మహాపరినిర్వాణం
ABN, First Publish Date - 2022-05-13T05:30:22+05:30
బుద్ధునికి జీవితంలోని నాలుగు ముఖ్యమైన సంఘటనలు... ఆయన పుట్టుక, జ్ఞానోదయం, ధర్మచక్ర ప్రవర్తనం, మహా పరినిర్వాణాల్లో... ధర్మచక్ర ప్రవర్తనం తప్ప... మిగిలిన మూడూ వైశాఖ పున్నమి రోజునే జరిగాయి.
బుద్ధునికి జీవితంలోని నాలుగు ముఖ్యమైన సంఘటనలు... ఆయన పుట్టుక, జ్ఞానోదయం, ధర్మచక్ర ప్రవర్తనం, మహా పరినిర్వాణాల్లో... ధర్మచక్ర ప్రవర్తనం తప్ప... మిగిలిన మూడూ వైశాఖ పున్నమి రోజునే జరిగాయి. వైశాఖ పున్నమిని సాధారణంగా ‘బుద్ధ జయంతి’ అని అందరూ చెప్పుకొంటారు. బౌద్ధ సంప్రదాయంలో దీన్ని ‘బుద్ధ పున్నమి’ అని పిలుస్తారు. ఇప్పటి భాషలో చెప్పాలంటే... బుద్ధ జయంతి, వర్ధంతి... ఈ రెండూ ఒకే రోజు.
బుద్ధుని మరణాన్ని ‘మహాపరినిర్వాణం’ అంటారు. బుద్ధుడు మహాపరినిర్వాణం పొందడానికి ముందు ఒక ఏడాది కాలంలో... ఆయన జీవితంలో ముఖ్యమైన సంఘటనలు ఎన్నో జరిగాయి. క్రీస్తుపూర్వం 484లో... బుద్ధుడి ప్రధాన అనుయాయి, ధర్మసేనానిగా కీర్తిపొందిన సారిపుత్రుడు నలందాలో పరినిర్వాణం పొందాడు. సారిపుత్రుడి బాల్యమిత్రుడు, బౌద్ధ సంఘంలో అతని తరువాతి స్థానం పొందినవాడు మౌద్గల్యాయనుడు. మిత్రుని మరణం తరువాత... అతని పనుల భారాన్ని కూడా మరింత ఉత్సాహంగా మౌద్గల్యాయనుడు మోశాడు. దీంతో... మౌద్గల్యాయనుణ్ణి లేకుండా చేస్తే, బుద్ధుడు మరింత బలహీనపడతాడని కొందరు దురాలోచన చేశారు. దుండగులకు వెయ్యి బంగారు నాణేలను ఇచ్చి, హత్యాయత్నాలు చేయించారు. మౌద్గల్యాయనుడు రెండుసార్లు తప్పించుకున్నాడు. మూడోసారి కాలశిల ప్రాంతంలో హత్యకు గురయ్యాడు. ఇద్దరు ప్రధాన అనుయాయులను పొగొట్టుకున్నా... బుద్ధుడు తన మనోబలాన్ని కోల్పోలేదు. అక్కడి నుంచి వజ్జి దేశంలోని ఉల్లాచేలం అనే ప్రాంతానికి వెళ్ళాడు. తరువాత రాజగృహకు చేరుకున్నాడు.
ఈలోగా మగధరాజు అజాతశత్రు... వైశాలి, వజ్జి, మల్ల గణరాజ్యాలను ఆక్రమించడానికి బయలుదేరుతూ... ఆ విషయం చెప్పి రావాల్సిందిగా తన మంత్రి వర్షకారుణ్ణి బుద్ధుని దగ్గరకు పంపాడు. బుద్ధుడు వారి యుద్ద ఆలోచనను తీవ్రంగా వ్యతిరేకించాడు. అయినప్పటికీ అజాతశత్రు మీద అనుమానం పోలేదు. తాను ఆ రాజ్యాలలో ఉంటే వాటి మీద అతను యుద్ధానికి దిగడనే నమ్మకంతో... మగధ రాజధాని అయిన రాజగృహను బుద్ధుడు విడిచి పెట్టాడు. నలందా మీదుగా పాటలి గ్రామానికి వెళ్ళాడు. అప్పటికి పాటలి చిన్న వ్యాపార కూడలి. దాన్ని తన రెండో రాజధానిగా మార్చాలని అజాతశత్రు నూతన భవనాలు నిర్మిస్తున్నాడు.
