-
-
Home » Prathyekam » mangos purchage special website bengaluru-MRGS-Prathyekam
-
మీకిష్టమైనవి కోసుకోండి...
ABN , First Publish Date - 2022-05-05T17:48:22+05:30 IST
యాంత్రిక జీవితంలో కాస్త కొత్తదనం ఆస్వాదించుకోవాలనుకునే నగర వాసులకు రాష్ట్ర మామిడి అభివృద్ధి, మార్కెటింగ్ కార్పొరేషన్ ఓ వినూత్న అవకాశాన్ని మళ్లీ కల్పిస్తోంది. మామిడి తోటలకు

- తోటలకెళ్లి మామిడికాయలను కొనుగోలు చేయొచ్చు
- రుచి చూసేందుకూ అవకాశం
- వెబ్సైట్లో పేర్లు నమోదు చేసుకోవాలి
- మామిడి అభివృద్ధి, మార్కెటింగ్ కార్పొరేషన్ వినూత్న ప్రయోగం
ప్రస్తుతం మామిడి పండ్ల సీజన్.. వాటిని చూడగానే నోరూరుతుంది. అంతలోనే ఎక్కడో అనుమానం.. ఇవి సహజంగా మాగాయా..? మందులతో రంగులు తెచ్చారా..? ఇవి తింటే రోగాలు వస్తాయేమోనన్న భయం.. మామిడి పండ్లపై నిత్యం ఇలాంటి అనుభవాలు ఎదురవుతుంటాయి. వీటన్నింటికి చోటులేకుండా రాష్ట్ర మామిడి అభివృద్ధి, మార్కెటింగ్ కార్పొరేషన్ ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మామిడి తోటలకు విహారయాత్రగా వెళ్లి ఇష్టమైన కాయలను స్వయంగా కోసుకునేందుకు, రుచిచూసేందుకు ప్రత్యేక మ్యాంగో పికింగ్ టూర్‌ను ఏర్పాటు చేస్తోంది. రైతుల నుంచే నేరుగా రుచి చూసి మరీ కొనుగోలు చేయొచ్చు. దళారీల బెడద తప్పి రైతులకూ నాలుగు పైసలు మిగులుతాయి. వినియోగదారులకు స్వచ్ఛమైన పండ్లు దొరుకుతాయి.
బెంగళూరు: యాంత్రిక జీవితంలో కాస్త కొత్తదనం ఆస్వాదించుకోవాలనుకునే నగర వాసులకు రాష్ట్ర మామిడి అభివృద్ధి, మార్కెటింగ్ కార్పొరేషన్ ఓ వినూత్న అవకాశాన్ని మళ్లీ కల్పిస్తోంది. మామిడి తోటలకు విహారయాత్రగా వెళ్లి ఇష్టమైన మామిడి కాయలను స్వయంగా కోసుకునేందుకు, రుచిచూసేందుకు ప్రత్యేక మ్యాంగో పికింగ్ టూర్‌ను ఈ నెల మూడో వారంలో ప్రారంభిస్తోంది. 2016లోనే కార్పొరేషన్ ఈ ప్రత్యేక టూర్‌ను ప్రారంభించింది. కొవిడ్ కారణంగా గత రెండేళ్లుగా దీనికి బ్రేక్ పడుతూ వచ్చింది. కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టి సాధారణ స్థితి నెలకొంటున్న నేపథ్యంలో ఈటూర్కు సన్నాహాలు చేపట్టినట్లు కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సీజీ నాగరాజు వెల్లడించారు. మామిడి తోటలకు వెళ్లి ఎన్నో రకాల మామిడి కాయలను చూడటం, వాటిని స్వయంగా కోసుకోవడం, అవసరమైతే రుచిచూడటం చెప్పలేనంత అనుభూతినిస్తుందన్నారు. ఈ టూర్ రూపురేఖలను సిద్ధం చేస్తున్నామని, త్వరలోనే తేదీలను ప్రకటిస్తామన్నారు.
టూర్ ఎలా సాగుతుందంటే....
మ్యాంగో పికింగ్ టూర్ ప్రతిరోజూ బెంగళూరులో ప్రారంభం కానుంది. బెంగళూరు చుట్టుపక్కల ప్రాంతాల్లోని జిల్లాల్లో గల ఎంపిక చేసిన మా మిడి తోటలకు వెళ్లేందుకు రాయితీ చార్జీలతో బస్సు సదుపాయం ఏర్పాటు చేస్తారు. ఈ టూర్లో ఉదయం వెళ్లి సాయంత్రానికల్లా ఇంటికి తిరిగి వచ్చేయొచ్చు. ఒక్కో కుటుంబం నుంచి ఒక్కొక్కరికి అవకాశం కల్పిస్తారు. మామిడి తోటలపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు రైతులతో వినియోగదారులకు నేరుగా అనుసంధానం ఏర్పడేలా చేసేందుకే ఈ పర్యటనలను ఉద్దేశించారు. ఈ టూర్లో పాల్గొనే వారంతా కనీసం 5 కిలోల మా మిడి కాయలను సదరు తోటకు చెందిన రైతు నుంచి నేరుగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ కాయలు ఎలా? ఎన్ని రోజుల్లో మాగుతాయో కూడా సదరు రైతే వినియోగదారులకు వివరిస్తాడు. అంతేకాదు తన వద్ద సిద్ధంగా ఉన్న బాగా మాగిన మామిడిపండ్ల రుచిని కూడా చూపిస్తాడు.
వెబ్సైట్లోకి వెళ్లి పేర్లు నమోదు చేసుకోవాలి.
టూర్లో పాల్గొనదలిచే ఆసక్తిగలవారు ముందుగానే కర్ణాటక మ్యాంగో డెవల్‌పమెంట్, మార్కెటింగ్ కార్పొరేషన్ వెబ్‌సైట్‌కు వెళ్లి తమ పేరు, చిరునామా ఇ-మెయిల్ తదితర వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. బస్సులో ఒకేసారి 50 నుంచి 60 మందిని ఇలా మామిడి తోటల టూర్‌కు తీసుకెళతారు. ప్రస్తుతానికి వారానికో రోజు టూర్ ఉంటుందని డిమాండ్ పెరిగితే ప్రతిరోజూ టూర్‌ను నిర్వహిస్తామని కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సీజీ నాగరాజు చెప్పారు. కర్ణాటక తోటల అభివృద్ధి శాఖ సహకారంతో బెంగళూరు లాల్‌బాగ్‌లో దాదాపు 20కు పైగా రకాల మామిడి పండ్లతో ప్రత్యేక మేళాను ఏర్పాటు చేయడం ద్వారా రైతులను ప్రోత్సహించాలని నిర్ణయించామన్నారు. నగర ప్రజలు తమకు ఇష్టమైన మామిడి పండ్లను నేరుగా ఇంటిముంగిటకే తెప్పించుకునేందుకు వీలుగా పోస్టల్‌శాఖతో కూడా ఒప్పందం కుదుర్చుకున్నామని 5 కిలోలు ఆపై ఆర్డరు చేసిన వారికి పోస్టల్ శాఖ తాజా తాజా మామిడిపండ్లను అందిస్తుందని ఇందుకు పోస్టల్ చార్జీలను అదనంగా చెల్లించాల్సి ఉంటుందని ఆయన వివరించారు.