BJP : ఓడి గెలిచిన కమలం!
ABN , First Publish Date - 2022-11-07T03:47:47+05:30 IST
కోరి.. తెచ్చుకున్న మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ ఓడి గెలిచింది! రాష్ట్రంలో అధికార టీఆర్‌ఎ్‌సకు ప్రధాన ప్రత్యర్థి తామేనని మరోసారి రుజువు చేసుకుంది. ఓటు బ్యాంక్‌ను గణనీయంగా పెంచుకుని రాబోయే ఎన్నికల్లో దీటుగా తలపడడానికి సిద్ధమైంది.
అభ్యర్థి ఓడినా పార్టీకి పెరిగిన ప్రాభవం.. గణనీయంగా పెరిగిన ఓటు బ్యాంకు..
కాంగ్రెస్, కమ్యూనిస్టుల కోటలోనూ హవా
దక్షిణ తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లోనూ పాగా
తాజా ఎన్నికతో స్పష్టమైన ప్రభుత్వ వ్యతిరేకత
దీనికితోడు బలమైన నాయకులు ఉంటే
గెలుపు నల్లేరుపై బండి నడకేనని భావన
ఆపరేషన్ కమల్ విస్తృతం చేసే దిశగా పావులు
హైదరాబాద్, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): కోరి.. తెచ్చుకున్న మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ ఓడి గెలిచింది! రాష్ట్రంలో అధికార టీఆర్‌ఎ్‌సకు ప్రధాన ప్రత్యర్థి తామేనని మరోసారి రుజువు చేసుకుంది. ఓటు బ్యాంక్‌ను గణనీయంగా పెంచుకుని రాబోయే ఎన్నికల్లో దీటుగా తలపడడానికి సిద్ధమైంది. తమకు ఏ మాత్రం పట్టులేని నల్లగొండ జిల్లాలో.. అందులోనూ కాంగ్రెస్, కమ్యూనిస్టుల కంచుకోట మునుగోడు నియోజక వర్గంలో భారీగా ఓట్లను సాధించి పట్టు బిగించింది. హోరాహోరీ పోరులో ప్రతి రౌండ్‌లోనూ నువ్వా నేనా అన్నట్లు ఓట్లను తెచ్చుకుని అధికార పార్టీకి దీటుగా నిలిచింది. ఇక్కడ గెలిచి ఉంటే.. హ్యాట్రిక్ విజయాలతో పూర్తిస్థాయి ఆత్మ విశ్వాసంతో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లి ఉండేది. స్వల్ప తేడాతో ఓటమి పాలవడంతో ఇప్పుడు ఆత్మ విశ్వాసం కాస్త తగ్గినా.. తమది కాని మైదానంలో అధికార పార్టీకి ముచ్చెమటలు పట్టించడం కచ్చితంగా ఆ పార్టీకి ఊరటనిచ్చేదే! చివరి వరకూ పోరాడి, గెలుపు ముంగిట తడబడినా.. ఈ ఉప ఎన్నిక ఫలితం బీజేపీ క్యాడర్‌లో స్థైర్యం నింపేదే! నిజానికి, గత ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ సాధించిన ఓట్లు కేవలం 12,725 మాత్రమే. నాలుగేళ్ల వ్యవధిలోనే దాదాపు ఏడు రెట్లు అధికంగా ఇక్కడ ఓట్లను సాధించింది. దక్షిణ తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీకి అంతగా పట్టు లేదనే అభిప్రాయం ఇప్పటి వరకూ ఉంది. తాజా ఎన్నికతో ఆ అభిప్రాయం పటాపంచలు అవుతుందని ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి.
