BJP by-elections: ఉప ఎన్నికల్లో బీజేపీ జోరు

ABN , First Publish Date - 2022-11-07T03:04:03+05:30 IST

దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లోని 7 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ 4 స్థానాలు గెలుచుకుంది.

BJP by-elections: ఉప ఎన్నికల్లో బీజేపీ జోరు

6 చోట్ల పోటీ చేసి 4 స్థానాల్లో ఘన విజయం

బిహార్‌ మొకామాలో ఆర్‌జేడీ గెలుపు

అంధేరీ ఉద్ధవ్‌సేనదే.. ఇక్కడ నోటాకు 12,806 ఓట్లు

బరిలోకి దిగిన 3 చోట్లా కాంగ్రెస్‌కు పరాభవం

న్యూఢిల్లీ, నవంబరు 6: దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లోని 7 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ 4 స్థానాలు గెలుచుకుంది. విపక్షాలకు 3 సీట్లు దక్కాయి. మహారాష్ట్రలోని తూర్పు అంధేరీలో తప్ప మిగతా ఆరు సీట్లలో బీజేపీ బరిలోకి దిగింది. నాలుగు స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్‌ 3 స్థానాల్లో పోటీచేసి 3 చోట్లా పరాజయం పాలైంది. తెలంగాణలోని మునుగోడులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కె.ప్రభాకర్‌రెడ్డి తన సమీప బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై పది వేల ఓట్లకుపై మెజారిటీతో విజయం సాధించారు. కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతి మూడో స్థానంలో నిలిచారు. హరియాణాలోని ఆదంపూర్‌లో మాజీ సీఎం భజన్‌ లాల్‌ మనవడు, మాజీ ఎమ్మెల్యే కుల్‌దీప్‌ బిష్ణోయ్‌

తనయుడు భవ్య బిష్ణోయ్‌ విజయం సాధించారు. సమీప కాంగ్రెస్‌ అభ్యర్థి జయప్రకాశ్‌పై 16 వేలకుపైగా ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. 1968 నుంచీ ఈ స్థానంలో భజన్‌లాల్‌ కుటుంబీకులే గెలుస్తూ వస్తున్నారు. ఆయన ఏకంగా 9 సార్లు, ఆయన భార్య జస్మాదేవి ఒకసారి, కుల్‌దీప్‌ నాలుగు సార్లు విజయం సాధించారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున గెలిచిన కుల్‌దీప్‌.. ఆ పార్టీకి, శాసనసభ్యత్వానికి ఇటీవల రాజీనామా చేసి బీజేపీలో చేరారు. తన కుమారుడిని బరిలోకి దింపారు. ఉత్తరప్రదేశ్‌లోని .

బిహార్‌.. చెరొకటి

బిహార్‌లో రెండు స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. బీజేపీతో తెగతెంపులు చేసుకున్న సీఎం నితీశ్‌కుమార్‌కు, ఆయన కేబినెట్‌లో ఉపముఖ్యమంత్రిగా ఉన్న ఆర్‌జేడీ అగ్రనేత తేజస్వి యాదవ్‌కు ఇవి తొలి పరీక్షగా నిలిచాయి. అయితే ఒకటి గెలిచి రెండోది ఓడిపోయారు. గోపాల్‌గంజ్‌లో బీజేపీ ఎమ్మెల్యే సుభా్‌షసింగ్‌ మరణంతో ఉప ఎన్నిక జరిగింది. ఆయన భార్య కుసుమ్‌దేవికి ఆ పార్టీ టికెట్‌ ఇచ్చింది. 70,053 ఓట్లు సాధించిన ఆమె.. ఆర్‌జేడీ అభ్యర్థి మోహన్‌ గుప్తా (68,259)పై 1,194 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. ఇక్కడ ఆర్‌జేడీ విజయావకాశాలను ఎంఐఎం దెబ్బతీసింది. ఆ పార్టీకి 12,214 ఓట్లు రావడం గమనార్హం. అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్న కేసులో మొకామా ఆర్‌జేడీ ఎమ్మెల్యేగా ఉన్న అనంతకుమార్‌సింగ్‌కు పదేళ్ల శిక్ష పడడంతో ఆయనపై అనర్హత వేటు పడింది. ఉప ఎన్నికలో ఆర్‌జేడీ అభ్యర్థిగా ఆయన భార్య నీలం దేవి పోటీచేశారు. 79,744 ఓట్లు సాధించిన ఆమె.. బీజేపీ అభ్యర్థి సోనం దేవి(63,003)పై 16,741 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మొకామాలో బీజేపీ పోటీచేయడం ఇదే ప్రథమం. గతంలో దీనిని మిత్రపక్షాలకు వదిలేసింది.

