హైదరాబాద్‌లో డబుల్‌ డెక్కర్‌ ఫ్లైఓవర్‌?

ABN , First Publish Date - 2022-05-11T08:27:48+05:30 IST

హైదరాబాద్‌ మహానగరంలో డబుల్‌ డెక్కర్‌ ఫ్లైఓవర్‌ బ్రిడ్జి నిర్మాణానికి కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ఇటీవల కీలక ప్రతిపాదన చేశారు.

హైదరాబాద్‌లో డబుల్‌ డెక్కర్‌ ఫ్లైఓవర్‌?

  • పైన మెట్రో.. కింద రోడ్డు.. మధ్యలో ఎలివేటెడ్‌ హైవే
  • కేంద్రం ప్రతిపాదన.. రాష్ట్రం అంగీకారంపై రాని స్పష్టత


హైదరాబాద్‌, మే 10(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ మహానగరంలో డబుల్‌ డెక్కర్‌ ఫ్లైఓవర్‌ బ్రిడ్జి నిర్మాణానికి కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ఇటీవల కీలక ప్రతిపాదన చేశారు. ట్రాఫిక్‌ రద్దీ అత్యంత ఎక్కువగా ఉండే హైదరాబాద్‌-పూణె జాతీయ రహదారిపై బీహెచ్‌ఈఎల్‌ రోడ్డు వద్ద దీన్ని నిర్మించాలని సూచించారు. దాదాపు రెండు కిలోమీటర్ల పొడవు కలిగిన డబుల్‌ డెక్కర్‌ ఫ్లైఓవర్‌ నిర్మించాలని ప్రాథమికంగా నిర్ధారించారు. తొలుత ఇక్కడ ఒక్క ఫ్లైఓవర్‌ బ్రిడ్జి మాత్రమే నిర్మించాలని జాతీయ రహదారుల సంస్థ ప్రతిపాదించింది. ఈ మేరకు రూ.96.51 కోట్లు మంజూరు చేయడంతో పాటు టెండరు కూడా ఫైనల్‌ అయింది. అయితే, ఇక్కడి ట్రాఫిక్‌ రద్దీని పరిశీలించిన అనంతరం ఇచ్చిన టెండర్లను కేంద్ర మంత్రి గడ్కరీ ఆదేశాలతో ఎన్‌హెచ్‌ఏఐ నిలుపుదల చేసింది. మరో 50 ఏళ్ల వరకు ట్రాఫిక్‌ చిక్కులు తలెత్తకుండా ఉండేలా ఈ రోడ్డులో డబుల్‌ డెక్కర్‌ ఫ్లైఓవర్‌ నిర్మించాలని జాతీయ రహదారుల శాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే మెట్రోరైల్‌ రెండో దశను బీహెచ్‌ఈఎల్‌ ఆవతలి వరకు విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. అయితే, స్థానికులు మెట్రోరైల్‌ను పటాన్‌చెరు ఆవతల ఔటర్‌ రింగ్‌ రోడ్డు ముత్తంగి జంక్షన్‌ వరకు విస్తరించాలని కోరుతున్నారు.


మెట్రోరైల్‌ రెండో దశను విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్న వార్తల నేపథ్యంలో మల్టీ ఫ్లైఓవర్‌ వస్తే బాగుంటుందని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ అభిప్రాయపడినట్లు సమాచారం. ఇక్కడ నాగ్‌పూర్‌ తరహాలో డబుల్‌ డెక్కర్‌ ఫ్లైఓవర్‌ నిర్మించాలని సూచించారు. ఇప్పటికే ఇచ్చిన పాత టెండర్లను నిలిపేసి రీడిజైన్‌ చేయాలని జాతీయ రహదారుల సంస్థ అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇంజినీరింగ్‌ వర్క్‌, డిజైనింగ్‌ సంబంధిత అంశాలపై అధికారులు కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది. డబుల్‌ డెక్కర్‌ బ్రిడ్జి నిర్మాణంలో ఒకే పిల్లర్‌పై రోడ్డు, మెట్రోరైల్‌ ట్రాక్‌ వస్తుంది. కింద రోడ్డు అలాగే ఉంటుంది. ఇలాంటి బ్రిడ్జిని నాగ్‌పూర్‌లోనూ నిర్మించినట్టు ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు చెబుతున్నారు. 3.14 కిలోమీటర్ల పొడవులో నిర్మించిన ఈ బ్రిడ్జిలో మధ్యలో 6 లేన్ల ఎక్స్‌ప్రెస్‌ వే నాగ్‌పూర్‌లో నిర్మించారు. పైన మెట్రోరైల్‌ ట్రాక్‌ ఏర్పాటు ఉండగా, కింద రోడ్డు అలాగే ఉంటుంది. దీంతో నాగ్‌పూర్‌లో ఈ డబుల్‌ డెక్కర్‌ నిర్మించిన ప్రాంతంలో ట్రాఫిక్‌ రద్దీ తగ్గింది. ప్రస్తుతం బీహెచ్‌ఈఎల్‌లో జాతీయ రహదారుల సంస్థ 2 కిలోమీటర్ల పొడవు ఫ్లైఓవర్‌ను నిర్మించాలని నిర్ణయించారు. రీడిజైన్‌ చేసి, పూర్తి స్థాయి డీపీఆర్‌ తయారు చేసిన తరువాతే దీనికి ఎంత ఖర్చు అవుతుందనే విషయం తెలుస్తుందని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు అభిప్రాయపడుతున్నారు. అయితే, గడ్కరీ ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలపాల్సి ఉంది. ఈ విషయంపై ఆంధ్రజ్యోతి సంప్రదిస్తే రాష్ట్ర ఆర్‌ అండ్‌ బీ అధికారులు స్పందించడానికి నిరాకరించారు.

Read more