ఎట్టకేలకు కదలిక..మున్సిపాలిటీగా మారనున్న ఆసిఫాబాద్‌

ABN , First Publish Date - 2022-05-15T04:26:41+05:30 IST

ఆసిఫాబాద్‌ మున్సిపాలిటీ ప్రతిపాదనపై ఎట్టకేలకు ప్రభుత్వంలో కదలిక వచ్చింది. గతంలోనే ఈ మేజర్‌ పంచాయతీని మున్సిపాలిటీగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 2017లోనే అప్పటి కలెక్టర్‌ చంపాలాల్‌తో ప్రతిపాదనలు తెప్పించుకొని రాష్ట్ర శాసనసభలో తీర్మాణం కూడా చేశారు.

ఎట్టకేలకు కదలిక..మున్సిపాలిటీగా మారనున్న ఆసిఫాబాద్‌

- కేబినెట్‌ తీర్మాణంతో కార్యచరణ ఆరంభించిన అధికారులు 

- అడ్డంకిగా ఉన్న రాజంపేట శివార్ల తొలగింపు?

- మున్సిపల్‌ సరిహద్దులను ఖరారు చేసిన అధికారులు

- ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న ప్రతిపాదన

(ఆంధ్రజ్యోతి, ఆసిఫాబాద్‌)

ఆసిఫాబాద్‌ మున్సిపాలిటీ ప్రతిపాదనపై ఎట్టకేలకు ప్రభుత్వంలో కదలిక వచ్చింది. గతంలోనే ఈ మేజర్‌ పంచాయతీని మున్సిపాలిటీగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 2017లోనే అప్పటి కలెక్టర్‌ చంపాలాల్‌తో ప్రతిపాదనలు తెప్పించుకొని రాష్ట్ర శాసనసభలో తీర్మాణం కూడా చేశారు. అప్పట్లో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ చేసిన తర్వాత కేవలం ఆసిఫాబాద్‌ మాత్రమే గ్రామ పంచాయతీగా ఉండి జిల్లా కేంద్రంగా మారింది. దాంతో మౌలిక సదుపాయాలు మొదలుకొని వివిధ ఆంశాలలో పాలనకు సాంకేతికంగా అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఈ దృష్ట్యా ఆసిఫాబాద్‌ మేజర్‌ పంచాయతీని నగరపంచాయతీగా లేదా మున్సిపాలి టీగా మార్చాలన్నా డిమాండ్‌ అధికారవర్గాల్లో నెలకొంది. మున్సిపల్‌ వ్యవహారాల శాఖ మంత్రి కేటీఆర్‌ సూచనల మేరకు అటు పెద్దపల్లి ఇటు ఆసిఫాబాద్‌, భద్రాది కొత్తగూడెం జిల్లాలోని సారపాక, ఆదిలాబాద్‌ జిల్లాలోని ఊట్నూరును ఆప్‌గ్రేడ్‌ చేయాలని తీర్మాణించారు. ఆయా ప్రతిపాదలను అప్పటి గవర్నర్‌ నరసింహన్‌కు రాష్ట్రపతి ఆమోదం కోసం పంపారు. అయితే ఆసిఫాబాద్‌ సహా మరో రెండు ప్రతిపాదనల్లో సింహభాగం ఏజెన్సీ ప్రాంతం కావడంతో 5వ షెడ్యూలు అడ్డంకిగా మారింది. దీంతో ఈ ప్రతిపాదనలు గవర్నర్‌ వద్దే పెండింగ్‌లో ఉన్నాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు చొరవ చూపించినా మారిన రాజకీయ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనలపై ఎలాంటి నిర్ణయం తీసుకొలేదు. దాంతో మధ్యే మార్గంగా మున్సిపల్‌ ఏర్పాటుకు ఆటంకంగా మారిన అంశాలను పరిష్కరించి వీలైనంత మేర రాష్ట్ర ప్రభుత్వ స్థాయి లోనే ఈ ప్రక్రియకు ముగింపు పలకాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలు స్తోంది. ఇందులో భాగంగానే ఇటీవలి రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సంద ర్భంగా ఆసిఫాబాద్‌ను మున్సిపాలిటీగా ఏర్పాటు చేసే అంశంపై చర్యలు ప్రారంభించాలని కేబినేట్‌ నిర్ణయించింది. ఈ క్రమంలోనే రాష్ట్ర మున్సిపల్‌ పరిపాలన విభాగం ఆసిఫాబాద్‌ మున్సిపాలిటీ ఏర్పాటుకు సంబంధించి విధివిధానాలు ఖరారు చేయాలని జిల్లా ఉన్నతాధికారులను అదేశించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆసిఫాబాద్‌ బల్దియా ఏర్పాటుకు అడ్డంకిగా మారిన రాజంపేట శివారు ప్రాంతాలను ప్రతిపాదనల నుంచి మినహా యించి మిగతా ప్రాంతాలతో మున్సిపాలిటీ పరిధిని ఏర్పాటు చేయాలని సంకల్పించినట్లు తెలుస్తోంది. అధికార వర్గాల ద్వారా తెలిసిన విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆసిఫాబాద్‌ బస్టాండు కేంద్రంగా నలువైపులా 1.5 కిలో మీటర్ల నుంచి 2కిలోమీటర్ల దూరంతో సరిహద్దులను నిర్ణయించారు. ఇందులో ఉత్తరాన ఆదిలాబాద్‌ క్రాస్‌రోడ్డు సమీపంలోని జిన్నింగ్‌ మిల్లుల పరిసరాలు, దక్షిణాన గొడవెల్లి ప్రాంతాలను ప్రామాణికంగా తీసుకొని హద్దులు నిర్ణయించినట్లు చెబుతున్నారు. అలాగే జూబ్లీమార్కెట్‌ నుంచి ఆటవీశాఖ చెక్‌పోస్టు వరకు ఉన్న రాజంపేట రెవెన్యూ పరిధిని ప్రత్యేక పంచాయతీగా మార్చే ఆవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇటీవల దీనిపై కలెక్టర్‌, ఆదనపుకలెక్టర్లు సర్వేయర్లతో కలిసి హద్దులను పరిశీలించినట్లు తెలిసింది. 

ప్రస్తుతం ప్రత్యేకాధికారులే దిక్కు

మూడేళ్ల క్రితం రాష్ట్రంలో జరిగిన మున్సిపల్‌ ఎన్నికలతో పాటే ఆసిఫా బాద్‌కు కూడ ఎన్నికలు జరుగవచ్చనే అంచనా వేసినా శాసనసభ తీర్మాణా నికి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయకపోవడంతో ప్రతిపాదనలు పెండింగ్‌లో పడ్డాయి. నాటి నుంచి ఇటు మున్సిపాలిటీ కాక అటు గ్రామ పంచాయతీగా ఎన్నికలు జరుగక జిల్లా కేంద్రం అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు లేకపోవడంతో జిల్లా ఉన్నతాధికారులే ప్రత్యేకాధికారులను నియమించి ఆసిఫాబాద్‌ పట్టణ ప్రజలకు పౌర సేవలను అందిస్తున్నారు.  అయితే పాలకవర్గం లేక పోవడంతో ఇప్పటికే  పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయినట్లు అధికారులు తెలుపుతున్నారు. సిబ్బంది జీతభత్యాలు మొదలుకొని పారిశుధ్య పనుల నిర్వహణ వరకు వచ్చే ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. ప్రత్యే కాధికారులు తమ ఇష్టానుసారంగా తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా నిధుల దుబార కూడా భారీగా జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Read more