బుద్ధుడు... తన అనుయాయుడు ఆనందుడితో ‘‘ఆనందా! ఈ పాటలి మహానగరం అవుతుంది. పెద్ద వ్యాపార కేంద్రం అవుతుంది. ఆ తరువాత అంతర్యుద్ధాల వల్ల నాశనం అవుతుంది’’ అని చెప్పాడు. ఆ తరువాత అదే జరిగింది.
పాటలిని వదిలిన బుద్ధుడు గంగానదిని దాటి కోటి అనే గ్రామం చేరాడు. బుద్ధుడు చివరిసారిగా దాటిన ఆ రేవు ప్రాంతాన్ని నేటికీ ‘గౌతమతీర్థం’గా పిలుస్తున్నారు. అక్కడి నుంచి లిచ్ఛవుల రాజధాని వైశాలికి బుద్ధుడు చేరుకున్నాడు. అతని వద్దకు ఆమ్రపాలి వచ్చి... బౌద్ధ సంఘాన్ని తన ఇంటికి భిక్ష కోసం ఆహ్వానించింది. అప్పటికి ఆమెకు అరవై ఏళ్ళు దాటాయి. ఆమె తన యావదాస్తినీ బౌద్ధ సంఘానికి దానం చేసింది. తన బిడ్డ సుమంతుణ్ణి భిక్షువుగా మార్చింది.
బుద్ధుడు వైశాలిలో ఉన్నాడని తెలిసిన అజాతశత్రు తన దండయాత్రను విరమించుకున్నాడు. బుద్ధుడు అక్కడికి దగ్గరగా ఉన్న వేళువ గ్రామానికి వెళ్ళాడు. అక్కడే తన ఆఖరి వర్షావాసం గడిపాడు. అప్పుడు అతనికి పెద్ద జబ్బు చేసింది. ఆనందుడు కలవరపడ్డాడు.
‘‘ఆనందా! నాకు ఇప్పుడు ఎనభై ఏళ్ళు’’ అని చెప్పాడు బుద్ధుడు. బౌద్ధ సాహిత్యంలో... బుద్ధుడు తన నోటి ద్వారా తన వయసు చెప్పింది ఈ ఒక్క సందర్భంలోనే! అదే ఆయన జీవితంలో ఆఖరి సంవత్సరం. వర్షావాసం మూడు నెలలూ ముగిశాక... జబ్బు కాస్త వెనకడుగు వేసింది. మళ్ళీ వైశాలికి వచ్చాడు. మరోసారి జబ్బు తిరగబెట్టింది. మళ్ళీ తగ్గింది.
‘‘ఆనందా! మనం త్వరగా వజ్జి, మల్ల గణ రాజ్యాలకు వెళ్ళాలి. ఇక తథాగతుడు ఎక్కువకాలం ఉండడు. మూడు నెలలకు మించి బతకడు’’ అని తన మరణాన్ని ముందుగానే తెలియజేశాడు బుద్ధుడు. ‘ఇక అజాతశత్రు నుంచి దీన్ని రక్షించేది ఎవరు?’ అనుకున్నట్టుగా వైశాలి వంక పదేపదే చూస్తూ... ఆ నగరాన్ని వదలి భోగనగరం చేరాడు. అక్కడి నుంచి వజ్జి నగరం సమీపంలో ఒక మామిడి తోటలో విశ్రాంతికి ఆగాడు. అక్కడ చుందుడు అనే వ్యక్తి బౌద్ధ సంఘాన్ని భిక్షకు ఆహ్వానించాడు. పుట్టకొక్కుల ఇగురు (సుకర మర్ధవం) వడ్డించాడు. తొలి ముద్ద తిని... ‘‘ఈ కూర పాడైపోయింది. ఇది మిగిలినవారికి వడ్డించకు’’ అని చెప్పాడు బుద్ధుడు. తను మాత్రం ఆ కూరనే తిన్నాడు. దాంతో ఆయన జబ్బు మరింత తీవ్రమైపోయింది.
