Vatican: మాజీ పోప్ బెనెడిక్ట్ 16 కన్నుమూత
ABN, First Publish Date - 2022-12-31T18:24:27+05:30
వాటికన్: మాజీ పోప్ బెనెడిక్ట్ 16 అనారోగ్యం కారణంగా శనివారం నాడు వాటికన్‌లోని తన నివాసంలో ...
వాటికన్: మాజీ పోప్ బెనెడిక్ట్ 16 (Pope Emeritus Benedict XVI) అనారోగ్యం కారణంగా శనివారం నాడు వాటికన్(Vatican)లోని తన నివాసంలో కన్నుమూశారు. ఆయన వయసు 95 సంవత్సరాలు. వాటికన్‌లోని మేటర్ ఎక్స్‌లెసీయా మొనాస్ట్రీలో ఉదయం 9.34 గంటలకు పోప్ ఎమిరైటస్ బెనడిక్ట్ ద సిక్స్‌టీన్త్ కన్నుమూసినట్టు విషాదంతో తెలియజేస్తున్నానని ఆయన తరఫు ప్రతినిధి తెలియజేశారు. 2023 జనవరి 2వ తేదీన పోప్ పార్థివదేహాన్ని సెయింట్ పీటర్స్ బసిలికాలో సందర్శన కోసం ఉంచుతామని తెలిపారు.
జర్మనీలో జన్మించిన జోసెఫ్ రాట్జింగర్ 78 ఏళ్ల వయస్సులో 2005లో పోప్‌గా ఎన్నికయ్యారు. 16వ బెనెడిక్ట్‌గా తన పేరు ఎంచుకున్నారు. 2013 ఫిబ్రవరి వరకూ బాధ్యతలు నిర్వహించిన ఆయన అనారోగ్యం కారణగా బాధ్యతల నుంచి తప్పుకున్నారు. పోప్ బెనెడిక్ట్ పదవిలో ఉన్న సమయంలో క్యాథలిక్ చర్చి పలు ఆరోపణలు, న్యాయవివాదాలను ఎదుర్కొంది. దశాబ్దాల పాటు మతాధికారులు చిన్నపిల్లలలపై అఘాయిత్యాలకు పాల్పడ్డారన్న అంశంపై నివేదకలు వెలుగులోకి వచ్చాయి. తాను ఆర్చిబిషప్‌గా ఉన్న కాలంలో అలాంటి అకృత్యాల కేసుల పరిష్కారం విషయంలో పొరపాట్లు జరిగాయని ఆయన గత ఏడాది అంగీకరించారు. అయితే తాను ఎలాంటి అనుచిత చర్యలకు పాల్పడలేదని తెలిపారు. కాగా, ఆయన తరువాత పోప్ అయిన ఫ్రాన్సిన్స్ ఇటీవల వాటికన్ సిటీకి వెళ్లి పోప్ బెనెడిక్ట్ ఆరోగ్యం గురించి వాకబు చేశారు. పోప్ బెనెడిక్ట్ చాలా అనారోగ్యంతో ఉన్నారని, ఆయన కోలుకోవాలని ప్రార్ధనలు చేయాలని మూడు రోజుల క్రితం ఆయన కోరారు. బెనెడిక్ట్ తన చివరి రోజులను వాటికన్ పరిధిలోని మేటర్ ఎక్స్‌లెసియా మొనాస్ట్రీలో గడిపారు. పోప్ పదవిని వదులుకున్న సుమారు దశాబ్దం తరువాత ఆయన శనివారంనాడు అనారోగ్యంతో కన్నుమూశారు.
Updated Date - 2022-12-31T19:39:59+05:30 IST