IPL 2022 Playoff Qualification Scenarios: ఈ IPL సీజన్లో ప్లే-ఆఫ్‌కు చేరే టీమ్స్ ఇవే.. SRH ప్లే-ఆఫ్స్‌కు చేరాలంటే..
ABN , First Publish Date - 2022-05-10T02:17:06+05:30 IST
IPL 2022 సీజన్లో బెస్ట్ టీ20 థ్రిల్లర్స్‌కు సమయం దగ్గర పడింది. చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లు ఆడేందుకు జట్లు సమాయత్తమవుతున్నాయి. లీగ్ దశలో మరో 15 మ్యాచ్‌లు మాత్రమే..

IPL 2022 సీజన్లో బెస్ట్ టీ20 థ్రిల్లర్స్‌కు సమయం దగ్గర పడింది. చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లు ఆడేందుకు జట్లు సమాయత్తమవుతున్నాయి. లీగ్ దశలో మరో 15 మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉండటంతో ప్లే-ఆఫ్ బెర్త్ కోసం టీమ్స్ మధ్య రసవత్తర పోటీ జరగబోతోంది. ఈ సీజన్లో ప్లే-ఆఫ్ రేసు నుంచి Mumbai Indians జట్టు ఇప్పటికే తప్పుకుందనడంలో సందేహమే లేదు. పాయింట్ల పట్టికలో ఒకటి, రెండు స్థానాల్లో ఉన్న లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు మే 10న జరగబోయే మ్యాచ్‌లో తలపడి గెలిచిన టీం ప్లే-ఆఫ్‌కు అర్హత సాధించనుంది.
ఈ రెండు జట్లకు చెరో మూడు మ్యాచ్‌లు మిగిలి ఉన్నప్పటికీ ఆ మూడు మ్యాచ్‌ల్లో ఒక్కటి గెలిచినా ప్లే-ఆఫ్ బెర్త్ ఖాయం అయినట్టే. చెన్నై సూపర్ కింగ్స్, కోల్కత్తా నైట్ రైడర్స్ లాంటి జట్లకు ఆ టీమ్స్ ఆడబోయే మ్యాచ్‌లు అన్నీ గెలవాల్సిన అవసరం ఉంది. అది కూడా మంచి రన్ రేట్ సాధించి గెలిస్తేనే ప్లే-ఆఫ్‌కు అర్హత సాధించే అవకాశం ఉంటుంది. మే 10న పుణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోషియేషన్ స్టేడియం వేదికగా Lucknow Super Gaints vs Gujarat Titans మ్యాచ్ జరగబోతోంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఈ సీజన్లో ప్లే-ఆఫ్స్‌కు అర్హత సాధించిన తొలి టీమ్‌గా నిలవనుంది. ప్లే-ఆఫ్స్‌కు అర్హత సాధించేందుకు ఏఏ టీంకు అవకాశాలు ఏమాత్రం ఉన్నాయో ఒక్కసారి సమీక్షిద్దాం.
1. లక్నో సూపర్ జెయింట్స్: ఐపీఎల్ పాయింట్ల పట్టికలో ప్రస్తుతం టాప్ ప్లేస్‌లో ఉన్న జట్టు లక్నో సూపర్ జెయింట్స్. ఈ జట్టు ఇప్పటిదాకా 11 మ్యాచ్‌లు ఆడింది. 8 మ్యాచ్‌ల్లో గెలిచి +0.703 రన్‌రేట్‌తో 16 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో నంబర్.1 స్థానంలో ఉంది. 3 మ్యాచ్‌ల్లో ఓడింది. ఈ టీం దాదాపుగా ప్లే-ఆఫ్స్‌కు చేరుకున్నట్టే అని చెప్పొచ్చు. మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో ఒక మ్యాచ్ గెలిస్తే చాలు. ఈ టీం ప్లే-ఆఫ్‌కు అర్హత సాధిస్తుంది. మే 10న గుజరాత్ టైటాన్స్‌తో, మే 15న రాజస్థాన్ రాయల్స్‌తో, మే 18న కోల్కత్తా నైట్ రైడర్స్ జట్టుతో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు తలపడనుంది. 99 శాతం ప్లే-ఆఫ్స్‌కు అవకాశమున్న టీం LSG.
