Kuwait లోని ప్రవాస భారతీయులకు ముఖ్య గమనిక.. బ్యాంకుల పనివేళలు మారబోతున్నాయ్..!
ABN , First Publish Date - 2022-05-10T17:30:48+05:30 IST
కువైత్‌లోని బ్యాంకులు తమ పని వేళలను మార్చే యోచనలో ఉన్నాయి.

కువైత్ సిటీ: కువైత్‌లోని బ్యాంకులు తమ పని వేళలను మార్చే యోచనలో ఉన్నాయి. ప్రస్తుతం బ్యాంకులు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు పని చేస్తున్నాయి. వారంలోని ఆదివారం నుంచి గురువారం వరకు ఇదే సమయం ఉంటుంది. అయితే, తాజాగా బ్యాంకులు తమ పనివేళలను మార్చే యోచనలో ఉన్నట్లు అక్కడి మీడియా వెల్లడించింది. దీనిలో భాగంగా కొత్త పనివేళలను ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటలుగా నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు స్థానిక బ్యాంకులు చర్చలు జరుపుతున్నాయి. ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత తమ ప్రతిపాదన అప్రూవల్ కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైత్‌ను కలుస్తాయని మీడియా వెల్లడించింది.
అందుకే బ్యాంకు పని గంటలు మారబోతున్న విషయాన్ని కువైత్‌లోని భారత ప్రవాసులు గమనించాలి. ఒకవేళ పనివేళలు మారితే అందుకు తగ్గట్టుగా ప్రవాసులు బ్యాంకులకు వెళ్లేందుకు సరియైన సమయాన్ని ఎంచుకునే వీలు ఉంటుంది. ఇదిలాఉంటే.. లోకల్‌గా జరిగే ఆన్లైన్ లావాదేవీలపై ఇకపై ఎలాంటి చార్జీలు వసూలు చేయకూడదని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైత్, స్థానిక బ్యాంకులు నిర్ణయించాయి. ఇటీవల జీతం బదిలీతో సహా ఏదైనా లావాదేవీకి 1 కువైటీ దినార్(రూ.252) బదిలీ రుసుమును వసూలు చేయాలనే స్థానిక బ్యాంకుల ప్రతిపాదనపై పలువురు నిరసన వ్యక్తం చేయడంతో బ్యాంకులు వెనక్కి తగ్గాయి. ఏదైనా బ్యాంకింగ్ అవసరాల కోసం ఎలక్ట్రానిక్ ఛానెల్‌లను ఉపయోగించాలని ఈ సందర్భంగా సెంట్రల్ బ్యాంక్ కస్టమర్లను కోరింది.
