Sri Lanka Crisis : తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుకు తిరస్కరించిన శ్రీలంక ప్రతిపక్షం
ABN , First Publish Date - 2022-05-08T19:28:45+05:30 IST
తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకలో తాత్కాలిక ప్రభుత్వానికి నాయకత్వం

కొలంబో : తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకలో తాత్కాలిక ప్రభుత్వానికి నాయకత్వం వహించాలని ఆ దేశాధ్యక్షుడు గొటబయ రాజపక్స (Gotabaya Rajapaksa) ఇచ్చిన పిలుపును ప్రధాన ప్రతిపక్షం ఎస్జేబీ తిరస్కరించింది. రాజకీయ అనిశ్చితి కొనసాగుతుండటంతోపాటు దేశంలో అత్యవసర పరిస్థితిని అమలు చేస్తున్న నేపథ్యంలో తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటు ప్రతిపాదనను తోసిపుచ్చింది.
సమగి జన బలవేగయ (ఎస్జేబీ) నేషనల్ ఆర్గనైజర్ టిస్సా అట్టనాయకే ఆదివారం మీడియాతో మాట్లాడుతూ, తమ పార్టీ నేత సాజిత్ ప్రేమదాసకు దేశాధ్యక్షుడు గొటబయ రాజపక్స ఓ ఆఫర్ ఇచ్చారని తెలిపారు. తాత్కాలిక ప్రభుత్వానికి నాయకత్వం వహించాలని కోరారన్నారు. ఈ ఆఫర్ను సాజిత్ తిరస్కరించారని చెప్పారు.
ఆర్థిక రంగంలో ఎస్జేబీకి గురువు అయిన హర్ష డిసిల్వతోనూ, ప్రేమదాసతోనూ గొటబయ రాజపక్స టెలిఫోన్ ద్వారా మాట్లాడారు. తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటు అవకాశాలపై చర్చించారు. ఈ ప్రతిపాదనను శక్తిమంతమైన బౌద్ధ మత పెద్దలతోపాటు శ్రీలంక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పొదుజన పెరమున కూటమి నుంచి వైదొలగిన పార్టీ కూడా సమర్థించింది.
ఇదిలావుండగా, న్యాయవాదులతో కూడిన శ్రీలంక బార్ అసోసియేషన్ (BASL) 19వ రాజ్యాంగ సవరణను పునరుద్ధరించాలని డిమాండ్ చేసింది. దేశాధ్యక్షునికి అత్యధిక అధికారాలను కట్టబెడుతూ 2020లో జరిగిన 20వ రాజ్యాంగ సవరణను రద్దు చేయాలని కోరింది. 18 నెలలపాటు తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. దేశంలో అధ్యక్ష తరహా పరిపాలను రద్దు చేయాలని డిమాండ్ చేసింది. BASL ప్రతిపాదనకు ఎస్జేబీ శనివారం మద్దతు తెలిపింది. ఈ ప్రతిపాదనపై బీఏఎస్ఎల్తో చర్చించవలసి ఉందని ఆ పార్టీ నేత హరిన్ ఫెర్నాండో తెలిపారు.
దేశాధ్యక్షుని కన్నా పార్లమెంటుకు ఎక్కువ అధికారాలు ఉన్నాయని 19వ రాజ్యాంగ సవరణ చెప్తోంది.