మునుగోడులో ప్రధాన పార్టీలకు ఒక్కో సమస్య
ABN , First Publish Date - 2022-10-23T13:03:33+05:30 IST
మునుగోడు ఉప ఎన్నికలో నువ్వా-నేనా అన్నట్టు పోరాడుతున్న ప్రధాన పార్టీలు వింత సమస్యలతో...
టీఆర్ఎస్కు అభ్యర్థితో చికాకు
బీజేపీకి ఓటు బ్యాంకు కష్టాలు
కాంగ్రెస్‌కు డబ్బు ఇబ్బంది
నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నికలో నువ్వా-నేనా అన్నట్టు పోరాడుతున్న ప్రధాన పార్టీలు వింత సమస్యలతో బాధపడుతున్నాయి. ఒక్కో పార్టీ పరిష్కరించలేని ఒక సమస్యతో సతమతం అవుతున్నాయి. ఈ సమస్య చివరకు ఫలితంపై ఎలా ప్రభావం చూపుతుందో అన్న ఆందోళనలో కీలక నేతలు ఉన్నారు. రాష్ట్రంలో అధికార టీఆర్‌ఎస్ మునుగోడు ఉప ఎన్నికలో విజయం సాధించేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది. సీఎం కేసీఆర్ మినహా రాష్ట్ర ప్రభుత్వం, ఎమ్మెల్యేలు, కీలక నేతలంతా మునుగోడులోనే మకాం వేశారు. ఇతర పార్టీల నుంచి పెద్ద సంఖ్యలో చేరికలను ప్రోత్సహిస్తున్నారు. సీఎం కేసీఆర్ భారీ సభలతో ముందుకు వెళ్తుండగా కీలక మంత్రులు హరీష్, కేటీఆర్ రోడ్‌షోలతో దూసుకుపోతున్నారు.
అంగ, ఆర్థిక బలం పుష్కలంగా ఉన్నా అభ్యర్థి విషయానికి వచ్చే సరికి ఆ పార్టీ నేతలు బుర్ర గోక్కునే పరిస్థితి. అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధుల మధ్య భారీ అగాధం నెలకొంది. తన ఆధిపత్యం కోసం సొంత పార్టీ ప్రజాప్రతినిధులపై పోలీస్ కేసులు పెట్టించడం, ప్రత్యామ్నాయ నాయకత్వాలను రూపొందించడం వంటి పనులతో పెద్ద సమస్య ఏర్పడింది. తీర్చలేని అసమ్మతితో సాధారణ ఎన్నికల్లో ఇక్కడ కొత్త అభ్యర్థి తప్పదన్న ప్రచారం జరగడంతో, పెద్ద సంఖ్యలో ఆశావహులు సిద్ధమై గత కొంత కాలంగా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ ఆర్థిక సాయం చేస్తూ వచ్చాయి. అనూహ్యంగా ఉప ఎన్నిక రావడంతో ఈ అసమ్మతిని నివారించేందుకు సీఎం కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగారు. మంత్రి జగదీ్‌షరెడ్డి రెండు నెలలుగా మునుగోడులోనే అత్యధిక సమయం పర్యటిస్తున్నారు. అసమ్మతి నేతలు కోవర్టు ఆపరేషన్లకు పాల్పడకుండా పార్టీ ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలతో కట్టుదిట్టం చేసింది.
అభ్యర్థి ప్రభాకర్‌రెడ్డి సైతం తన కుటుంబ సభ్యులను రంగంలో దింపి అసమ్మతి నేతలు క్రాస్ ఓటింగ్‌కు సంబంధించి ఎలాంటి కుట్రలు చేస్తున్నారో తెలుసుకుంటున్నట్లు సమాచారం. అయితే ఇటీవల నామినేషన్ సందర్భంగా అభ్యర్థి కూసుకుంట్ల ప్రసంగిస్తూ కార్యక్రమానికి హాజరైన నేతల పేర్లను సైతం ఉచ్ఛరించడంలో తడబడడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ నష్టాన్ని భర్తీ చేసేందుకు అభ్యర్థి వెంట రాష్ట్ర స్థాయి కీలక నేతలు హరీ్‌షరావు, కేటీఆర్, జగదీ్‌షరెడ్డి, తలసాని వంటి నేతలతో పాటు సీపీఎం, సీపీఐ రాష్ట్ర నేతల పర్యటనతో జతచేసి సీఎం కేసీఆర్, కారు గుర్తునే ప్రధానంగా ప్రచారంలో పెడుతున్నారు.