‘‘ఆనందా! ఆనాడు నాకు సుజాత ఇచ్చిన పాయసం ఎంత గొప్పదో... ఈ రోజు చుందుడు ఇచ్చిన విందు కూడా అంత గొప్పదే. ఈ ఆహారం వల్లే నేను మరణించానని చుందుణ్ణి నిందించవద్దు’’ అని చెప్పాడు. ఆ తరువాత మల్లరాజ్యంలోని సుకీనర శివారులో నడవలేక... రెండు సాల వృక్షాల మధ్య విశ్రాంతి తీసుకున్నాడు. ఆ సమయంలో పుక్కుసమల్లుడు అనే వ్యక్తి బుద్ధుడి దగ్గరకు వచ్చి... తన దగ్గర ఉన్న బంగారు వన్నెగల వస్ర్తాన్ని కప్పాడు. తన కోసం తాగడానికి కుకుధానది నీళ్ళు తెమ్మని బుద్ధుడు అడిగాడు. ఆనందుడు తెచ్చి ఇచ్చాడు.
సాయంత్రమయ్యేసరికి సుభద్రుడు అనే వ్యక్తి వచ్చి. బుద్ధుణ్ణి చూడాలని కోరాడు. కానీ ఆనందుడు అంగీకరించలేదు. అప్పుడు ‘సుభద్రుణ్ణి పంపండి’ అని బుద్ధుడు చెప్పాడు.
‘‘భగవాన్! నాకు ధమ్మం ఉపదేశించండి. మీ చేతుల మీదుగా భిక్షు దీక్ష ఇవ్వండి’’ అని బుద్ధుణ్ణి సుభద్రుడు వేడుకున్నాడు. బుద్ధుడు అలాగే చేశా డు. ఆయన దీక్ష ఇచ్చిన చివరి వ్యక్తి సుభద్రుడు.
ఆనందుడి కోరిక మేరకు... ‘‘మీకు మీరే దీపం అవండి. మిమ్మల్ని మీరే నడిపించుకోండి. నా ధర్మమే మిమ్మల్ని నడిపిస్తుంది’’ అని ఆఖరి సందేశాన్ని ఇచ్చాడు బుద్ధుడు.
ఆ రాత్రి గడిచింది. మరునాడు వైశాఖ పున్నమి. పున్నమి తొలి ఘడియలు రాగానే... బుద్ధుడు ధ్యానంలో నిమగ్నుడయ్యాడు. ఆ ధ్యానంలోనే మహాపరినిర్వాణం పొందాడు.
బుద్ధుడు చెప్పినట్టు... ఆనాటికీ, ఈనాటికీ ప్రపంచంలో బౌద్ధ సంఘాలన్నిటినీ నడిపించేది బుద్ధుని ధర్మమే. ఆ ధర్మమే బౌద్ధులకు నాయకత్వం వహిస్తోంది. ‘‘నా తరువాత బౌద్ధ సంఘానికి నాయకులు ఉండరు. నేను చెప్పిన ధర్మమే మీకు మీకు నాయకత్వం వహిస్తుంది’’ అని ఆయన చెప్పిన మాట ఈనాటికీ ఆచరణలో కొనసాగుతోంది.
బొర్రా గోవర్ధన్
బుద్ధుడు చెప్పినట్టు... ఆనాటికీ, ఈనాటికీ ప్రపంచంలో బౌద్ధ సంఘాలన్నిటినీ నడిపించేది బుద్ధుని ధర్మమే. ఆ ధర్మమే బౌద్ధులకు నాయకత్వం వహిస్తోంది. ‘‘నా తరువాత బౌద్ధ సంఘానికి నాయకులు ఉండరు. నేను చెప్పిన ధర్మమే మీకు మీకు నాయకత్వం వహిస్తుంది’’ అని ఆయన చెప్పిన మాట ఈనాటికీ ఆచరణలో కొనసాగుతోంది.