మరో 2 వేల కోట్ల రుణానికి బ్రేక్‌!

ABN , First Publish Date - 2022-05-14T07:57:55+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన బహిరంగ మార్కెట్‌ అప్పులపై మళ్లీ పిడుగు పడింది.

మరో 2 వేల కోట్ల రుణానికి బ్రేక్‌!

వేలంలో పాల్గొనే అవకాశమివ్వని ఆర్‌బీఐ

రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన బహిరంగ మార్కెట్‌ అప్పులపై మళ్లీ పిడుగు పడింది. ఈ నెల 17న తీసుకోవాలని నిర్ణయించిన రూ.2 వేల కోట్ల అప్పునకు భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) బ్రేక్‌ వేసింది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అనుమతి లభించకపోవడంతో ఈ-వేలంలో పాల్గొనే అవకాశాన్ని తెలంగాణకు ఆర్‌బీఐ కల్పించలేదు. పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్‌తోపాటు మూడు రాష్ట్రాల అప్పులకు మాత్రం అనుమతించింది. దీంతో అప్పుల అంశం క్రమంగా రాజకీయ రంగు పులుముకుంటోంది. కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే రాష్ట్రాన్ని వేధిస్తోందని ఇక్కడి మంత్రులు, అధికార టీఆర్‌ఎస్‌ నేతలు ఆరోపిస్తున్నారు. మొన్నటివరకు ధాన్యం కొనుగోళ్లపై పేచీ పెట్టి రాష్ట్రాన్ని ఇరకాటంలోకి నెట్టేసిన కేంద్రం.. ఇప్పుడు అప్పులు పుట్టకుండా కాళ్లలో కట్టెలు పెట్టి అడ్డుకుంటోందని విమర్శిస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.59,632 కోట్ల అప్పు తీసుకోవాలని బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. కానీ,  కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభించకపోవడంతో ఏప్రిల్‌ పూర్తయి, మే నెల సగం గడిచిపోయినా.. ఇప్పటివరకు నయా పైసా అప్పు పుట్టలేదు. ఏప్రిల్‌లో తీసుకోవాల్సిన రూ.3 వేల కోట్ల అప్పు అందకుండా పోయింది. ఈ నెల 2న రూ.3 వేల కోట్ల అప్పునకు కూడా అనుమతి లభించలేదు. ఈ నెల 17న ఆర్‌బీఐ వేలం జరగనుండగా.. కేంద్రం నుంచి అనుమతి లభించకపోవడంతో తెలంగాణను ఆర్‌బీఐ పక్కన పెట్టింది.


పర్యవసానంగా 17న తీసుకోవాలనుకున్న రూ.2 వేల కోట్ల అప్పునకు బ్రేక్‌ పడింది. ఈ నెల 31న మరో రూ.3 వేల కోట్ల అప్పు తీసుకోవాల్సి ఉంది. దీనికైనా అనుమతి లభిస్తుందో లేదో చూడాలి. కాగా, 17న వేలంలో పాల్గొనేందుకు ఆర్‌బీఐ మూడు రాష్ట్రాలను అనుమతించింది. రూ.2 వేల కోట్ల అప్పు కోసం ఆంధ్రప్రదేశ్‌, రూ.5 వేల కోట్లకు మహారాష్ట్ర, రూ.1500 కోట్లకు రాజస్థాన్‌ ఇండెంట్లు పెట్టాయి. ఈ నెల 17న జరిగే వేలం ద్వారా ఆ మూడు రాష్ట్రాలు రూ.8,500 కోట్ల మేర అప్పులు పొందబోతున్నాయి. 

Read more