బీజేపీకి ఓటు బ్యాంకు కష్టాలు
మునుగోడు నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి 12సార్లు ఎన్నికలు జరగ్గా ఆరు సార్లు కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందగా 5సార్లు సీపీఐ, ఒకసారి టీఆర్‌ఎస్ అభ్యర్థి గెలుపొందారు. ఇక్కడ బీజేపీకి ఓటు బ్యాంకు నామమాత్రమే. క్యాడర్ సైతం అంతంత మాత్రమే. అయితే అనూహ్యంగా తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకోవడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆ పార్టీకి అభ్యర్థి రూపంలో బ్రహస్త్రం లభించినా పార్టీ పరంగా నిర్మాణ వైఫల్యం స్పష్టంగా ఉంది. బూత్ స్థాయిలో స్థానికులు నిరంతరం మకాం వేసి ప్రచారం చేసే పరిస్థితి లేదు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు చెందిన నేతలు, మండల ఇన్‌చార్జులు సైతం ఇతర ప్రాంతాలకు చెందిన వారిపైనే ఆధారపడాల్సిన పరిస్థితి. స్థానికంగా కమలం పువ్వు గుర్తు పరిచయం కూడా తక్కువే. ఈ లోపాన్ని పూడ్చుకునేందుకు రాజగోపాల్‌రెడ్డి తన వెంట వచ్చిన వారిని బీజేపీ మండల అధ్యక్షులుగా నియమించుకున్నారు. వారే బూత్ స్థాయి వరకు మండలమంతా పర్యటిస్తూ పరిస్థితిని సమీక్షించుకుంటున్నారు. దీపావళి తర్వాత బూత్ స్థాయిలో పనిచేసే శ్రేణులను పెద్ద సంఖ్యలో దించాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే హస్తం గుర్తన్న ప్రచారం విస్తృతంగా ఉండడంతో కమలం గుర్తును ప్రత్యేకంగా పలుమార్లు ఇంటింటికీ వివరించాల్సి రావడం ఆ పార్టీకి ప్రస్తుతం పెద్ద సవాల్‌గా మారింది.
కాంగ్రె్‌సకు డబ్బు ఇబ్బంది
నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ సైద్ధాంతికంగా బలంగా ఉంది. తాజా అభ్యర్థి పాల్వాయి స్రవంతి తండ్రి గోవర్ధన్‌రెడ్డి దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందిన నేత. ఆయన నెహ్రూ, ఇందిర, రాజీవ్ గాంధీ, మూడు తరాలు కలిసి పనిచేశారు. అవినీతి మచ్చలేకపోవడం, నియోజకవర్గంలోని వామపక్షాలను ఎదుర్కొనేందుకు కాంగ్రె్‌సను గ్రామస్థాయి నుంచి ఆయన సిద్ధాంత పరంగా బలంగా రూపొందించారు. దీంతో ఆరుసార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలుపొంది రికార్డు సృష్టించారు. పాల్వాయి స్రవంతికి వివిధ కారణాలతో కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోగా, గత ఎన్నికల్లో ఆమె స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగారు. ఆ ఎన్నికల్లో ఆమె 17వేలకు పైగా ఓట్లు సాధించారు. తాజాగా, ఉప ఎన్నికకు అభ్యర్థిని ఖరారు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సర్వే నిర్వహించగా స్రవంతికి అనుకూలంగా వచ్చింది. పాల్వాయి కుటుంబానికి నిస్వార్థ సేవకులు అనే పేరు, బలమైన క్యాడర్ ఉన్నప్పటికీ డబ్బు లేకపోవడం ఉప ఎన్నికలో ప్రధాన ఇబ్బంది ఏర్పడింది. ఒకటి రాష్ట్రంలో, మరోటి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలతో రెండుసార్లు అధికారానికి దూరమైన కాంగ్రెస్ పార్టీ నేతలు ఆర్థికంగా ఢీకొట్టలేని పరిస్థితి. ‘ఈ ఉప ఎన్నికలో మా అభ్యర్థి రూ.100కోట్లు పెట్టగలిగితే కాంగ్రెస్ పార్టీ విజయం మునుగోడులో నల్లేరు మీద నడకే’ అని ఆ పార్టీకి చెందిన కీలక నేత వ్యాఖ్యానించడం డబ్బు ఇబ్బంది ఏ మేరకు ప్రభావితం చేస్తుందో స్పష్టమవుతోంది.

