Election scheme : ఎన్నిక వచ్చే.. పథకం తెచ్చే!

ABN , First Publish Date - 2022-11-07T04:38:20+05:30 IST

రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల్లో కొత్త పథకాలు పుట్టుకువచ్చాయి. ఏడాది క్రితం జరిగిన హుజూరాబాద్‌ ఉప ఎన్నిక సందర్భంగా దళిత బంధు పథకం తెరపైకి రాగా, తాజాగా

Election scheme : ఎన్నిక వచ్చే.. పథకం తెచ్చే!

ఉప ఎన్నికల్లో కొత్త స్కీంలు.. రాష్ట్ర ఖజానాపై తీవ్ర భారం

హైదరాబాద్‌, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల్లో కొత్త పథకాలు పుట్టుకువచ్చాయి. ఏడాది క్రితం జరిగిన హుజూరాబాద్‌ ఉప ఎన్నిక సందర్భంగా దళిత బంధు పథకం తెరపైకి రాగా, తాజాగా మునుగోడు ఉప ఎన్నికలో గొర్రెల పంపిణీ పథకంలో నగదు బదిలీని ప్రారంభించారు. దాంతో రాష్ట్రంలో ఉప ఎన్నిక వస్తే కొత్త పథకం వస్తుందన్న అభిప్రాయం ప్రజల్లో ఏర్పడింది. దీంతో పాటు నియోజకవర్గ సమస్యలు కూడా తీరుతాయని, ఇతర సంక్షేమ పథకాల పెండింగ్‌ నిధులు వస్తాయని అంచనా వేస్తున్నారు. ఉప ఎన్నిక రావడంతో మునుగోడు నియోజకవర్గంలో పెండింగ్‌ పనులు పూర్తి చేయడానికి ప్రభుత్వం కృషి చేసింది. ముఖ్యంగా రోడ్ల నిర్మాణం, గ్రామాల అభివృద్ధికి నిధుల మంజూరు వంటి చర్యలు చేపట్టింది. పోలింగ్‌ 3వ తేదీన జరగడంతో మునుగోడు పరిధిలో ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలు చెల్లించారు. మామూలుగా అయితే రాష్ట్రంలో జీతాల చెల్లింపు కొంత ఆలస్యంగా జరుగుతున్నది. ఈ విషయాలను పరిశీలిస్తున్న ప్రజలు తమ నియోజకవర్గాల్లో కూడా ప్రభుత్వం ఇలాంటి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అందుకే సిట్టింగ్‌ ఎమ్మెల్యేలపై రాజీనామాల కోసం అక్కడక్కడ డిమాండ్లు వస్తున్నాయి. ఉప ఎన్నికలు వస్తేనే అభివృద్ధి జరుగుతుందన్న అభిప్రాయం పలువురిలో నెలకొంది. అయితే ఉప ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో ప్రభుత్వ ఖజానాపై తీవ్ర భారం పడుతుంది. దీని ప్రభావం రాష్ట్ర ఆర్థిక స్థితిపై దీర్ఘకాలికంగా ఉండవచ్చు. ఈ విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

Updated Date - 2022-11-07T04:38:20+05:30 IST

Read more