ఆరు నెలల శిశువుకు నీళ్లు తాగించవచ్చా?
ABN , First Publish Date - 2022-05-05T19:44:21+05:30 IST
మాకు ఆరు నెలల బాబు ఉన్నాడు. ఇప్పుడు వేసవిలో పెద్ద వాళ్లకే దాహానికి తట్టుకోలేకపోతున్నాం. ఫ్రిజ్‌లో బాటిల్స్ అన్నీ ఖాళీ చేసేస్తున్నాం. మరి మా బాబుకు కూడా దాహం

ఆంధ్రజ్యోతి(05-05-2022)
ప్రశ్న: మాకు ఆరు నెలల బాబు ఉన్నాడు. ఇప్పుడు వేసవిలో పెద్ద వాళ్లకే దాహానికి తట్టుకోలేకపోతున్నాం. ఫ్రిజ్‌లో బాటిల్స్ అన్నీ ఖాళీ చేసేస్తున్నాం. మరి మా బాబుకు కూడా దాహం అవుతుంది కదా! నీళ్లు తాగించొచ్చా? చిన్న పిల్లలకు నీళ్లు ఎక్కువ తాగించవద్దని అంటున్నారు. నిజమేనా? తెలియజేయండి.
- పావని, హైదరాబాద్
డాక్టర్ సమాధానం: ఆరు నెలల శిశువులకు నీళ్లు ఎక్కువగా తాగించడం అంత మంచిది కాదు. అయితే ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు శిశువులకు కూడా దాహం వేస్తుంటుంది. నీళ్లు దొరికితే తాగేస్తారు. దానివల్ల ఆహారం తినడం తగ్గిపోతుంది. నీళ్లలో క్యాలరీలు, ప్రోటీన్లు ఉండవు. నీళ్లు తాగినంత మాత్రాన బరువు పెరగరు. పాలు తాగే వయసు కాబట్టి వాళ్లకు కావలసిన హైడ్రేషన్ అందులోనే లభిస్తుంది. దాంతోపాటు సెమీ సాలిడ్స్ ఇవ్వాలి. జావ లాంటివి తాగించాలి. తరచుగా తల్లిపాలు తాగించాలి. ఆరు నెలల పాప పొట్ట చాలా చిన్నగా ఉంటుంది. దాన్ని మొత్తం నీళ్లతో నింపేయకూడదు. వేసవికాలంలో దాహం ఎక్కువగా ఉంటుంది కాబట్టి బాటిల్‌లో నీళ్లు పోసి అందిస్తే కనుక మొత్తం తాగేస్తారు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఇంట్లో ఏసీ ఉంటే కనుక ఆ విషయంలోనూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. గది తలుపులు, కిటికీలు మూసేసి ఏసీ ఆన్ చేస్తే కనుక ఆ గదిలో తేమ శాతం తగ్గిపోతుంది. ఫలితంగా పిల్లల ముక్కులు మూసుకుపోవడం, శ్వాసకు ఇబ్బంది పడటం జరుగుతుంది. కంటిన్యూగా ఏసీ వాడకుండా టైమర్ ఆన్ చేసి వాడుకోవాలి. కాసేపు తలుపులు తీసి పెట్టి తాజా గాలి గదిలోకి వచ్చేలా చూసుకోవాలి. గదిలో తేమ శాతం తగ్గిపోకుండా చూసుకునేందుకు హ్యుమిడిఫయర్స్‌ను ఉపయోగించవచ్చు. ఒక వెడల్పాటి పాత్రలో నీళ్లు పోసి గదిలో పెట్టుకున్నా ఫలితం ఉంటుంది.
డా. లక్ష్మీ వేదప్రకాశ్
కన్సల్టెంట్ నియోనటాలజిస్ట్ అండ్ పిడియాట్రీషియన్
రెయిన్‌బో చిల్డ్రన్ హాస్పిటల్
కొండాపూర్, హైదరాబాద్