అదేం లేదు.. బొమ్మై బాగానే చేస్తున్నారుగా: యడియూరప్ప

ABN , First Publish Date - 2022-05-02T23:20:25+05:30 IST

కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మైని బీజేపీ అధిష్టానం మార్చబోతున్నట్టు వస్తున్న వార్తలపై ఆ పార్టీ నేత బీఎస్

అదేం లేదు.. బొమ్మై బాగానే చేస్తున్నారుగా: యడియూరప్ప

శివమొగ్గ: కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మైని బీజేపీ అధిష్టానం మార్చబోతున్నట్టు వస్తున్న వార్తలపై ఆ పార్టీ నేత, మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప స్పందించారు. బొమ్మై బాగానే పనిచేస్తున్నారని, నాయకత్వ మార్పు ఉండబోదని స్పష్టం చేశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కర్ణాటకలో పర్యటించనున్న నేపథ్యంలో నాయకత్వ మార్పు తప్పదన్న వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలో తాజాగా యడియూరప్ప మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 


మంగళవారం రాష్ట్రంలో పర్యటించనున్న షా పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ‘ఖేలో ఇండియా’ యూనివర్సిటీ గేమ్స్ ముగింపు వేడుకల్లో పాల్గొంటారు. అలాగే, బసవ జయంతి సందర్భంగా 12వ శతాబ్దానికి చెందిన సంఘ సంస్కర్త, లింగాయత్ సన్యాసి బసవన్నకు నివాళులు అర్పిస్తారు. అనంతరం పార్టీ నేతలతో సమావేశమవుతారు. ఈ సందర్భంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 150 సీట్లు సాధించేందుకు అవసరమైన  సలహాలు, సూచనలు ఇస్తారని యడియూర్ప తెలిపారు.


ముఖ్యమంత్రి మార్పు వార్తలపై యడియూరప్ప మాట్లాడుతూ.. అలాంటి మార్పులేవీ ఉండబోవని స్పష్టం చేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి బొమ్మై బాగానే పనిచేస్తున్నారని, కాబట్టి  తనకు తెలిసి నాయకత్వ మార్పు ఉండబోదని అన్నారు. 


Read more