారంతో పనుల్లో అలసత్యం వహిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో తడి, పొడి చెత్త సేకరణ పనులు చెప్పుకొనేందుకే పరిమితమయ్యాయి.

పనులు చేస్తున్నట్లు ప్రచారం

మండలంలోని ఓ ఉన్నతాధి కారి ఇచ్చిన సలహానేమో గానీ, కొన్ని డంపింగ్‌ యార్డుల్లో తడి, పొడి చెత్తను వేరు చేసినట్లు కొన్ని వస్తువులను డంపింగ్‌ యార్డుల్లో చూపిస్తున్నారు. ఎవరైనా అధికారి వస్తే అలా ఏర్పాటు చేసిన వస్తువులు చూపించి తప్పుదోవ పట్టిస్తున్నారు. డంపింగ్‌ యార్డులను అధికారులు పట్టించు కోకపోవడంతో అర్ధరాత్రి మందు బాబులకు అడ్డాగా మారాయి. ఇప్పటికైనా చర్ల మండలంపై జిల్లా కలెక్టర్‌, జిల్లా పంచాయితీ అధికారి దృష్టి సారిస్తే మండలంలో పారిశుధ్య పనులు ఏవిదంగా జరుగుతున్నాయో ఇట్టే తెలుస్తుందని మండల వాసులు చెబుతున్నారు.

చెత్త సేకరణ జరుగుతోంది: ఈవోఆర్డీ రామకృష్ణ

అన్ని పంచాయితీల్లో ప్రతీ రోజు చెత్త సేకరణ జరుగుతోంది. అందులో నుంచి తడి చెత్త పొడి చెత్తను వేరు చేస్తున్నాం. పారిశుధ్యంపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. కార్యదర్శులకు కూడా ఇందుకు సంబంధించి ఆదేశాలు జారీ చేశాం.


Read more