శ్రీనివాస్‌గౌడ్‌కు క్లీన్‌చిట్‌

ABN , First Publish Date - 2022-05-12T09:28:14+05:30 IST

ఎన్నికల అఫిడవిట్ల ట్యాంపరింగ్‌ ఆరోపణల కేసులో రాష్ట్ర మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌కు భారత ఎన్నికల సంఘం క్లీన్‌చిట్‌ ఇచ్చింది. ఈ మేరకు మంత్రిపై ట్యాంపరింగ్‌ ఆరోపణల కేసును కొట్టివేసింది.

శ్రీనివాస్‌గౌడ్‌కు క్లీన్‌చిట్‌

  • ఎన్నికల అఫిడవిట్లలో ట్యాంపరింగ్‌ జరగలేదు
  • మొత్తం నాలుగు సెట్ల నామినేషన్లు దాఖలు
  • అనుసంధాన అఫిడవిట్లలో ఒక్కటే పరిగణనలోకి
  • వెబ్‌ జెనెసిస్‌ అప్లికేషన్‌ వల్లే ఇన్విజిబుల్‌గా అఫిడవిట్లు
  • రాఘవేంద్రరాజు ఫిర్యాదుపై ఎవరినీ బాధ్యులను 
  • చేయలేం.. ఎన్నికల సంఘం స్పష్టీకరణ
  • కేసును కొట్టివేస్తూ మెమో జారీ


హైదరాబాద్‌/మహబూబ్‌నగర్‌, మే 11 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల అఫిడవిట్ల ట్యాంపరింగ్‌ ఆరోపణల కేసులో రాష్ట్ర మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌కు భారత ఎన్నికల సంఘం క్లీన్‌చిట్‌ ఇచ్చింది. ఈ మేరకు మంత్రిపై ట్యాంపరింగ్‌ ఆరోపణల కేసును కొట్టివేసింది. అఫిడవిట్లలో ఎలాంటి ట్యాంపరింగ్‌ జరగలేదని, నాలుగు సెట్లుగా దాఖలు చేసిన నామినేషన్ల అనుసంధానిత అఫిడవిట్లలో ఒక్కదానిని మాత్రమే పరిగణనలోకి తీసుకున్నామని తెలిపింది. మిగతా అఫిడవిట్లు వెబ్‌సైట్‌లో ఇన్విజిబుల్‌(కనిపించకుండా)గా ఉండిపోతాయని, వీటిని తొలగించడం(వీడ్‌ అవుట్‌) సాధ్యం కాదని పేర్కొంది. దీనికి సంబంధించి భారత ఎన్నికల సంఘం జారీ చేసిన వివరణ మెమో కాపీలను ఫిర్యాదుదారు సి.రాఘవేంద్రరాజుకు, మహబూబ్‌నగర్‌ కలెక్టర్‌కు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్‌ ఈ నెల 7న పంపించారు. ఈ మెమో బుధవారం వెలుగులోకి వచ్చింది. 2018 ఎన్నికల సమయంలో మహబూబ్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చే సిన ప్రస్తుత మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ అఫిడవిట్లను ట్యాంపరింగ్‌ చేశారంటూ అదే ప్రాంతానికి చెందిన రాఘవేంద్రరాజు ఈసీకి ఫిర్యాదు చేశారు. మంత్రి తన నామినేషన్‌తోపాటు తొలుత సమర్పించిన అఫిడవిట్‌ను ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌ నుంచి తొలగించి, రెండో అఫిడవిట్‌ను అప్‌లోడ్‌ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. 


సీఈవో నివేదిక ఆధారంగా..

సి.రాఘవేంద్రరాజు 2021 ఆగస్టు 2న, ఆ తర్వాత 2021 డిసెంబరు 16న ఇచ్చిన ఫిర్యాదులపై తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని నివేదిక కోరామని ఈసీఐ తాజా మెమోలో తెలిపింది. ఆ మేరకు మహబూబ్‌నగర్‌ జిల్లా ఎన్నికల అథారిటీ, అక్కడి రిటర్నింగ్‌ అధికారి ద్వారా ఈ ఫిర్యాదులపై విచారణ జరిపించి, సీఈవో నివేదిక ఇచ్చారని వివరించింది. ఇందులో అఫిడవిట్ల ట్యాంపరింగ్‌ ఏదీ జరగలేదని తేలినట్లు పేర్కొంది. మంత్రికి క్లీన్‌చిట్‌ ఇస్తూ తాజా ఉత్తర్వులు జారీ చేసింది. రాఘవేంద్రరాజు ఇచ్చిన ఫిర్యాదులో మొదటి అఫిడవిట్‌కు, రెండో అఫిడవిట్‌కు తేడాలున్నాయనేది ప్రధాన ఆరోపణ కాగా, తమ వెబ్‌ జెనెసిస్‌ అప్లికేషన్‌ ప్రకారం.. ఒక్క అఫిడవిట్‌ను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని తెలిపింది.


మిగతా అఫిడవిట్లు పబ్లిక్‌ డొమైన్‌లో ఉండవని, దీనికి ఎవరినీ బాధ్యులను చేయలేమని పేర్కొంది. రాఘవేంద్రరాజు ఫిర్యాదుపై భవిష్యత్తులోనూ ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఎన్నికల సంఘం ఉత్తర్వులను వివరిస్తూ జిల్లా కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అఫిడవిట్‌లో ఎలాంటి అక్రమాలు జరగలేదని ఈసీఐ స్పష్టం చేసినట్లు తెలిపారు. అధికారులందరూ నిష్పక్షపాతంగా వ్యవహరించారని కలెక్టర్‌ పేర్కొన్నారు.

Read more