మునిసిపల్ ప్రాంతాల కంటే గ్రామీణ ప్రాంతాల్లో పోటాపోటీగా ఓట్లు రావడమే ఇందుకు నిదర్శనమని ఆ పార్టీ నేత ఒకరు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోకి కూడా తమ పార్టీ చొచ్చుకొని వెళ్లిందని చెప్పడానికి మునుగోడు ఉప ఎన్నికలో వచ్చిన ఓట్లు ప్రతీకలని అభిప్రాయపడ్డారు. ‘‘మాకు గట్టి పట్టున్న చౌటుప్పల్ మునిసిపాలిటీలో ఆశించిన మేర మెజారిటీ సాధించలేకపోయాం. పోల్ మేనేజ్‌మెంట్‌లో లోపం కారణంగానే పట్టున్న ప్రాంతాల్లోనూ మెజారిటీ రాలేదు. అనూహ్యంగా గ్రామీణ ప్రాంత ఓటర్లు స్పందించారు.సీఎం సైతం ఒక గ్రామానికి ఇన్‌చార్జిగా వ్యవహరించినా అధికార పార్టీ పెద్ద మెజారిటీ సాధించలేకపోవడానికి మా ప్రచార వ్యూహమే కారణం. ఉప ఎన్నికలో మా అభ్యర్థిగా రాజగోపాల్‌రెడ్డి ఓడిపోవచ్చు. కానీ, బీజేపీ గెలిచింది’’ అని ఆ సీనియర్ నేత ఒకరు విశ్లేషించారు. తమకు ఏ ఇరవై వేలో, ముప్పై వేలో ఓట్లు వచ్చి ఉంటే ఈ మాట అని ఉండేవారం కాదని చెప్పారు.
ఇక ఆపరేషన్ కమల్!
రాబోయే రోజుల్లో బీజేపీ పూర్తిస్థాయిలో అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా పావులు కదపనుంది. సర్వ శక్తులూ ఒడ్డినా అధికార పార్టీ అత్తెసరు మెజారిటీకే పరిమితమైందని, తద్వారా ప్రభుత్వంపై వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో కళ్లకు కట్టినట్లు అర్థమవుతోందని కమలనాథులు వివరిస్తున్నారు. తమకు అసలు ఏమాత్రం పట్టు లేని ప్రాంతాల్లో కూడా కేవలం అభ్యర్థి బలంతో బరిలోకి దిగామని, ప్రభుత్వంపై వ్యతిరేకతపాటు అభ్యర్థి బలం కారణంగా ఆయా నియోజక వర్గాల్లో పాగా వేయగలిగామని భావిస్తున్నారు. ఇందుకు దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడును ఉదాహరిస్తున్నారు. మునుగోడులో ఓడినా పార్టీ ఓటు బ్యాంకు గణనీయంగా మెరుగు పడిందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో, రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు అన్ని నియోజక వర్గాల్లోనూ బలమైన నాయకులు ఉంటే టీఆర్‌ఎ్‌సకు ముచ్చెమటలు పట్టించి కాషాయ జెండా ఎగరేయడం సాధ్యమని భావిస్తున్నారు. బలమైన నాయకులతోపాటు ఆయా పార్టీల క్యాడర్ కూడా వారి వెంట వస్తే తమ గెలుపు నల్లేరుపై బండి నడక అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే, ఇక నుంచి ఇతర పార్టీల నుంచి బలమైన నాయకులను పార్టీలోకి ఆకర్షించడాన్ని మరింత ముమ్మరం చేయాలని భావిస్తున్నారు. తాజా ఎన్నికలతో మరోసారి కాంగ్రె్‌సకు రాష్ట్రంలో భవిష్యత్తు లేదనే స్పష్టమైన సంకేతాలు వెలువడ్డాయని, ఇక ఆ పార్టీ నుంచి వలసలు తమ పార్టీలోకి వెల్లువెత్తుతాయని కమలనాథులు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో, టీఆర్‌ఎ్‌సపై దాడిని కూడా ముమ్మరం చేయాలని భావిస్తున్నారు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబానికే అన్ని కొలువులూ వచ్చాయన్న తమ ప్రచారం మంచి ఫలితాలను ఇచ్చిందని, ఇక నుంచి కుటుంబ పాలన టార్గెట్‌గా విమర్శలను గుప్పించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. దీనికితోడు, ప్రభుత్వ అవినీతిపై కేవలం విమర్శలు చేయడం కాకుండా స్పష్టమైన ఆధారాలను ప్రజల ముందు ఉంచాలని, ఈ మేరకు పార్టీ అధిష్ఠానంతో కలిసి కార్యాచరణను అమలు చేయాలని భావిస్తున్నారు.
