Bihar politics: పీకే ఎవరు? ప్రశ్నించిన Tejaswi yadav
ABN , First Publish Date - 2022-05-08T21:27:49+05:30 IST
బీహార్‌లో గత 30 ఏళ్లుగా ఎలాంటి అభివృద్ధి జరగలేదంటూ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలపై..

పాట్నా: బీహార్‌లో గత 30 ఏళ్లుగా ఎలాంటి అభివృద్ధి జరగలేదంటూ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (Prashant kishor) చేసిన వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర నేతల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (Nitish kumar), మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్ యాదవ్ (Lalu prasad yadav) హయాంలో అభివృద్ధి పనులే జరగలేదంటూ పీకే ఇటీవల విమర్శించారు. ఈ వ్యాఖ్యలను రాష్ట్రీయ జనతా దళ్ నేత తేజస్వి యాదవ్ (Tejashwi Yadav) ఆదివారంనాడు తిప్పికొట్టారు. ఆయన వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమన్నారు. అసలు ఇంతవరకూ రాజకీయాల్లో పీకేకి ఉన్న ప్రాధాన్యత ఏమిటని ప్రశ్నించారు.
''ప్రశాంత్ కిషోర్ ప్రకటనలో అసలు అర్ధమే లేదు. దానికి సమాధానం చెప్పాల్సిన పని కూడా లేదు. ఆయన నిరాధారమైన ప్రకటన చేశారు. ఆయన ఆచూకీ ఏమిటో కూడా తెలియదు. అసలు ఆయన ఎవరు?. పీకే ఫ్యాక్టర్ అనేదే ఇక్కడ లేదు'' అని తేజస్వి ప్రశ్నించారు. లాలూ ప్రసాద్ యాదవ్ సైతం ఇటీవల పీకేపై వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. దేశం అంతా తిరిగి చివరికి బిహార్‌కే ఆయన వస్తున్నారని, పీకేను దేశ ప్రజలు ఇంటికి పంపించారంటూ ఎద్దేవా చేశారు. బిహార్‌లో సైతం పీకేకు అవకాశం లేదని, అక్కడి ప్రజలు ఆయనను నమ్మరని అన్నారు.