2. గుజరాత్ టైటాన్స్: ఈ సీజన్లో హాట్ ఫేవరెట్ జట్టుగా కొనసాగుతున్న గుజరాత్ టైటాన్స్ కూడా ప్లే-ఆఫ్‌కు ఒక్క విన్ దూరంలోనే ఉంది. ఊహించని విధంగా రన్‌రేట్ పడిపోయి, మిగిలిన మూడు మ్యాచ్‌లు దారుణంగా ఓడిపోతే తప్ప గుజరాత్ టైటాన్స్‌ను ప్లే-ఆఫ్‌కు చేరకుండా ఎవరూ ఆపలేరు. 11 మ్యాచుల్లో 8 గెలిచి, 3 ఓడింది. 16 పాయింట్లు సాధించి +0.120 రన్‌రేట్‌తో పాయింట్ల పట్టికలో ప్రస్తుతం రెండో స్థానంలో ఉంది. మే 10న లక్నో సూపర్ జెయింట్స్‌తో, మే 15న చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో, మే 19న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో GT పోటీ పడనుంది. Gujarat Titans జట్టు 99 శాతం ప్లే-ఆఫ్స్‌కు అర్హత సాధిస్తుంది.
3. రాజస్తాన్ రాయల్స్: బట్లర్ భీకర బ్యాటింగ్‌తో సంజూ శాంసన్ కెప్టెన్సీ వహిస్తున్న రాజస్తాన్ రాయల్స్ జట్టు మంచి జోష్‌లో ఉంది. RR జట్టు మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో ఒక మ్యాచ్ గెలిస్తే ప్లే-ఆఫ్ రేసులో ఉన్నట్టే. రెండు మ్యాచ్‌లు గెలిస్తే టాప్4లో తమ స్థానానికి ఎలాంటి ఢోకా లేనట్టేనని చెప్పక తప్పదు. ఇప్పటివరకూ 11 మ్యాచ్‌లు ఆడిన రాజస్థాన్ రాయల్స్ జట్టు 7 మ్యాచ్‌ల్లో గెలిచి 4 మ్యాచ్‌ల్లో ఓడింది. 14 పాయింట్లు సాధించి +0.326 రన్‌రేట్‌తో నిలిచింది. ఒక మ్యాచ్ గెలిస్తే 16 పాయింట్లను సాధించి ప్లే-ఆఫ్‌కు అర్హత సాధిస్తుంది. దాదాపు 96 శాతం రాజస్తాన్ రాయల్స్ జట్టుకు ప్లే-ఆఫ్స్‌కు ఛాన్స్ ఉంది. RR జట్టు మే 11న ఢిల్లీ క్యాపిటల్స్‌తో, లక్నో సూపర్ జెయింట్స్‌తో మే 15న, మే 20న చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో ఆడనుంది.
4. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ఈ ఐపీఎల్ సీజన్లో ఆరంభంలో తడబడిన ఫాఫ్ డు ప్లెసిస్ సేన చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లపై విజయాలతో మళ్లీ పట్టాలెక్కింది. అయినప్పటికీ ప్లే-ఆఫ్స్‌కు అర్హత సాధించాలంటే RCB మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో గెలవక తప్పని పరిస్థితి. మే 13న పంజాబ్ కింగ్స్‌తో, మే 19న గుజరాత్ టైటాన్స్ జట్టుతో Royal Challengers Bangalore జట్టు తలపడబోతోంది. ఈ సీజన్లో ఇప్పటివరకూ మొత్తం 12 మ్యాచ్‌లు ఆడిన ఆర్సీబీ జట్టు 7 మ్యాచ్‌ల్లో గెలిచి, 5 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. RCB జట్టుకు 69 శాతం ప్లే-ఆఫ్స్‌కు అవకాశాలు ఉన్నాయి.
5. ఢిల్లీ క్యాపిటల్స్: రిషబ్ పంత్ సారధ్యంలోని Delhi Capitals జట్టు ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించాలంటే ఒక్కటే మార్గం. మిగిలిన మూడు మ్యాచుల్లో గెలిచి తీరాలి. ఒకవేళ గెలిచినా ప్లే-ఆఫ్స్‌కు కచ్చితంగా అర్హత సాధిస్తుందని చెప్పలేం. ప్లే-ఆఫ్స్ కోసం పోటీ పడుతున్న ఇతర జట్ల గెలుపోటములు, నెట్ రన్ రేట్ కూడా ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే-ఆఫ్ అవకాశాలను ప్రభావితం చేయనున్నాయి. 11 మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ జట్టు 5 మ్యాచ్‌ల్లో గెలిచి, 6 మ్యాచుల్లో ఓడింది. 10 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. ప్లే-ఆఫ్స్ ఛాన్స్ ఢిల్లీ జట్టుకు 18 శాతం మాత్రమే ఉంది. మే 11న రాజస్తాన్ రాయల్స్ జట్టుతో, మే 16న పంజాబ్ కింగ్స్‌తో, మే 21న ముంబై ఇండియన్స్ జట్టుతో DC జట్టుకు మ్యాచ్‌లున్నాయి.
