IPL 2022: కేకేఆర్‌కు ఎదురుదెబ్బ.. ఐపీఎల్ నుంచి Pat Cummins అవుట్
ABN , First Publish Date - 2022-05-13T22:26:57+05:30 IST
ఐపీఎల్లో మరో రెండు లీగ్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్న కేకేఆర్ (KKR)కు ఎదురుదెబ్బ తగిలింది. తుంటి
ముంబై: ఐపీఎల్లో మరో రెండు లీగ్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్న కేకేఆర్ (KKR)కు ఎదురుదెబ్బ తగిలింది. తుంటి గాయం కారణంగా ఆ జట్టు పేసర్ పాట్ కమిన్స్ (Pat Cummins) జట్టుకు దూరమయ్యాడు. శ్రీలంకతో త్వరలో జరగనున్న సిరీస్ నేపథ్యంలో ఇంటికి చేరుకుని విశ్రాంతి తీసుకోనున్నాడు.
ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. మంగళవారం ముంబై ఇండియన్స్ (Mumbai Indians)తో జరిగిన మ్యాచ్‌లో కమిన్స్ నాలుగు ఓవర్లలో 22 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత నిర్వహించిన ఎంఆర్ఐ పరీక్షల్లో కుడి తుంటికి స్వల్పంగా గాయమైనట్టు తేలింది.
ఆస్ట్రేలియాకు బయలుదేరేముందు కమిన్స్ మాట్లాడుతూ.. ఇండియాలో చాలా అద్భుతంగా గడిచిందన్నాడు. తనను, తన కుటుంబాన్ని కంటికి రెప్పలా చూసిన కేకేఆర్‌కు ధన్యవాదాలు చెప్పుకుంటున్నట్టు పేర్కొన్నాడు. మిగిలి మ్యాచుల్లో జట్టు రాణించాలని ఆకాంక్షించాడు. జట్టు ఆడే గేమ్స్‌ను వీక్షిస్తూ ఉంటానని చెప్పుకొచ్చాడు. కాగా, హైదరాబాద్ సన్ రైజర్స్ (Hyderabad Sun Risers)తో కోల్‌కతా జట్టు శనివారం తలపడనుంది.
ఈ నేపథ్యంలో కమిన్స్ స్థానంలో వచ్చే ఆటగాడి గురించి కేకేఆర్ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ సీజన్లో ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లు ఆడిన కమిన్స్ 63 పరుగులు చేసి ఏడు వికెట్లు తీసుకున్నాడు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 15 బంతుల్లోనే అర్ధ సెంచరీ (56) పరుగులు చేసిన కమిన్స్ రికార్డులకెక్కాడు. కేకేఆర్ ప్రస్తుతం 10 పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది.