Expensive Election : ఇంత ఖర్చంటే మునుగుడే!

ABN , First Publish Date - 2022-11-07T04:25:31+05:30 IST

మునుగోడు ఉపఎన్నిక రాజకీయ నేతల్లో ‘గుబులు’ పుట్టిస్తోంది. మున్ముందు రాబోయే ఎన్నికల్లో బరిలో నిలిచి ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకెళితే గెలవలేం అని.. కోట్లలో డబ్బు పెట్టాల్సిందేనని..

Expensive Election : ఇంత ఖర్చంటే మునుగుడే!
Expensive Election

దేశంలోనే అత్యంత ఖరీదైన ఎన్నిక ఇదే?

వందల కోట్లు వెదజల్లిన ప్రధాన పార్టీలు.. ఇంత ఖర్చు పెట్టగలమా?.. నేతల్లో ఆందోళన

హైదరాబాద్‌, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): మునుగోడు ఉపఎన్నిక రాజకీయ నేతల్లో ‘గుబులు’ పుట్టిస్తోంది. మున్ముందు రాబోయే ఎన్నికల్లో బరిలో నిలిచి ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకెళితే గెలవలేం అని.. కోట్లలో డబ్బు పెట్టాల్సిందేనని.. అప్పుడు కూడా విజయం సాధిస్తామన్న నమ్మకం లేదన్న ‘ఆందోళన’ను కలిగిస్తోంది. డబ్బులు పెట్టకుండా నిజాయితీనే నమ్ముకుంటే గెలవడం కల్ల అని మునుగోడు ఉప ఎన్నిక తేల్చింది. డబ్బుంటేనే రాజకీయాలుచేయాలి.. భూములు, ఇతర అస్తులుంటే అమ్మేసి బరిలో నిలబడాలి.. లేదంటే వేస్ట్‌ అన్న ‘తత్వాన్ని’ నేతలకు బోధపడేలా చేసింది. సినిమా పరిభాషలో చెప్పాలంటే ఈ ఉప ఎన్నిక ‘ట్రెండ్‌ సెట్టరే’! ఎన్నికల్లో మందు, విందు, డబ్బు పంపిణీ అనేది ఇవాళ్టి రోజుల్లో సాధారణమైపోయినా మునుగోడు ఉప ఎన్నికలో ప్రధాన పార్టీలు ‘విజయ కాంక్ష’ కోసం మునుపెన్నడూ లేనివిధంగా కనీవినీ ఎరుగని రీతిలో వందల కోట్లు వెదజల్లాయి. ఓటర్లు కూడా తమకు ఫలానా పార్టీ ఇంతిచ్చింది అంటూ బహిరంగంగా చెప్పేశారు. ఈ స్థాయి ‘ఖరీదయిన’.. ‘సర్వశక్తులొడ్డిన’ ఎన్నిక దేశంలో మునుపెన్నడూ జరగలేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కోడి పిల్లలను గంప కింద కమ్మినట్లు మునుగోడులో సొంత పార్టీ నేతలకే డబ్బులిచ్చి పార్టీ ఛత్రం నీడన ఎప్పటికప్పుడు కాపాడుకోవాల్సి పరిస్థితి ప్రధాన పార్టీలకు ఎదురైంది.

సొంత పార్టీ కార్యకర్తలు కూడా తమకు డబ్బులివ్వాలని డిమాండ్‌ చేయడం గతంలో ఎన్నడూ చూడలేదని నేతలే అంటున్నారు. సర్పంచ్‌లు, ఎంపీటీసీలను లక్షలు పోసి ప్రధాన పార్టీలు కొనుగోలు చేశాయి. వాళ్లను కొనడం గమనించిన ఓటర్లు ‘మరి మాకేంటి?’ అని నేతలను వారి ఎదుటే నిలదీశారు. ఈ ‘పోకడ’ గతంలో లేదు. ఇందుకు ప్రధాన పార్టీలూ ‘సై’ అన్నాయి! ఓటర్ల కరుణాకటాక్షం కోసం షెడ్యూలు విడుదలైనప్పటి ఓటు వేసేందుకు పోలింగ్‌ బూతుకు వెళ్లేదాకా వారిని మందు, విందుల్లో ముంచెత్తాయి.కులాలవారీగా ఆత్మీయ సమ్మేళనాలు జరిపాయి. ఉద్యోగస్థులకు ఒకటో తారీఖునే జీతాలివ్వడం, వారికి ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ విడుదల చేయడం, డిప్యూటేషన్స్‌ లాంటివి యుద్ధప్రాతిపదికన ప్రభుత్వం చేసేసింది. ఈ స్థాయిలో అధికార, విపక్ష పార్టీలు జరిపిన ‘పోల్‌ మేనేజ్‌మెంట్‌’ ఔరా అనిపించింది!

Updated Date - 2022-11-07T04:25:31+05:30 IST

Read more