కమలం వైపే యువత..!
గత ఎన్నికలతో పోలిస్తే.. దాదాపు అన్ని వర్గాల్లోనూ బీజేపీ తన ప్రాభవాన్ని పెంచుకుంది. మరీ ముఖ్యంగా, యువత ఈసారి తమకే మద్దతు ఇచ్చారని బీజేపీ నేతలు భావిస్తున్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయకపోవడం, ఏళ్ల తరబడి ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకపోవడం వల్ల నిరుద్యోగ యువకులు తమవైపు నిలిచారని బీజేపీ ముఖ్య నేత ఒకరు అభిప్రాయపడ్డారు. వివిధ కారణాలతో కొంతమంది వృద్ధులు టీఆర్‌ఎస్, కాంగ్రెస్ వైపు ఆసక్తి చూపినా, వారి పిల్లలు ఒత్తిడి చేసి మా వైపు వారు ఆకర్షితులయ్యేలా ప్రభావితం చేశారని ఆయన తెలిపారు. పార్టీకి ఓటు బ్యాంకు గణనీయంగా పెరగడానికి ఇదొక కారణమని విశ్లేషించారు.
సమన్వయ లోపం.. ఆధిపత్య పోరు
పార్టీ ముఖ్య నేతల మధ్య ఆధిపత్య పోరు, ఎన్నికల ప్రచారంలో సమన్వయ లోపం కూడా తమ అభ్యర్థి ఓటమికి కారణమని బీజేపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ అభ్యర్థిపై వ్యతిరేకత ఉన్నా, దానిని ఆశించిన మేర సొమ్ము చేసుకోలేకపోయామని పేర్కొంటున్నారు. ‘‘మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నికకు సంబంధించి స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేసినప్పుడే నేతల్లో అంతర్గతంగా విభేదాలు గుప్పుమన్నాయి. 16 మంది సీనియర్ నేతలతో ఏర్పాటు చేసిన స్టీరింగ్ కమిటీలో స్వామిగౌడ్, దాసోజు శ్రవణ్ వంటివారికి అవకాశం కల్పించడం పెద్ద తప్పిదం. ప్రచారం కీలక సమయంలో ఉన్నప్పుడు వారిద్దరూ టీఆర్‌ఎ్‌సలో చేరడాన్ని మా నాయకులు ఎలా సమర్థించుకుంటారు?’’ అని సీనియర్ నేత ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. మరి కొంతమందిని మండల ఇన్‌చార్జులుగా నియమించారని, వారిలో కొంతమంది ప్రచారానికి ఆలస్యంగా వచ్చారని ఆయన చెప్పారు. ‘‘రోజుకో తీరున ప్రచార షెడ్యూలు మార్చడం కూడా కేడర్‌లో కొంత అయోమయం సృష్టించింది. మండల స్థాయిలో సమావేశాలు అని ఒకసారి, కాదు, ఒకేచోట బహిరంగ సభ అని మరోసారి, కాదుకాదు మండలాల్లోనే బహిరంగ సభలు అని ఇంకోసారి.. ఇలా కీలక సమయంలో ప్రచార సరళిని మార్చడం కూడా ఓటమికి ఒక కారణం’’ అని పార్టీ నేత ఒకరు విశ్లేషించారు. ఇక, రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ నుంచి వచ్చినా.. గత ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటు వేసిన వారిలో కొంతమంది మాత్రమే తమవైపు మొగ్గు చూపారని వివరించారు.
Read more

