ఊళ్లు పచ్చగా ఉండాలని...
ABN, First Publish Date - 2022-10-25T23:53:11+05:30
ఏడాదిలో ఎక్కువకాలం అతి శీతలంగా ఉండే పర్వత ప్రాంతమైన లడఖ్ చుట్టుపక్కల పల్లెల్ని పచ్చగా మార్చడం తన ధ్యేయమని చెబుతారు వ్యవసాయ శాస్త్రవేత్త జిగ్మెట్ యాంగ్‌చిన్. కూరగాయల సాగులో సరికొత్త పద్ధతులు ప్రవేశపెట్టి,
ఏడాదిలో ఎక్కువకాలం అతి శీతలంగా ఉండే పర్వత ప్రాంతమైన లడఖ్ చుట్టుపక్కల పల్లెల్ని పచ్చగా మార్చడం తన ధ్యేయమని చెబుతారు వ్యవసాయ శాస్త్రవేత్త జిగ్మెట్ యాంగ్‌చిన్. కూరగాయల సాగులో సరికొత్త పద్ధతులు ప్రవేశపెట్టి, తోటల పెంపకాన్ని లాభసాటిగా మార్చారు. మరోవైపు జలవనరుల కాలుష్యానికి వ్యతిరేకంగానూ ఉద్యమం సాగిస్తున్నారు.
‘‘షేర్-ఎ-కశ్మీర్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ ఆఫ్ కశ్మీర్... భారతదేశంలో అత్యంత ఎత్తైన ప్రదేశంలో ఉన్న పరిశోధన సంస్థ. ఉద్యోగిగా ఆ ప్రాంగణంలో అడుగుపెట్టినప్పుడు... వ్యవసాయ శాస్త్రవేత్త కావాలనే నా కల నిజమయిందనే ఉద్వేగం నన్ను నిలువనివ్వలేదు. కానీ కాలం గడుస్తున్న కొద్దీ నేను పుట్టి పెరిగిన ప్రాంతానికి శాస్త్రవేత్తగా నేను ఏం చెయ్యగలననే ప్రశ్న నన్ను నిలదీస్తూ వచ్చింది. మాది లడఖ్ ప్రాంతంలోని న్యోమా అనే గ్రామం. ఉన్నత విద్య కోసం చండీగఢ్‌కు వెళ్ళిన నన్ను... పచ్చదనంతో కళకళలాడే మైదానాలు ఆకర్షించాయి. అగ్రికల్చర్ విద్యార్థిగా... వ్యవసాయ క్షేత్రాలకు చాలా దగ్గరగా పని చేస్తున్నప్పుడు... మా ప్రాంతానికీ, అక్కడికీ ఉన్న తేడా చాలా స్పష్టంగా కనిపించింది.
అనుమానాలెన్నో...
మా ప్రాంతంలో ఏడాదికి దాదాపు ఆరు నెలలు చలికాలం. వర్షపాతం తక్కువ. చుట్టూ కొండలు ఆవరించి ఉన్న ఈ ప్రాంతంలో పాలు, ఉన్ని సమృద్ధిగా ఉత్పత్తి అవుతాయి. కానీ కూరగాయలు, పండ్ల సాగు ఎక్కువగా కనిపించదు. వ్యవసాయంలో ఆధునిక పద్ధతులను, మెళకువలను అనుసరించకపోవడం దీనికి ప్రధాన కారణం. కొండల మధ్య ఉన్న మైదానాల్లో... పురుషులు పశువులు కాస్తారు. మహిళలు ఇంటి పనులకే పరిమితం. కొన్ని గ్రామాల మహిళలతో పెరటి తోటల పెంపకం గురించి చర్చించాను. ఇంటి దగ్గరే కాయగూరలు పండించవచ్చనే ఆలోచన వారికి కూడా ఉత్సాహం కలిగించింది. అయితే ‘ఈ నేలలో అవి పండుతాయా?’ అనే అనుమానాలూ ఎక్కువగానే ఉన్నాయి. వాటిని నివృత్తి చేసుకోవడం కోసం... దేశంలోని మిగిలిన ప్రాంతాల మాదిరిగా కూరగాయలను, పండ్లను మా ప్రాతంలో ఉత్పత్తి చెయ్యడానికి గల సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయడం ప్రారంభించాను. తోటల పెంపకంలో మా ప్రాంతానికి అనుకూలమైన పద్ధతులను ఎంపిక చేశాను. వాటిని మా బృందం గ్రామస్తులకు వివరించింది.
