దళిత, గిరిజనవాడల అభివృద్ధి కాగితాలకే పరిమితం

ABN , First Publish Date - 2022-05-14T06:06:48+05:30 IST

దళిత, గిరిజనవాడల అభివృద్ధి కాగితాలకే పరిమితమవుతోంది.

దళిత, గిరిజనవాడల అభివృద్ధి కాగితాలకే పరిమితం

- జిల్లా నుంచి రూ.12,882.71 కోట్ల ప్రతిపాదనలు

- పది నెలలు గడుస్తున్నా నిధులు కేటాయించని ప్రభుత్వం

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

దళిత, గిరిజనవాడల అభివృద్ధి కాగితాలకే పరిమితమవుతోంది. గత ఏడాది ప్రభుత్వం రూపొందించిన ప్రణాళికలు అమలుకు నోచుకోవడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో అన్ని విధాలా మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధానంగా అన్ని వాడలకు తాగునీటి వసతి కల్పించేందుకు పైపులైన్ల నిర్మాణం, ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్‌ ఇవ్వడం, సీసీ రోడ్లు, మురుగుకాలువల నిర్మాణాలతో పాటు విద్యుత్‌ సౌకర్యం కల్పించాలని నిర్ణయించారు. విద్యుత్‌పరంగా తుప్పు పట్టిన కరెంట్‌ స్తంభాలను తొలగించడం, లూజు లైన్లను సవరించడంతో పాటు కొత్త లైన్లను లాగడం, కొత్త కనెక్షన్లు ఇవ్వాలని నిర్ణయించారు. ఈమేరకు గత ఏడాది జూలై, ఆగస్టు మాసాల్లో పంచాయతీ కార్యదర్శులు, పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ అధికారులు, మిషన్‌ భగీరథ ఇంట్రావిలేజ్‌ ఇంజినీరింగ్‌ అధికారులతోపాటు విద్యుత్‌ శాఖాధికారులు దళిత, గిరిజన వాడలను సందర్శించి పనులను గుర్తించారు. 

జిల్లాలో రూ.12,882 కోట్ల అంచనాలు..

జిల్లాలో గల 266 గ్రామ పంచాయతీల పరిధిలో 453 దళిత ఆవాసాలు, 31 గిరిజన ఆవాసాలను గుర్తించారు. వీటిలో ఎస్సీలు 1,54,855 మంది, ఎస్టీలు 14,945 మంది ఉన్నట్లు నిర్ధారించారు. వీరికి మౌలిక వసతులు కల్పించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఆయా గ్రామాల్లోని కాలనీల్లో 2301 సిమెంట్‌ రోడ్ల నిర్మాణానికి 7636.87 కోట్ల రూపాయలు, 1661 మురుగు కాల్వల నిర్మాణానికి 5011.77 కోట్ల రూపాయలు, ప్రస్తుతం వీధి దాపాలు 4261 ఉండగా, కొత్తగా మరో 6584 వీధి దీపాలను ఏర్పాటు చేయాలని, వీటికి గాను 234.11 కోట్లు, మొత్తం 12,882.71 కోట్ల రూపాయలు వెచ్చించాల్సి వస్తుందని సంబంధిత అధికారులు అంచనా వేశారు. నివేదికలన్నింటినీ జిల్లా పంచాయతీ శాఖాధికారి ద్వారా తెప్పించుకుని నిధుల మంజూరు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలను సెప్టెంబర్‌ మాసంలోనే పంపించారు. పది మాసాలు గడుస్తున్నా కూడా వీటి గురించి పట్టించుకోవడం లేదు. ఈ పనులను చేసేందుకు వివిధ గ్రాంట్ల ద్వారా నిధులు కేటాయించాల్సి ఉన్నప్పటికీ ఎలాంటి పురోగతి లేదు. ప్రత్యేకించి ప్రభుత్వం నిధులు మంజూరుచేస్తుందని ప్రజాప్రతినిధులు, దళిత, గిరిజనులు భావించారు. కానీ ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేయడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం సత్వరమే స్పందించి దళిత, గిరిజన వాడల అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని కోరుతున్నారు.  

Read more