ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం..
ABN , First Publish Date - 2022-05-14T07:45:14+05:30 IST
దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 27మంది అగ్నికి ఆహుతయ్యారు. మరో 50 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

మరో 50 మందికి గాయాలు
నాలుగు అంతస్తుల భవనంలో మంటలు
భయంతో కిందకు దూకేసిన పలువురు
ముండ్కా మెట్రోస్టేషన్ సమీపంలో ఘటన
రాష్ట్రపతి, ప్రధాని, ఢిల్లీ సీఎం విచారం
27 మంది సజీవ దహనం
న్యూఢిల్లీ, మే 13: దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 27మంది అగ్నికి ఆహుతయ్యారు. మరో 50 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. పశ్చిమ ఢిల్లీలోని ముండ్కా మెట్రోస్టేషన్‌కు సమీపంలో ఉన్న నాలుగు అంతస్తుల భవనంలో సాయంత్రం 4 గంటలకు మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదం నుంచి చాలా మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చామని పోలీసులు తెలిపారు.
దాదాపు 24 ఫైర్ ఇంజన్లు మంటలు ఆర్పే ప్రయత్నం చేశాయన్నారు. అగ్ని ప్రమాదం జరిగిన భవనంలోంచి కొందరు కిందకు దూకేశారని అధికారులు చెప్పారు. గాయాలపాలైన వారిని ఆస్పత్రులకు తరలించి, చికిత్స అందిస్తున్నామని తెలిపారు. భవనంలోని మొదటి అంతస్తులో సీసీటీవీ కెమెరాలు, రూటర్ల తయారీ సంస్థ ఉంది. అందులోనే మొదట మంటలు చెలరేగి పై అంతస్తులకూ వ్యాపించినట్లు తెలుస్తోంది. ఆ సంస్థ యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అగ్ని ప్రమాద ఘటన గురించి తెలుసుకుని కలతచెందామని రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోదీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పేర్కొన్నారు.