జనాభాలో 46% పట్టణాల్లోనే
ABN, First Publish Date - 2022-05-14T08:51:51+05:30
రాష్ట్రంలో పట్టణ జనాభా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో దానికి అనుగుణంగా పురపాలికల్లో మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించాల్సిన అవసరం
- దీనికి అనుగుణంగా మౌలిక వసతులు
- జూన్ 2న ప్రజల వద్దకు ప్రగతి నివేదికలు
- పురపాలికల్లో త్వరలో వార్డు ఆఫీసర్ల వ్యవస్థ: కేటీఆర్
హైదరాబాద్, మే 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పట్టణ జనాభా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో దానికి అనుగుణంగా పురపాలికల్లో మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనాఉందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. ఈనెల 20 నుంచి జూన్ 5 వరకు పట్టణ ప్రగతి కార్యక్రమం చేపట్టనున్న సందర్భంగా రాష్ట్ర పురపాలకశాఖ ఆధ్వర్యంలో మునిసిపాలిటీల మేయర్లు, చైర్మన్లు, కమిషనర్లతో యూసు్‌ఫగూడ జెన్కో ఆడిటోరియంలో శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్ర జనాభాలో 46ు మంది పట్టణాల్లోనే జీవిస్తున్నారని, వచ్చే ఐదేళ్లలో సగానికిపైగా జనాభా పట్టణాలకు వచ్చే అవకాశం ఉందన్నారు. పట్టణాల్లో నివసించే వారి సంఖ్య పెరగడంతో మౌలిక వసతుల కల్పన సవాల్‌గా మారిందని చెప్పారు. దీనిని సమర్థంగా ఎదుర్కొనేందుకు భవిష్యత్తు అంచనాలతో అభివృద్ధి పనులపై దృష్టి పెట్టాలని సూచించారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి అన్ని మునిసిపాలిటీల్లో మోడల్ మార్కెట్లు, డిజిటల్ డోర్ నెంబరింగ్, ఆధునిక దోబీఘాట్లు, వ్యర్థాల శుద్ధి, నిర్వహణ ప్లాంట్, వెజ్, నాన్ వెజ్ మార్కెట్లు, ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్, వైకుంఠ ధామాలు, బయో మైనింగ్ వంటి లక్ష్యాలను సాధించాలని మంత్రి సూచించారు.
రాష్ట్రవ్యాప్తంగా పట్టణాల్లో చేపట్టిన అభివృద్ధి, ప్రగతి కార్యక్రమాలపై పురపాలికలు నివేదికలను సిద్ధం చేయాలని, జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు ప్రజల ముందు ఈ నివేదికలు ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. పురపాలికల్లో సిబ్బంది కొరతను అధిగమించేందుకు నియామక ప్రక్రియను పూర్తి చేస్తామని వెల్లడించారు. మునిసిపాలిటీల్లో వార్డు ఆఫీసర్ల వ్యవస్థను అందుబాటులోకి తెస్తామని, దీనికి సంబంధించి సిబ్బంది నియామకాన్ని త్వరలోనే పూర్తి చేయనున్నట్లు మంత్రి తెలిపారు.
సూర్యాపేట మార్కెట్ రాష్ట్రానికే ఆదర్శం
సూర్యాపేటలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్ రాష్ట్రానికే ఆదర్శంగా నిలువనుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణాన్ని దసరాలోపు పూర్తిచేసి, సీఎం కేసీఆర్ చేతులమీదుగా ప్రారంభించేలా చూడాలని మునిసిపల్ చైర్మన్ పెరుమాండ్ల అన్నపూర్ణమ్మ, కమిషనర్ రామాంజల్ రెడ్డికి మంత్రి సూచించారు. ఖమ్మం మునిసిపల్ కార్పొరేషన్‌ను రాష్ట్రంలోని ఇతర మునిసిపాలిటీలకు ఆదర్శంగా ఉండేలా తీర్చిదిద్దారని కేటీఆర్ ప్రశంసించారు. అభివృద్ధి, ప్రగతి కార్యక్రమాల ఆధారంగా రాష్ట్రంలోని పలు పురపాలికలకు మంత్రి కేటీఆర్ ప్రగతి పురస్కారాలను అందజేశారు. శానిటేషన్ కేటగిరిలో మణికొండ, గజ్వేల్, కోరుట్ల, సిద్దిపేట, ఓడీఎఫ్ సర్టిఫికేషన్ కేటగిరిలో భూత్పూర్, ఎల్లందు, మంచిర్యాల, గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్‌కు, ఆదాయ వనరుల పెంపులో ఆలంపూర్, శంషాబాద్, షాద్‌నగర్, సూర్యాపేట, ఆధునాతన వసతుల కల్పనలో తూఫ్రాన్, బాన్సువాడ, సిరిసిల్ల, కరీంనగర్, హరితహారం నిర్వహణలో పోచారం, కల్వకుర్తి, సంగారెడ్డి, ఖమ్మం పురపాలికలకు పురస్కారాలు దక్కాయి.
పల్లె, పట్టణ ప్రగతిపై 18న సీఎం సమీక్ష
రాష్ట్రంలో ఈనెల 20 నుంచి జూన్ 5 వరకు చేపట్టనున్న అయిదో విడత పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహణపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈనెల 18న ఉన్నతస్థాయి సమీక్ష జరగనుంది. సమావేశంలో మంత్రులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, అన్ని జిల్లాల కలెక్టర్లు, డీపీవోలు, అన్ని పురపాలికల మేయర్లు, చైర్మన్లు, కమిషనర్లు ఇతర ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.