ఖాళీలతో కుప్పకూలిన క్యాట్
ABN , First Publish Date - 2022-05-14T08:12:34+05:30 IST
పదవులను భర్తీ చేయకపోవడంతో కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ (క్యాట్)మొత్తం కుప్పకూలిందని శుక్రవారం సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్య చేసింది. కొత్తవారిని నియమించే వరకు
సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్య
ప్రస్తుత సభ్యుల పదవీ కాలాన్ని పొడిగించాలని కేంద్రానికి సూచన
న్యూఢిల్లీ, మే13: పదవులను భర్తీ చేయకపోవడంతో కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ (క్యాట్)మొత్తం కుప్పకూలిందని శుక్రవారం సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్య చేసింది. కొత్తవారిని నియమించే వరకు ప్రస్తుతం ఉన్న సభ్యుల పదవీ కాలాన్ని తాత్కాలికంగా పొడిగించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ‘‘మొత్తం ట్రైబ్యునల్ బెంచ్‌లకు 69 సభ్యుల పోస్టులను కేటాయించగా ప్రస్తుతం 27 మందే ఉ న్నారు. ఒక ఛైర్మన్, మరో 42 మంది సభ్యుల పదవులు ఖాళీగా ఉన్నాయి. కొత్తవారిని నియమించడం లేదు. మిగిలిన ఆ 27 మంది కూడా పదవీ విరమణ చేస్తే మొత్తం ట్రైబ్యునల్ కుప్పకూలుతుంది’’ అని జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్‌ల ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రస్తుతం ఉన్న సభ్యుల పదవీ కాలాన్ని పొడిగించాలని ఆదేశించింది. అడ్మినిస్ర్టేటివ్, జ్యుడీషియల్ సభ్యులు రిటైరైన తరువాత వారి సమ్మతి తీసుకొని పదవీ కాలాన్ని పొడిగించాలని సూచించింది. కొత్త సభ్యులను నియమించే వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని పేర్కొంది. తదుపరి విచారణను ధర్మాసనం జులై 26కు వాయిదా వేసింది.

