Bulldozers row: మైనారిటీలపై మొదట బుల్డోజర్లకు ఆదేశించింది Indira gandhiనే..
ABN , First Publish Date - 2022-05-08T22:55:21+05:30 IST
బుల్డోజర్ల వివాదం ఇటీవల కాలంలో అత్యంత ప్రచారంలోకి వచ్చింది. యూపీలో మొదలైన బుల్డోజర్ల వివాదం ఇటీవల ఢిల్లీ వరకూ

న్యూఢిల్లీ: Bulldozers row ఇటీవల కాలంలో అత్యంత ప్రచారంలోకి వచ్చింది. యూపీలో మొదలైన బుల్డోజర్ల వివాదం ఇటీవల ఢిల్లీ వరకూ పాకింది. దీనిపై నేతల మధ్య మాటల యుద్ధం సైతం కొనసాగుతూనే ఉంది. తాజాగా కాంగ్రెస్ నేత మనీష్ తివారీ ఆదివారం చేసిన ట్వీట్‌కు బీజేపీ గట్టి కౌంటర్ ఇచ్చింది. తుర్క్‌మాన్ గేట్ వద్ద మైనారిటీలపై బుల్డోజర్లు నడిపాలంటూ మొట్టమొదట ఆదేశాలిచ్చింది అప్పటి ప్రధాని ఇందిరాగాంధీనేనని ట్వీట్ చేసింది. బీజేపీ జాతీయ సమాచార, సాంకేతక విభాగం ఇన్చార్జి అమిత్ మాలవీయ ఈ మేరకు వరుస ట్వీట్లలో కాంగ్రెస్‌పై ప్రతివిమర్శలు చేశారు.
''కాంగ్రెస్ పార్టీలో ఉన్న మనీష్ తివారీ నుంచి రాహుల్ గాంధీ వరకూ Amenesiaతో బాధపడుతున్నట్టు ఉన్నారు. లేదంటే గతానికి సంబంధించిన సరైన సమాచారం వారివద్ద లేకపోయి ఉండాలి. నాజీలు, యూదులు గురించి పక్కనపెట్టండి. ఇండియాలోనే మొదటిసారిగా మైనారిటీలపై తుర్కమాన్ గేట్ వద్ద బుల్డోజర్లు ఉపయోగించాలని ఆదేశించిన ఘనత ఇందిరాగాంధీదే'' అని అమిత్ మాలవీయ ట్వీట్ చేశారు. ఇందుకు సంబంధించిన ఒక నలుపుతెలుపు (Black and white) ఫోటోను కూడా ఆయన తన ట్వీట్‌కు జతచేశారు. 1976 ఏప్రిల్‌లో ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీ కుమారుడు సంజయ్ గాంధీ ముస్లిం మహిళలు, పురుషుల చేత బలవంతపు కుటుంబనియంత్రణ ఆపరేషన్లు చేయించారని, దీనిపై వారు నిరసనలకు దిగితే తుర్కమాన్ గేట్ వద్ద బుల్డోజర్లు నడిపారని, 20 మంది ప్రజలు చనిపోయారని అమిత్ మాలవీయ మరో ట్వీట్ చేశారు.
దీనికి ముందు, తాను రాసిన ఒక ఆర్టికల్‌ను మనీష్ తివారీ ట్విట్టర్లో షేర్ చేశారు. నాజీలు యూదులపై విస్తృతంగా బుల్డోజర్లు మోహరించారని, యూదులు ఆ తరువాత పాలస్తీనా వారిపై వాటిని ఉపయోగించారని ఆయన అన్నారు. ఇప్పుడు ఇండియా పరిస్థితి కూడా అలాగే ఉందని, సొంత మైనారిటీలపైనే వాటిని (బుల్డోజర్లు) ఉపయోగిస్తోందని విమర్శించారు.