హరిత గృహాలు, టన్నెల్స్, ట్రెంచ్ టెక్నిక్స్ వీటిలో ప్రధానమైనవి. మొదట ఆకు కూరలు, తరువాత టొమాటా, క్యాబేజీ లాంటివి వేశాం. అవి ఫలితం ఇవ్వడంతో దోస, బీర లాంటివీ పండించడం మొదలుపెట్టాం. 2015లో... నాబార్డ్‌తో కలిసి ఒక వర్మీ కంపోస్ట్ ప్రాజెక్టులో నేను పని చేసినప్పుడు చాలా విషయాలు తెలిశాయి. కానీ లడఖ్ వాతావరణంలో వర్మీ కంపోస్టింగ్ అమలు చెయ్యడం అంత సులువేం కాదు. చివరికి... స్థానికంగా దొరికే గడ్డి, పశు విసర్జనాలు, పురుగుల లాంటి వాటిని ప్రయోగాత్మకంగా వినియోగించాం. దీనివల్ల ఖర్చు తక్కువే కాకుండా... మంచి ఫలితం కూడా కనిపించింది. నాలుగైదేళ్ళలోనే కొందరు మహిళలకు ఏడాదికి లక్షల ఆదాయాన్ని ఈ పెరటి తోటలు అందిస్తున్నాయి. ఒక గ్రామం తరువాత మరొకటిగా ఈ పద్ధతుల్ని అవలంబిస్తున్నాయి. నేను పుట్టి, పెరిగిన ఈ పల్లె ప్రాంతాలు పచ్చదనంతో కళకళలాడాలన్నది నా కల. దాన్ని నెరవేర్చుకొనే క్రమంలో... ఎంతో మహిళలు స్వావలంబన సాధించడానికి సాయపడడం నాకు ఎంతో సంతోషాన్నిస్తోంది.
దలైలామా సందేశాన్ని కోరా...
మా ప్రాజెక్ట్‌లో భాగంగా... లెహ్ నగరంలో నీటిని పరీక్షించినప్పుడు, అది బాగా కలుషితమైనట్టు గమనించాను. చండీగఢ్, శ్రీనగర్‌లలో వేర్వేరుగా పరీక్షలకు పంపాను. ఫలితాలు ఆందోళనకరంగా ఉన్నాయి. లెహ్ నగరానికి నీరు సరఫరా చేసే వనరులన్నీ చెత్త కుండీల్లా మారడమే దీనికి కారణం. ఈ సమస్యను లెహ్ అభివృద్ధి మండలి దృష్టికి తీసుకువెళ్ళాను. తరువాత బౌద్ధ గురువు దలైలామాను కలిసి... ఈ ప్రాంతంలో ప్రవహించే సింధు నదినీ, ఇతర జల వనరులను కలుషితం చెయ్యకూడదని ప్రజలకు సందేశం ఇవ్వాలని కోరాను. క్రమంగా ఇదొక ఉద్యమంగా మారింది. జనంలో కూడా అవగాహన పెరిగింది. గతం పోలిస్తే ఇప్పుడు నీరు సురక్షితంగా మారింది. కానీ ఈ దిశగా చెయ్యాల్సింది ఇంకా చాలా ఉంది.’’
నాలుగైదేళ్ళలోనే కొందరు మహిళలకు ఏడాదికి లక్షల ఆదాయాన్ని ఈ పెరటి తోటలు అందిస్తున్నాయి. ఒక గ్రామం తరువాత మరొకటిగా ఈ పద్ధతుల్ని అవలంబిస్తున్నాయి. నేను పుట్టి, పెరిగిన ఈ పల్లె ప్రాంతాలు పచ్చదనంతో కళకళలాడాలన్నది నా కల.
Updated Date - 2022-10-25T23:54:06+05:30 IST