యూపీ.. బీజేపీ ఘనవిజయం

యూపీలో ఉప ఎన్నిక జరిగిన గోలా గోకర్ణ్‌నాథ్‌లో బీజేపీ భారీ విజయం సాధించింది. కేంద్ర మంత్రి అజయ్‌మిశ్రా ప్రాతినిధ్యం వహిస్తున్న లఖీంపూర్‌ ఖేరీ లోక్‌సభ స్థానం పరిధిలోకి ఇది వస్తుంది. ఇక్కడి బీజేపీ ఎమ్మెల్యే అరవింద్‌ గిరి మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆయన కుమారుడు అమన్‌ గిరి 1,24,810 ఓట్లు పొందారు. సమీప సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి వినయ్‌ తివారీ (90,512)పై 34,298 ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించారు. కాంగ్రెస్‌, బీఎస్పీ పోటీచేయలేదు. 3 సాగు చట్టాలకు వ్యతిరేకంగా లఖీంపూర్‌ ఖేరీలో ఉద్యమిస్తున్న రైతులపైకి మిశ్రా కుమారుడు వాహనమెక్కించడంతో నలుగురు రైతులు, ఓ జర్నలిస్టు మరణించిన సంగతి తెలిసిందే.

ఒడిసా.. ధామ్‌నగర్‌ బీజేపీకే

ఒడిసాలోని ధామ్‌నగర్‌ స్థానాన్ని బీజేపీ నిలబెట్టుకుంది. ఆ పార్టీ ఎమ్మెల్యే బిష్ణు చరణ్‌ సేథీ మరణంతో ఆయన కుమారుడు సూర్యవంశీ సూరజ్‌ బరిలోకి దిగారు. 80,351 ఓట్లు సాధించి.. పాలక బీజేడీ అభ్యర్థి అవంతీ దాస్‌ (70,470)పై 9,881 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. కాంగ్రెస్‌ అభ్యర్థి బాబా హరేకృష్ణ సేథీ డిపాజిట్‌ కోల్పోయారు. 3,561 ఓట్లతో నాలుగో స్థానంలో నిలిచారు. స్వతంత్ర అభ్యర్థి రాజేంద్రకుమార్‌ 8,153 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు.

అంధేరీ.. నోటాదే రెండో స్థానం

తూర్పు అంధేరీలో బీజేపీ సహా ప్రధాన పార్టీలేవీ పోటీచేయలేదు. దీంతో ఇక్కడ ఉద్ధవ్‌ ఠాక్రే సారథ్యంలోని ఉద్ధవ్‌ బాలాసాహెబ్‌ ఠాక్రే శివసేన గెలిచింది. శివసేన ఎమ్మెల్యే రమేశ్‌ లట్కే మరణంతో ఆయన భార్య రుతుజ ఉద్ధవ్‌ సేన తరఫున బరిలోకి దిగారు. ఎన్‌సీపీ, కాంగ్రెస్‌ మద్దతు ప్రకటించాయి. మొదట బీజేపీ తొలుత తన అభ్యర్థిని నిలిపినా.. మిత్రపక్షమైన బాలాసాహెబాంచీ శివసేన అధిపతి, సీఎం ఏక్‌నాథ్‌ షిండే అభ్యర్థనతో ఉపసంహరించుకుంది. ఆరుగురు స్వతంత్రులు కూడా పోటీచేయడంలో పోలింగ్‌ అనివార్యమైంది. 86,570 ఓట్లు పోలవగా.. రుతుజకు 66,530 ఓట్లు వచ్చాయి. ‘నోటా’ 12,806 ఓట్లతో రెండో స్థానంలో నిలవడం గమనార్హం. బీజేపీ, షిండే సేన పోటీచేసినా.. నోటాకు వచ్చినన్ని ఓట్లే వచ్చేవని మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ వ్యాఖ్యానించారు.

Updated Date - 2022-11-07T05:19:34+05:30 IST

Read more