NRI: విదేశాల్లో సెటిల్ అవ్వాలనుకుంటున్నారా..అయితే..

ABN , First Publish Date - 2022-11-07T16:51:31+05:30 IST

విదేశాల్లో సెటిల్ అవ్వాలనుకునే వారికి ఓ గుడ్ న్యూస్. తమ దేశంలోకి రారమ్మంటూ కెనడా ఫారినర్లకు రెడ్ కార్పెట్ పరుస్తోంది.

 NRI: విదేశాల్లో సెటిల్ అవ్వాలనుకుంటున్నారా..అయితే..

ఎన్నారై డెస్క్: విదేశాల్లో సెటిల్ అవ్వాలనుకునే వారికి ఓ గుడ్ న్యూస్. తమ దేశంలోకి రారమ్మంటూ కెనడా ఫారినర్లకు రెడ్ కార్పెట్ పరుస్తోంది. దేశఆర్థిక వ్యవస్థకు కార్మికుల కొరత ఓ ప్రతిబంధకంగా మారడంతో కెనడా.. విదేశీయులవైపు చూస్తోంది. రాబోయే మూడేళ్లల్లో 14.5 లక్షల మంది విదేశీయులను వివిధ రంగాల్లో నియమించుకోవాలని ప్రణాళిక రచించింది. ఆర్థికాభివృద్ధికి కావాల్సినంత మంది సిబ్బంది దేశంలో లేక నష్టం జరిగిందని కెనడా వలసల శాఖ మంత్రి షాన్ ఫ్రేజర్ ఇటీవలే వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే కెనడా ప్రభుత్వం ఇమిగ్రేషన్ ప్లాన్ 2023-25 పేరిట ఓ భారీ ప్రోగ్రామ్ రచించింది.

ప్రముఖ బిజినెస్ కన్సల్టింగ్ సంస్థ ‘ఆర్‌ఎస్ఎమ్ కెనడా’ ప్రకారం.. కార్మికుల కొరతకు మొత్తం మూడు కారణాలు ఉన్నాయి. కొవిడ్ సంక్షోభం తరువాత ప్రజల జీవనప్రాధాన్యాల్లో మార్పులు వచ్చాయి. ఫలితంగా.. అనేక మంది తమ ఉద్యోగాలకు రాజీనామాలు చేశారు. దేశంలో పునరుత్పత్తి రేటు పడిపోవడం కూడా ఓ కారణమని ‘ఆర్ఎస్ఎమ్’ తెలిపింది. దీనికితోడు.. జనాభాలో వృద్ధుల సంఖ్య పెరగడం కూడా కార్మికుల కొరతకు దారితీసింది.

కరోనా ఎఫెక్ట్..

ఈ ఏడాది జులైలో కెనడా.. కరోనా ఏడో వేవ్‌ను ఎదుర్కొంది. ఆ సందర్భంగా ఆస్పత్రుల్లో 11.2 శాతం మంది సిబ్బంది, నర్సులు అనారోగ్యం పాలయ్యారు. దీంతో..వైద్య సిబ్బంది కొరత ఏర్పడి పలు ఆస్పత్రుల్లో ఎమర్జెన్సీ వార్డులు తాత్కాలికంగా మూసేయాల్సి వచ్చింది. ఈ ఏడాది మార్చి మొదలు ఇప్పటివరకూ దేశంలో 2 లక్షల మంది తమ కొలువులు ఒదులుకున్నారు. కరోనా సంక్షోభం దెబ్బకు మరికొంత మంది ఉపాధి కోల్పోవాల్సి వచ్చింది. జూన్‌లో విద్య, ఆరోగ్యం, సోషల్ సర్వీస్ రంగాలకు చెందిన 30 వేల మంది రాజీనామాలు చేశారు. జులైలో 43 వేల మంది కొలువులకు గుడ్‌బై చెప్పేశారు. వీరిలో చాలా మంది స్వయం ఉపాధి వైపు మళ్లడంతో కంపెనీల్లో సిబ్బంది కొరత ఏర్పడింది.

పునరుత్పత్తి రేటు తగ్గుదల..

పునరుత్పత్తి రేటు తగ్గుతుండటంతో పాటూ జనాభాలో వయోధికులు సంఖ్య పెరగడం కూడా పరిస్థితి దిగజార్చుతోంది. కెనడాలో ప్రస్తుతం పునరుత్పత్తి రేటు 1.4. అంటే.. ప్రతి మహిళ సగటున 1.4 పిల్లలను కంటున్నారు. ఇక 2030 నాటికి అక్కడి జనాభాలో పావు శాతం అంటే సుమారు.. 9 మిలియన్ల మంది రిటైర్మెంట్ వయసుకు చేరుకుంటారట. ఈ పరిణామాలు కార్మికుల కొరతకు దారితీస్తున్నాయి. దీని నుంచి బయటపడేందుకే కెనడా వీదేశీయుల సాయం కోరుతోంది. ఈ దిశగా వలసలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రారంభించింది. కెనడా వైద్యం, వ్యవసాయం, రవాణా, ఫిషరీస్ రంగాల్లో పూర్తిగా విదేశీయులపై ఆధారపడ్డాయని మంత్రి షాన్ ఫ్రేజర్ తెలిపారు. ప్రస్తుతం దేశంలోని వివిధ రంగాల్లో పది లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

ఇక కెనడాలో పనిచేస్తూ ఆర్థికాభివృద్ధికి పాటుపడే విదేశీయులకు దేశంలో శాశ్వత నివాసార్హతను కల్పిస్తామని ప్రభుత్వం పేర్కొంది. ఇందుకోసం వివిధ ఇమిగ్రేషన్ ప్రోగ్రామ్స్‌ను నిర్వహిస్తోంది. ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ పథకం కింద వచ్చే ఏడాది 82880 మంది విదేశీయులను దేశంలోకి ఆహ్వానించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2025 నాటికల్లా ఈ సంఖ్యను 114000కు పెంచాలని టార్గెట్ పెట్టుకుంది. ఇక ప్రోవిన్షియల్ నామినీ పథకం కింద 2023లో 105000 మందికి, 2025లో 117500 మంది విదేశీయులకు జాబ్స్ ఇవ్వాలని కెనడా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే.. ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ కార్యక్రమం భారతీయులకు హెచ్-1బీ వీసా కంటే మెరుగైనదని నిపుణులు చెబుతున్నారు. కెనడాలో విద్యార్థులు కూడా ఉపాధి పొందే సౌలభ్యం ఉండటం భారతీయులకు అనుకూలించే మరో అంశం. వీసాదారుల కుటుంబ సభ్యులకు కూడా త్వరగానే వీసాలు జారీ అవుతాయని చెబుతున్నారు. ఇక శాశ్వత నివాసార్హత ఉన్నవారికి కెనడాలో విద్య, వైద్య సదుపాయాలు ఉచితంగానే పొందొచ్చు. వ్యాపారాలనూ ప్రారంభించవచ్చు.

Updated Date - 2022-11-07T17:07:17+05:30 IST

Read more