World Bank : ఉద్యోగాలను పోగొట్టే వడగాడ్పులు... చల్లబరచడం గొప్ప వ్యాపార అవకాశం...
ABN, First Publish Date - 2022-12-07T15:54:00+05:30
మానవుని మనుగడకు ప్రమాదకరమైన వడగాడ్పుల ముప్పు వేగంగా దూసుకొస్తోంది. కొన్ని దశాబ్దాల నుంచి
తిరువనంతపురం : మానవుని మనుగడకు ప్రమాదకరమైన వడగాడ్పుల ముప్పు వేగంగా దూసుకొస్తోంది. కొన్ని దశాబ్దాల నుంచి వేలాది మందిని పొట్టనబెట్టుకుంటున్న వడగాడ్పులు మరింత ఉగ్రరూపం దాల్చనున్నాయి. మానవుడు జీవించగలిగిన పరిమితికి మించిన వేడితో వడగాడ్పులు ఉండే ప్రాంతాల్లో ప్రపంచంలో ముందు వరుసలో మన దేశం నిలవబోతోంది. భారత దేశ శీతల రంగంలో వాతావరణ పెట్టుబడుల అవకాశాలపై ప్రపంచ బ్యాంకు (World Bank) నివేదిక ఈ వివరాలను వెల్లడించింది.
భారత దేశంలో అత్యధిక ఉష్ణోగ్రతలు ఉంటున్నాయని, ఈ పరిస్థితులు సుదీర్ఘ కాలం కొనసాగుతాయని ఈ నివేదిక పేర్కొంది. 2022 ఏప్రిల్‌లో ముందుగానే వేసవి తీవ్రత దేశాన్ని చుట్టుముట్టిందని, దేశ రాజధాని నగరం న్యూఢిల్లీలో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల సెల్సియస్‌కు చేరాయని తెలిపింది. మార్చిలో ఉష్ణోగ్రతలు మునుపెన్నడూ లేనంత తీవ్ర స్థాయిలో అసాధారణంగా పెరగడం గమనార్హమని తెలిపింది.
ప్రపంచ బ్యాంకు, కేరళ ప్రభుత్వం (Kerala State Government) సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘ఇండియా క్లైమేట్ అండ్ డెవలప్మెంట్ పార్టనర్స్ మీట్’లో ఈ నివేదికను విడుదల చేస్తారు. ఈ సమావేశాలు రెండు రోజులపాటు జరుగుతాయి. మానవుడు తట్టుకునే పరిమితిని మించి వడగాడ్పులు వీస్తాయని, ఉష్ణోగ్రతలు పెరుగుతాయని ఈ నివేదిక హెచ్చరించింది. దక్షిణాసియా వ్యాప్తంగా ఉష్ణోగ్రతల పెరుగుదలకు సంబంధించి చాలా మంది శాస్త్రవేత్తలు చాలా కాలం నుంచి చేస్తున్న హెచ్చరికలకు అనుగుణంగానే ఇటీవలి వడగాడ్పుల తీవ్రత ఉంటోందని పేర్కొంది.
భారత ఉప ఖండంలో రానున్న దశాబ్దంలో మరింత తరచుగా, మరింత తీవ్రతతో కూడిన వడగాడ్పులు వీస్తాయని వాతావరణ మార్పులపై అంతర్ ప్రభుత్వాల ప్యానెల్ (IPCC-ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ ఛేంజ్) ఆరో మదింపు నివేదిక 2021 ఆగస్టులో హెచ్చరించింది. అదే సంవత్సరంలో జీ20 క్లైమేట్ రిస్క్ అట్లాస్ కూడా భారత దేశాన్ని హెచ్చరించింది. ఉద్గారాలకు సంబంధించి ఐపీసీసీ చెప్తున్న దయనీయ పరిస్థితుల్లో భారత దేశంలో కార్బన్ ఉద్గారాలు అధిక స్థాయిలో ఉంటే, 2036-65 నాటికి 25 రెట్లు నిడివితో వడగాడ్పులు వీస్తాయని హెచ్చరించింది. ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ఆర్థిక ఉత్పాదకత కూడా ప్రమాదంలో పడుతుందని హెచ్చరించింది.
మన దేశంలోని కార్మిక వర్గంలో దాదాపు 75 శాతం మంది అంటే, 38 కోట్ల మంది ఎండ వేడికి గురయ్యేవారే. వీరు తరచూ ప్రాణాపాయం కలిగించే అవకాశంగల ఉష్ణోగ్రత గల వాతావరణంలో పని చేస్తూ ఉంటారు. వేడి, ఒత్తిడిలకు సంబంధించిన ఉత్పాదకత క్షీణత వల్ల 2030నాటికి ప్రపంచవ్యాప్తంగా 8 కోట్ల ఉద్యోగాలు పోయే అవకాశం ఉందని, భారత దేశంలో 3.4 కోట్ల మంది తమ ఉపాధిని కోల్పోయే అవకాశం ఉందని ఈ నివేదిక అంచనా వేసింది.
