టెన్త్‌ విద్యార్థుల్లో ఆందోళన తొలగించాలి

ABN , First Publish Date - 2022-05-14T05:58:45+05:30 IST

టెన్త్‌ విద్యార్థుల్లో ఆందోళన తొలగించాలి

టెన్త్‌ విద్యార్థుల్లో ఆందోళన తొలగించాలి
‘కాల్‌ యువర్‌ టీచర్‌’ ప్రోగ్రాంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ సీహెచ్‌.శివలింగయ్య

ఫోన్‌లో అందుబాటులో సబ్జెక్టు ఎక్స్‌పర్ట్స్‌

జిల్లా కలెక్టర్‌ సీహెచ్‌.శివలింగయ్య

జనగామ కల్చరల్‌, మే 13: పదవ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల్లో పరీక్షల పట్ల నెలకొన్న భయాన్ని, ఆందోళనను తొలగించడంలో సబ్జెక్టు ఎక్స్‌పర్ట్స్‌, ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్‌ సీహెచ్‌.శివలింగయ్య కోరారు. జనగామ కలెక్టరేట్‌లో శుక్రవారం పదవ తరగతి పరీక్షలపై విద్యార్థుల్లో ఆందోళన, భయం తొలగించి ఆత్మస్థైర్యం కల్పించే విషయంపై సబ్జెక్టు ఎక్స్‌పర్ట్స్‌, ఉపాధ్యాయులతో ‘కాల్‌ యువర్‌ టీచర్‌’ ప్రోగ్రాం ద్వారా సమీక్ష నిర్వహించారు. డీఈవో కె.రాముతో కలిసి నిర్వహించిన సమావేశంలో జిల్లాలోని పలు పాఠశాలల విద్యార్థులు, సబ్జెక్టు ఎక్స్‌పర్ట్స్‌, ఉపాధ్యాయులకు ఫోన్‌  చేసి సందేహాలు నివృత్తి చేసుకున్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌ శివలింగయ్య మాట్లాడుతూ ఈ నెల 23 నుంచి ప్రారంభమయ్యే పదవ తరగతి పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా పకడ్బందీ ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో 181 పాఠశాలలకు చెందిన 6,939 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారన్నారు. ప్రతి పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాల ఏర్పాటు, వేసవి జాగ్రత్తలతో పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా పాఠశాలల నుంచి ఎంపిక చేసిన సబ్జెక్టు ఎక్స్‌పర్ట్స్‌ ప్రతి రోజు ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఫోన్‌లో అందుబాటులో ఉంటారని, విద్యార్థులు తమ సందేహాలను నివృత్తి చేసుకోవాలన్నారు. ఈ నెల 21 వరకు ‘కాల్‌ యువర్‌ టీచర్‌’ ఫోన్‌ ఇన్‌ ప్రోగ్రాం అమలులో ఉంటుందన్నారు. ఇతర వివరాలకు 79950 87623 లేదా 94416 03468 నంబర్లలో సంప్రదించాలని కలెక్టర్‌ సూచించారు.

Read more