Bandi Sanjay : ప్రత్యామ్నాయం మేమే
ABN, First Publish Date - 2022-11-07T03:36:36+05:30
రాష్ట్రంలో టీఆర్‌ఎ్‌సకు ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమేనని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు. ఈ విషయం మునుగోడు ఉప ఎన్నిక ఫలితాల ద్వారా మరోసారి నిరూపితమైందన్నారు.
మునుగోడులో ప్రజాతీర్పును శిరసావహిస్తాం
సింగిల్‌గా పోటీచేసి 86వేల ఓట్లు సాధించాం
అంతా కలిసినా వారికి 10వేల మెజారిటీయే!
కేసీఆర్ మునుగోడుకు ఇచ్చిన హామీలన్నీ
15 రోజుల్లో నెరవేర్చాల్సిందే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
హైదరాబాద్, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో టీఆర్‌ఎ్‌సకు ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమేనని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు. ఈ విషయం మునుగోడు ఉప ఎన్నిక ఫలితాల ద్వారా మరోసారి నిరూపితమైందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ఖతమైందని, సిటింగ్ స్థానాన్ని కోల్పోయిన ఆ పార్టీకి డిపాజిట్ కూడా రాలేదని చెప్పారు. వామపక్షాలతో ప్రత్యక్షంగా, కాంగ్రె్‌సతో పరోక్షంగా పొత్తు పెట్టుకుని పోటీ చేసినా.. మనీ, మద్యాన్ని పారించినా.. ఎన్నికల సంఘం అధికారులను, పోలీసులను అడ్డుపెట్టుకున్నా.. టీఆర్‌ఎస్ 10 వేలకు మించి మెజారిటీ సాధించలేకపోయిందన్నారు. బీజేపీ సింహంలా సింగిల్‌గా పోటీ చేసి గతంతో పోలిస్తే 7 రెట్లు అధికంగా 86 వేలకుపైగా ఓట్లు సాధించిందని చెప్పారు. ఆదివారం సాయంత్రం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ ఓబీసీ జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, ఇతర నేతలతో కలిసి సంజయ్ విలేకరులతో మాట్లాడారు. ప్రజా తీర్పును శిరసావహిస్తున్నట్లు తెలిపారు. మునుగోడులో గెలిచిన కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి అభినందనలు తెలిపారు. ఓడితే కుంగిపోమని, గెలిస్తే పొంగిపోమని చెప్పారు. పార్టీని నమ్మి కాంగ్రె్‌సకు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీ తరఫున పోటీ చేసిన రాజగోపాల్‌రెడ్డి ప్రజల కోసమే పనిచేశారని, ఆయన హీరోలాగా పోరాడారన్నారు. దాడులు, లాఠీచార్జిలు, కేసులను ఎదుర్కొని.. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా బీజేపీ కార్యకర్తలు కష్టపడి పనిచేశారని, వారందరికీ సెల్యూట్ చేస్తున్నానని సంజయ్ చెప్పారు.
ఎన్నికల్లో గెలిపిస్తే మునుగోడు సమస్యలన్నీ 15 రోజుల్లో పరిష్కరిస్తానని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని.. ఆ హామీని నెరవేర్చకపోతే తమ పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. కాంగ్రెస్ నుంచి గెలిచి బీజేపీలోకి వచ్చిన రాజగోపాల్‌రెడ్డి చేత రాజీనామా చేయించి ప్రజా తీర్పు కోరామని.. టీఆర్‌ఎస్ మాత్రం ఇతర పార్టీల నుంచి గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలను పశువుల్లెక్క కొన్నదని ఆరోపించారు. దమ్ముంటే వారితో రాజీనామా చేయించి ఎన్నికల్లో పోటీ చేయించాలని సవాల్ విసిరారు. అసలు ఈ గెలుపు అయ్యదా? కొడుకుదా? అల్లుడిదా? అభ్యర్థిదా? సీపీఐ, సీపీఎంలదా?.. లోపాయికారీ ఒప్పందం చేసుకున్న కాంగ్రె్‌సదా?.. అనేది టీఆర్‌ఎస్ నేతలు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. మునుడోడు ఫలితాలపై విశ్లేషించుకుంటామని, రాబోయే ఎన్నికల్లో గెలిచి తీరుతామని చెప్పారు. మునుగోడులో గెలుపునకు కొందరు పోలీసులు, ఎన్నికల అధికారులు టీఆర్‌ఎ్‌సకు సహకరించారని ఆరోపించారు. పోలీసులే దగ్గరుండి డబ్బులు పంచారని విమర్శించారు. సొంత అవసరాల కోసం తీసుకెళ్లిన బీజేపీ నేతల సొమ్మును పట్టుకుని తప్పుడు ప్రచారం చేశారని పేర్కొన్నారు. వందల కోట్లు పంచిన టీఆర్‌ఎస్ నేతలకు సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎందుకు పట్టుకోలేదో సమాధానం చెప్పాలన్నారు.
ఆరు చోట్ల పోటీ.. 4 చోట్ల గెలిచాం: లక్ష్మణ్
దేశవ్యాప్తంగా 7 స్థానాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ 6 చోట్ల పోటీ చేసి 4 స్థానాల్లో విజయం సాదించిందని పార్టీ ఓబీసీ జాతీయ మోర్చా అధ్యక్షుడు కె.లక్ష్మణ్ చెప్పారు. మోదీ నాయకత్వం పట్ల ప్రజలు చూపిన అభిమానానికి ఇదే కొలమానమని అన్నారు.
Updated Date - 2022-11-07T03:36:36+05:30 IST