త్రిశంకు స్వర్గంలో వీఆర్వోలు
ABN , First Publish Date - 2022-05-14T05:35:31+05:30 IST
రెవెన్యూ వ్యవస్థలో క్షేత్రస్థాయిలో అత్యంత కీలకమైన గ్రామ రెవెన్యూ అధికారుల వ్యవస్థను ప్రభుత్వం రద్దు చేసి ఇప్పటికి 19 నెలలు కావస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 5,850 మంది వీఆర్వో
ఏడాదిన్నరగా విధులు లేకుండా కొనసాగింపు
రూ.వందల కోట్ల ప్రజాధనం వృఽథా
సర్వీసు, ప్రమోషన్లపై ఉద్యోగుల ఆందోళన
అశ్వారావుపేట, మే 13: రెవెన్యూ వ్యవస్థలో క్షేత్రస్థాయిలో అత్యంత కీలకమైన గ్రామ రెవెన్యూ అధికారుల వ్యవస్థను ప్రభుత్వం రద్దు చేసి ఇప్పటికి 19 నెలలు కావస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 5,850 మంది వీఆర్వోలు విధులకు దూరంగా ఉద్యోగంలో కొనసాగుతున్నారు. ఇప్పటి వరకు వీరికి ఏ విధమైన జాబ్‌చార్ట్ కానీ, ఇతర శాఖలలోకి బదిలీ చేయడంగానీ చేయలేదు. కానీ ప్రభుత్వం వీరికి ప్రతినెల వేతనాలను మాత్రం చెల్లిస్తూనే ఉంది. అంటే 19 నెలలుగా వీఆర్వోలతో ఏ విధమైన పని చేయించకుండా జీతాలు చెల్లిస్తోంది. ప్రజాధనం వృధా చేస్తున్నారనే విమర్శలు ఒక వైపు వినిపిస్తుండగా 19నెలలుగా ఓ కేటర్ ఉద్యోగులకు జాబ్‌చార్ట్ లేకుండా కొనసాగిస్తున్న పరిస్థితి దేశంలో ఒక్క తెలంగాణలోనే ఉందనే విమర్శలూ వినిపిస్తున్నాయి. ఇక 19నెలలుగా తమను ఖాళీగా ఉంచడంతో తమ ఉద్యోగ భద్రతపై వీఆర్‌ఓల్లో కూడా ఆందోళన పెరిగిపతోంది.
19 నెలలుగా ఎదురుచూపులే..
రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూశాఖలో జరిగే అవినీతి, అక్రమాలకు వీఆర్వోలే కీలకమైన వారని భావించి అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా వీఆర్వో వ్యవస్థను రద్దు చేశారు. త్వరలోనే 5,850 వీఆర్వోలను వివిధ శాఖలలో సర్దుబాటు చేస్తామంటూ ప్రకటించారు. కానీ 19నెలలైనా ఇప్పటి వరకు వారిని ఎక్కడా సర్దుబాటు చేయలేదు. కనీసం వారికి జాబ్‌చార్ట్ కూడ లేదు. కానీ చాలాచోట్ల తహసీల్దార్లు వీఆర్వోలను అనధికారకంగా భూవివాదాలకు సంబంధించి సమస్యలపై విచారణకోసం ఉపయోగించుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి.
ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లలో నష్టం..
వీఆర్వోలు జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ కలిగి ఉంటారు. ప్రభుత్వం జూనియర్ అసిస్టెంట్లకు పదోన్నతి కల్పిస్తోంది. ఇంక్రిమెంట్లు వస్తున్నాయి. కానీ వీఆర్వోలకు సంబంధించి ప్రభుత్వం ఏ విధమైన నిర్ణయం తీసుకోకపోవడంతో పదోన్నతిలో వీరికి స్థానం లేకుండా పోయింది. ఇంక్రిమెంట్ల వంటి రాయితీలను, సర్వీసును కోల్పోతున్నారు. దీనివల్ల భవిష్యత్‌లో పదోన్నతి, స్థానికత, ఇంక్రిమెంట్స్, ఇతర అలవెన్స్‌లను కోల్పోయే ప్రమాదముందనే ఆందోళనలో వీఆర్వోలు ఉన్నారు. ఉద్యోగ భద్రతపై కూడా వీరు ఆందోళన చెందుతున్నారు. ఇటీవలే వీఆర్వోలను వేరే శాఖలలోకి సర్దుబాటు చేస్తామని ప్రకటన వచ్చినా దానిపై ఇప్పటి వరకు విధానపరమైన నిర్ణయం తీసుకోపోవడంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం తమను ఏదో ఒకశాఖలోకి సర్దుబాటు చేయడమో, రెవెన్యూలోనే విధులు అప్పగించడమో చేసి, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్స్, సర్వీసు నష్టం జరుగకుండా చూడాలని వీఆర్వోలు కోరుతున్నారు.
ప్రభుత్వ నిర్ణయంతో 5,850 మంది రోడ్డున పడ్డారు
- కొనబోయిన ప్రసాద్, వీఆర్వో సంఘం రాష్ట్ర కోశాధికారి
ప్రభుత్వం వీఆర్వో వ్యవస్థ రద్దు నిర్ణయం తీసుకోవడంతో ఒక్కసారిగా 5,850మంది వీఆర్వోలు రోడ్డునపడ్డారు. 19నెలలైనా ప్రభుత్వం వీరిని ఎక్కడా సర్దుబాటు చేయలేదు. తక్షణమే వారికి విధులు కేటాయించాలి.
సర్వీసు, పదోన్నతుల్లో నష్టం జరుగుతుంది
- కాకా శ్రీను, సంఘం భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు
భద్రాద్రి జిల్లాలో 223మంది వీఆర్వోలు ఉన్నారు. ప్రస్తుతం వీరికి జాబ్‌చార్ట్ ఇవ్వకపోవడంతో పదోన్నతులు, ఇంక్రిమెంట్ల విషయంలో తీవ్రంగా నష్టపోతున్నారు. వెంటనే వీరికి జాబ్‌చార్ట్ ఇవ్వాలి.

