రష్యన్ సైనికుడి విచారణ
ABN , First Publish Date - 2022-05-14T08:16:01+05:30 IST
మహిళలపై అత్యాచారాలు.. సాధారణ పౌరుల కాల్చివేత.. పిల్లలపైనా దారుణాలు..! ఉక్రెయిన్‌పై దురాక్రమణకు దిగిన తొలినాళ్ల లో రష్యా సైన్యం సాగించిన అరాచకాలివి..!
పౌరుడిని కాల్చి చంపిన జవాన్‌ను విచారించిన ఉక్రెయిన్ కోర్టు
కీవ్, మే 13: మహిళలపై అత్యాచారాలు.. సాధారణ పౌరుల కాల్చివేత.. పిల్లలపైనా దారుణాలు..! ఉక్రెయిన్‌పై దురాక్రమణకు దిగిన తొలినాళ్ల లో రష్యా సైన్యం సాగించిన అరాచకాలివి..! వీటిపై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు కూడా వ్యక్తమయ్యాయి. ఈ యుద్ధ నేరాలకు సంబంధించి తాజాగా ఉక్రెయిన్ విచారణ ప్రారంభించింది. పట్టుబడిన రష్యన్ సైనికుడు ఒకరిని శుక్రవారం కీవ్‌లోని ఓ కోర్టు విచారించింది. యుద్ధం మొదలయ్యాక చోటుచేసుకున్న నేరాలపై ఇదే మొదటి విచారణ కావ డం, కవరేజీ కోసం పెద్ద సంఖ్యలో జర్నలిస్టులూ హాజరవడంతో అంతర్జాతీయంగానూ ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా, 21 ఏళ్ల రష్యన్ సైనికుడు వాదిమ్ షిషిమరిన్‌ను విచారణకు కోర్టులో ప్రవేశపెట్టగా.. ఈశాన్య ఉక్రెయిన్‌లోని చుపాఖివ్కా గ్రామంలో 62 ఏళ్ల సాధారణ పౌరుడిని తుపాకీతో తలలో కాల్చి చంపినట్లు అతడు అంగీకరించాడు. యుద్ధం మొదలైన తొలినాళ్లలో.. అంటే ఫిబ్రవరి 28న రష్యా దళాలు కీవ్ వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఉక్రెయిన్ క్రిమినల్ కోడ్ ప్రకా రం.. షిషిమరిన్‌కు యావజ్జీవ శిక్ష పడే అవకాశముంది.
నదిలో రష్యా సేనలకు భారీ నష్టం
లుహాన్స్క్‌లోని సివర్స్కీ డొనెట్స్ నదిని దాటేందుకు ప్రయత్నిస్తున్న రష్యా బెటాలియన్‌పై ఉక్రెయిన్ దాడికి దిగిందని.. ఈ ఘటనలో వెయ్యిమంది సైనికులున్న బెటాలియన్‌లో చాలామంది చనిపోయినట్లు బ్రిటీష్ ఇంటిలిజెన్స్ తెలిపింది. నదిని దాటేందుకు తా త్కాలిక బ్రిడ్జిని నిర్మిస్తున్న క్రమంలో ఉక్రెయిన్ దళాలు దాడి చేసినట్లు పేర్కొంది. తూర్పు ఉక్రెయిన్‌లోని లుహాన్స్క్‌లో రష్యా ఒక్కరోజులో 31 జనావాసాలపై దాడులకు దిగింది. డాన్‌బా్‌సలో రష్యా దళాలు పురోగతి సాధించకున్నా.. కొన్ని గ్రామాలను ఆధీనంలోకి తీసుకున్నాయి. జాపోరిజ్జియాలో ఉక్రెయిన్ దళాలపై రష్యా గ్రెనేడ్లతో దాడికి దిగింది.
నాటోలో చేరితే అణు ప్రళయమే!
నాటో కూటమిలో చేరికకు ఫిన్లాండ్ సిద్ధమవుతుండడం, స్వీడన్ కూడా ఇదే నిర్ణయం తీసుకోనుండడంపై రష్యా మండిపడుతోంది. ప్రతీకార ‘సైనిక-సాంకేతిక’ చర్యలు తప్పవంటూ హెచ్చరించింది. ఈ పరిణామం ప్రత్యక్ష సంఘర్షణకు దారితీస్తుందని నాటోను తాజాగా రష్యా హెచ్చరించింది. అంతేకాక.. ‘‘ఇది పూర్తిస్థాయి అణు యుద్ధానికి కారణమయ్యే ప్రమాదమూ ఉంది. అదే జరిగితే అందరిపాలిట పెను విపత్తే’’ అని రష్యా భద్రతా మండలి డిప్యూటీ హెడ్ దిమిత్రీ మెద్వదేవ్ స్పష్టం చేయడం గమనార్హం. కాగా, ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో ఈ నెల 17న భారత ఎంబసీ పునఃప్రారంభం కానుంది.

