‘రైతు బంధు’ను ఇక మర్చిపోవాల్సిందే..: విజయశాంతి
ABN , First Publish Date - 2022-05-15T01:53:09+05:30 IST
రైతుబంధు పథకాన్ని ఇక మర్చిపోవాల్సిందే అని బీజేపీ నేత విజయశాంతి అన్నారు. ఎన్నికల ముందు బంగారు తెలంగాణ అంటూ.. ప్రస్తుతం రాష్ట్రాన్ని అప్పుల..

హైదరాబాద్: రైతుబంధు పథకాన్ని ఇక మర్చిపోవాల్సిందే అని బీజేపీ నేత విజయశాంతి అన్నారు. ఎన్నికల ముందు బంగారు తెలంగాణ అంటూ.. ప్రస్తుతం రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మార్చారన్నారు. తెలంగాణను మరో శ్రీలంకలా మారుస్తున్నారని, ఇప్పటికైనా ప్రజలు మేల్కోవాలని సూచించారు. సోషల్ మీడియా వేదికగా ఆమె టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే..
‘‘కేసీఆర్ బంగారు తెలంగాణ అంటూ... రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మార్చిండు. తెలంగాణను మరో శ్రీలంకల మారుస్తున్నడు. కేసీఆర్ సర్కార్ ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయింది. తెలంగాణ ఏర్పడినప్పుడు ధనిక రాష్ట్రంగానే ఉండేది. కానీ ఇప్పుడు అప్పుల కుప్పగా మారిపోయింది. రైతులు కేసీఆర్ పాలనలో అరిగోసలు పడుతున్నారు. ఈ నెలలో పడాల్సిన రైతు బంధు పైసల గురించి మర్చిపోవాల్సిందే. ప్రభుత్వం దగ్గర డబ్బుల్లేవ్. ఈ నెలలోనే కాదు... కనీసం వచ్చే నెలలోనైనా రైతు బంధు పైసలు పడతాయనే గ్యారెంటీ లేదు. ప్రస్తుత సీజన్లో మొత్తం రూ.7,600 కోట్లు పంపిణీ చేయాల్సి ఉంటుందని వ్యవసాయ, ఆర్థిక శాఖలు ప్రాథమికంగా అంచనా వేశాయి. ఇంత పెద్ద మొత్తంలో నిధులు సమకూర్చుకోవడం కష్టంగా మారింది. 2018లో రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టినపుడు మే నెలలోనే చెక్కులు పంపిణీ చేశారు’’.
‘‘ఆ తర్వాత క్రమంగా ఆలస్యమవుతూ వస్తోంది. మే నెలలో ఇవ్వలేకపోవడమేకాదు... మరుసటి నెలలో కూడా వేసేలా కూడా కనిపించడం లేదు. ఒకవేళ వేసినా అది కూడా ఏకకాలంలో కాదు... వారం పది రోజుల వ్యవధి తీసుకుని రోజుకో ఎకరం చొప్పున పెంచుకుంటూ రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తారు. అందుకు అనుగుణంగా సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేసుకుంటున్నరు. తొలుత ఎకరం, రెండెకరాలు, మూడెకరాలు, నాలుగెకరాలు... ఇలా 10 ఎకరాల వరకు పది విడతలుగా నిధులు జమ చేయనున్నారు. కేసీఆర్ కుటుంబ పాలనలో తెలంగాణను మరో శ్రీలంకలా మార్చేయకముందే సార్‌ని, కారుని పర్మినెంట్‌గా ఫామ్‌హౌస్‌కు పంపిద్దాం’’. అని విజయశాంతి పేర్కొన్నారు.