దక్షిణాసియాలోని దేశాల్లో భారత దేశంపై ఇప్పటికే ఈ ప్రభావం కనిపిస్తోందని తెలిపింది. కార్మిక రంగంలో సంవత్సరానికి 101 బిలియన్ గంటలకుపైగా నష్టపోతున్నట్లు పేర్కొంది. గ్లోబల్ మేనేజ్మెంట్ కన్సల్టింగ్ ఫర్మ్ మెకిన్సే అండ్ కంపెనీ విశ్లేషణ ప్రకారం, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వేడి, తేమ పరిస్థితుల వల్ల కోల్పోయే కార్మిక పని గంటల విలువ ఈ దశాబ్దం చివరికి మన దేశ జీడీపీలో దాదాపు 4.5 శాతం ఉంటుంది. భారత దేశ దీర్ఘ కాలిక ఆహార భద్రత, ప్రజారోగ్య భద్రత విశ్వసనీయమైన కోల్డ్ చైన్ నెట్‌వర్క్‌పై ఆధారపడతాయని తెలిపింది. ఆహారం, ఔషధాలను దేశవ్యాప్తంగా రవాణా చేయడం కోసం కోల్డ్ చైన్ రిఫ్రిజిరేషన్ వ్యవస్థ సర్వత్రా అవసరమవుతుందని తెలిపింది. రవాణా చేసేటపుడు మార్గమధ్యంలో ఉష్ణోగ్రతలో ఏ చిన్న లోపం జరిగినా కోల్డ్ చైన్ దెబ్బతింటుందని తెలిపింది. తాజా ఉత్పత్తులు నాశనమవుతాయని, వ్యాక్సిన్ల (టీకాలు) సమర్థత బలహీనపడుతుందని పేర్కొంది. భారత దేశంలోని ఫ్రెష్ ఉత్పత్తుల్లో కేవలం నాలుగు శాతానికి మాత్రమే కోల్డ్ చైన్ సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని, ఫలితంగా వార్షిక ఆహార పదార్థాల నష్టం సుమారు 13 బిలియన్ డాలర్లు ఉంటుందని తెలిపింది. కోవిడ్ మహమ్మారికి ముందు ప్రపంచంలో మూడో అతి పెద్ద ఔషధ తయారీదారు అయిన భారత దేశం టెంపరేచర్ సెన్సిటివ్ మెడికల్ ప్రొడక్ట్స్‌లో సుమారు 20 శాతం వరకు, వ్యాక్సిన్లలో 25 శాతం వరకు నష్టపోయిందని, దీనివల్ల సంవత్సరానికి 313 మిలియన్ డాలర్లు కోల్పోతోందని, దీనికి కారణం కోల్డ్ చైన్స్ దెబ్బతినడమేనని వివరించింది.
భారత దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉంటే, కూలింగ్ కోసం డిమాండ్ కూడా పెరుగుతుందని ఇండియా కూలింగ్ యాక్షన్ ప్లాన్ నివేదిక చెప్తోంది. దేశంలో మూడింట రెండొంతుల మంది ప్రజలు రోజుకు రెండు డాలర్ల కన్నా తక్కువ ఆదాయంతో గడపవలసిన పరిస్థితులు ఉన్నాయని, ఏసీ ధర దాదాపు 260 డాలర్ల నుంచి 500 డాలర్ల మధ్యలో ఉంటుందని, అటువంటి పరిస్థితుల్లో ఎయిర్ కూలింగ్ సిస్టమ్ విలాసవంతమైన సాధనం అవుతుందని, కేవలం కొద్ది మందికే అందుబాటులో ఉంటుందని తెలిపింది. దేశంలో కేవలం 8 శాతం మందికే ఏసీ యూనిట్లు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఇండోర్, ఎలక్ట్రిక్ ఫ్యాన్ల ధరలు కూడా విపరీతంగా పెరుగుతాయని, ఫలితంగా చాలా మంది నిరుపేదలు, అణగారిన వర్గాలు ఉష్ణోగ్రతలకు దెబ్బతింటారని తెలిపింది. చల్లబరచే సాధనాలేవీ లేకుండా క్రిక్కిరిసిన, వెలుతురు లేని ఇళ్లలో నివసిస్తూ దెబ్బతింటారని పేర్కొంది. విపరీతమైన వేడి వాతావరణంలో చల్లదనంలో ఉండటమనేది కేవలం సదుపాయం కాదని, జీవన్మరణ సమస్య అని వివరించింది.
Updated Date - 2022-12-07T15:54:04+05:30 IST