6. సన్‌రైజర్స్ హైదరాబాద్: ఐపీఎల్ 2022 ఫస్టాప్‌లో వరుస విజయాలతో అదరగొట్టిన కేన్ మామ సేన ఇటీవల అత్యంత పేలవ ఆటతీరుతో వరుసగా ఓటముల పాలవుతోంది. నాలుగు మ్యాచ్‌లు వరుసగా ఓడింది. ఇప్పటికీ ప్లే-ఆఫ్ రేసులో నిలవాలంటే మిగిలిన మూడు మ్యాచుల్లో గెలిచి తీరాలి. ఆ విజయాలు కూడా నెట్ రన్ రేటును మెరుగుపరిచేవిగా ఉండాలి. ప్రతీ మ్యాచ్‌లో 2 పాయింట్లు సాధించాల్సి ఉంటుంది. మే 14న కోల్కత్తా నైట్‌రైడర్స్ జట్టుతో, మే 17న ముంబై ఇండియన్స్ జట్టుతో, మే 22న పంజాబ్ కింగ్స్ జట్టుతో SRH జట్టుకు మ్యాచులున్నాయి.
7. పంజాబ్ కింగ్స్: మయాంక్ అగర్వాల్ కెప్టెన్సీ వహిస్తున్న Punjab Kings జట్టు ఈ సీజన్లో 11 మ్యాచ్‌లు ఆడి ఐదు మ్యాచుల్లో గెలిచి, 6 మ్యాచుల్లో పరాజయం చవిచూసింది. మిగిలిన మూడు మ్యాచులు గెలిచినా, నెట్ రన్ రేట్‌ను మెరుగుపరుచుకున్నా ప్లే-ఆఫ్ అవకాశాలు పంజాబ్ కింగ్స్ జట్టుకు దాదాపుగా లేనట్టే. కారణం PBKS నెట్ రన్ రేట్ మైనస్సులో ఉండటమే. మే 13న RCBతో, మే 16న DCతో, మే 22న SRHతో పంజాబ్ కింగ్స్ తలపడనుంది. ప్లే-ఆఫ్ ఛాన్స్ 9 శాతం మాత్రమే PBKS జట్టుకు ఉంది.
8. చెన్నై సూపర్ కింగ్స్: జడేజా కెప్టెన్సీ వహించిన CSK జట్టుకు ప్రస్తుతం ఎంఎస్ ధోనీ నాయకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ జట్టు మిగిలిన మూడు మ్యాచులు గెలిచినా ప్లే-ఆఫ్ అవకాశాలు ఇతర జట్ల గెలుపోటములపై ఆధారపడి ఉంటాయి. 11 మ్యాచ్‌లు ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 4 మ్యాచ్‌ల్లో గెలిచి, 7 మ్యాచుల్లో ఓడింది. మే 12న ముంబై ఇండియన్స్‌తో, మే 15న గుజరాత్ టైటాన్స్‌తో, మే 20న రాజస్తాన్ రాయల్స్ జట్టుతో CSK మ్యాచులున్నాయి.
9. కోల్కత్తా నైట్‌రైడర్స్: శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలోని కోల్కత్తా నైట్‌రైడర్స్ జట్టు ప్లే-ఆఫ్స్‌కు చేరుకోవాలంటే ఏదైనా అద్భుతం జరగాల్సిందే. మిగిలిన మ్యాచుల్లో గెలిచినా దాదాపు కష్టమే. 11 మ్యాచులు ఆడిన KKR జట్టు 4 గెలిచి, 7 ఓడింది. 8 పాయింట్లు మాత్రమే సాధించి నెట్ రన్ రైట్ -0.304గా ఉంది. ఇవాళ ముంబై ఇండియన్స్ జట్టుతో తలపడుతున్న KKR జట్టు మే 14న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో, మే 18న లక్నో సూపర్ జెయింట్స్ జట్టుతో తలపడనుంది.
10. ముంబై ఇండియన్స్: గత ఐపీఎల్ సీజన్స్‌లో అద్భుత ఆటతీరుతో ఆకట్టుకుని మూడు సార్లుకు పైగా ఐపీఎల్ కప్‌ను సొంతం చేసుకున్న ముంబై ఇండియన్స్ జట్టు ఈ సీజన్లో మాత్రం చెత్త రికార్డును మూటగట్టుకుంది. వరుసగా 8 మ్యాచుల్లో ఓడి అభిమానులకు ప్లే-ఆఫ్ ఆశలే లేకుండా చేసింది. గత రెండు మ్యాచుల్లో గెలిచి 4 పాయింట్లు సాధించిన రోహిత్ సేన ప్లే-ఆఫ్స్‌కు అర్హత సాధించడానికి ఇవి సరిపోవు.