అమిత్‌షా.. తెలంగాణకు ఏం చేశారో చెప్పండి?

ABN , First Publish Date - 2022-05-14T08:36:41+05:30 IST

తెలంగాణ పర్యటనకు వస్తున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా.

అమిత్‌షా.. తెలంగాణకు ఏం చేశారో చెప్పండి?

  • విద్వేషాలు కాదు.. రాష్ట్ర అభివృద్ధిపై మాట్లాడాలి
  • తెలంగాణపై వివక్ష వీడాలి: సబిత, రంజిత్‌రెడ్డి


హైదరాబాద్‌, మే 13 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ పర్యటనకు వస్తున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా.. ఈ ప్రాంతానికి ఏం చేశారో చెప్పాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. విద్వేష ప్రసంగాలు కాకుండా రాష్ట్ర అభివృద్ధిపై మాట్లాడాలన్నారు. విభజన హామీలను నెరవేరుస్తామని చెప్పిన తర్వాతే కేంద్ర మంత్రి ఇక్కడి నుంచి వెళ్లాలని డిమాండ్‌ చేశారు. శుక్రవారం టీఆర్‌ఎ్‌సఎల్పీలో రంగారెడ్డి జిల్లా టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌తో కలిసి మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించలేదని, రాష్ట్రానికి చెందిన ఏ ప్రతిపాదనను అనుమతించకుండా కేంద్రం చూపుతున్న వివక్షను వీడాలన్నారు. పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తామన్న సుష్మా స్వరాజ్‌ హామీని నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. కృష్ణా జలాల్లో తెలంగాణ  వాటా గురించి కేంద్రానికి సీఎం కేసీఆర్‌ అనేకసార్లు మొరపెట్టుకున్నా స్పందన లేదని, దీనిపైనా అమిత్‌ షా మాట్లాడాలన్నారు. బీజేపీ నేతలది ప్రజా సంగ్రామ యాత్ర కాదని, వారి పార్టీ అంతర్గత సంఘర్షణ యాత్ర అని ఎద్దేవా చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తెలంగాణకు కేంద్రం నుంచి ఎన్ని నిధులు తెచ్చారో.. శ్వేతపత్రం విడుదల చేయాలని, తన నియోజకవర్గం మహేశ్వరానికి ఎన్ని నిధులు తెచ్చింది ప్రజలకు వివరిస్తానని సబిత చెప్పారు.

Read more