BJP AAP: బీజేపీపై ఆప్ సంచలన ఆరోపణలు.. రూ.100 కోట్లతో...
ABN, First Publish Date - 2022-12-10T18:05:17+05:30
మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (MCD) ఎన్నికల్లో సత్తాచాటిన ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) బీజేపీపై (BJP) సంచలన ఆరోపణలు చేసింది.
న్యూఢిల్లీ: మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (MCD) ఎన్నికల్లో సత్తాచాటిన ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) బీజేపీపై (BJP) సంచలన ఆరోపణలు చేసింది. కొత్తగా ఎన్నికైన తమ కౌన్సిలర్ల కొనుగోలుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆప్ సీనియర్ నేత, రాజ్యసభ మెంబర్ సంజయ్ సింగ్ (sanjay singh) అన్నారు. రూ.100 కోట్ల భారీ మొత్తంతో 10 మంది కౌన్సిలర్లను కొనేందుకు బీజేపీ కుయుక్తులు పన్నుతోందని ఆరోపించారు. నూతనంగా ఎన్నికైన ముగ్గురు ఆప్ కౌన్సిలర్లతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. గత ఎంసీడీ(MCD) ఎన్నికలతో పోల్చితే బీజేపీకి 80 సీట్లు తగ్గాయని, అయినప్పటికీ మహారాష్ట్ర, అరుణాచల్‌ప్రదేశ్, ఉత్తరఖండ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, గోవా, గుజరాత్ రాష్ట్రాల్లో ఎమ్మెల్యేల కొనుగోలు మాదిరిగానే ఢిల్లీలో కూడా దిగజారుతుడు రాజకీయాలకు పాల్పడుతోందని అన్నారు. ఎన్నికైన ప్రజాప్రతినిధుల కొనుగోలు ఫార్మాలాను ఇక్కడా కొనసాగించాలని బీజేపీ నాయకులు చూస్తున్నారని విమర్శించారు. బెదిరింపులు, డబ్బు ద్వారా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ, ప్రజాతీర్పును అగౌరవపరుస్తున్న వ్యక్తులను అరెస్ట్ చేయాలని ఢిల్లీ పోలీస్ కమిషనర్‌ను కోరామని సంజయ్ సింగ్ తెలిపారు.
బీజేపీ సిగ్గులేని పార్టీ అని, 30 సీట్లు తక్కువగానే ఉన్నప్పటికీ ఢిల్లీ మేయర్ ఆ పార్టీకి చెందిన వ్యక్తులే ఉండాలని ఆ పార్టీ కలలు కంటోందని సంజయ్ సింగ్ విమర్శించారు. యోగేంద్ర చండోలియా అనే వ్యక్తి తమ పార్టీకి చెందిన ఒక మహిళా మేయర్‌కు ఫోన్ చేశారని, బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ ఆదేశ్ కుమార్ గుప్తా మాట్లాడుకుంటున్నారంటూ చెప్పాడని సంజయ్ వెల్లడించారు. ఎంసీడీ కౌన్సిలర్ల కొనుగోలుకు రూ.100 కోట్ల బడ్జెట్ సిద్ధంగా ఉందని బీజేపీ వాళ్లే అంటున్నారని ఆయన పేర్కొన్నారు.
Updated Date - 2022-12-10T18:12:08+05:30 IST