MUNUGODE Exit polls: ఆధిక్యం అంచనాలో ‘ఎగ్జిట్‌పోల్స్‌’ బోల్తా!

ABN , First Publish Date - 2022-11-07T04:37:36+05:30 IST

హోరాహోరీగా జరిగిన మునుగోడు ఉప ఎన్నికలో అత్యధిక శాతం సర్వే సంస్థలు టీఆర్‌ఎస్‌ గెలుస్తుందని చెప్పినా పార్టీలకు వచ్చే ఓట్ల శాతం, ఆధిక్యం విషయంలో మాత్రం బోల్తాపడ్డాయి. నువ్వానేనా అన్నట్లుగా తలపడ్డ టీఆర్‌ఎస్‌-బీజేపీ మద్య ఓట్ల తేడా 4.57శాతమే అయినా ఈ అంచనా వేయడంలో తడబ డ్డాయి.

 MUNUGODE Exit polls: ఆధిక్యం అంచనాలో   ‘ఎగ్జిట్‌పోల్స్‌’ బోల్తా!

టీఆర్‌ఎస్‌-బీజేపీ మధ్య ఓట్ల శాతం

తేడా 10-15 మధ్య అని లెక్క

అందుకు విరుద్ధంగా 4.57శాతంతో పోరు హోరాహోరీ

హైదరాబాద్‌, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): హోరాహోరీగా జరిగిన మునుగోడు ఉప ఎన్నికలో అత్యధిక శాతం సర్వే సంస్థలు టీఆర్‌ఎస్‌ గెలుస్తుందని చెప్పినా పార్టీలకు వచ్చే ఓట్ల శాతం, ఆధిక్యం విషయంలో మాత్రం బోల్తాపడ్డాయి. నువ్వానేనా అన్నట్లుగా తలపడ్డ టీఆర్‌ఎస్‌-బీజేపీ మద్య ఓట్ల తేడా 4.57శాతమే అయినా ఈ అంచనా వేయడంలో తడబ డ్డాయి. చాలా సంస్థలు ఇరుపార్టీల మధ్య ఓట్ల శాతం 10 నుంచి 15 వరకు ఉంటుందని చెప్పాయి. థర్డ్‌ విజన్‌ రీసెర్చ్‌సంస్థ టీఆర్‌ఎస్‌కు గరిష్ఠంగా 51% ఓట్లు, బీజేపీకి 35ు ఓట్లు వస్తాయని.. ఆ మేరకు ఓట్లలో 16% తేడా ఉంటుందని చెప్పింది. ‘త్రిశూల్‌’ సంస్థ టీఆర్‌ఎస్‌కు 47%, బీజేపీకి 31% ఓట్లు వస్తాయని పేర్కొంది. నేషనల్‌ ఫ్యామిలీ ఓపీనియన్‌’ ఎగ్జిట్‌ పోల్‌ సర్వే టీఆర్‌ఎస్‌కు 42.11%, బీజేపీకి 35.17%, ఆత్మసాక్షి-‘ఎస్‌ఏఎస్‌’ సంస్థ టీఆర్‌ఎస్‌కు 41-42%, బీజేపీకి 35-36% వస్తాయని వెల్లడించింది. వీటి ఎగ్జిట్‌పోల్స్‌లో 5-7% మధ్య ఓట్ల వ్యత్యాసం ఉంటుందని కాస్త దగ్గరగా పేర్కొంది. ‘రీసెర్చ్‌-ఎఫ్‌ఎక్స్‌’ సంస్థ తమ సర్వేలో టీఆర్‌ఎస్‌కు 35%, బీజేపీకి 29% ఇచ్చినా కాంగ్రెస్‌కు ఏకంగా 27% ఇచ్చింది. కానీ కాంగ్రెస్‌కు వచ్చింది కేవలం 10.58ు ఓట్లే. ‘పల్స్‌ టుడే’ తమ సర్వేలో టీఆర్‌ఎస్‌కు 42-43%, బీజేపీకి 38.5%, కాంగ్రెస్‌కు 14-16%, ఇతరులకు 1% ఓట్లు వస్తాయని వెల్లడించింది. ‘తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక’ తమ సర్వేలో టీఆర్‌ఎస్‌కు 40.9%, బీజేపీకి 31% అని పేర్కొంది.

ఆ మేరకు ఇరుపార్టీల మధ్య ఏకంగా 9.9% వ్యత్యాసం ఉంటుందని అంచనా వేసింది. ‘ఆరా’ సంస్థ టీఆర్‌ఎస్‌కు 50.82% ఓట్లు, బీజేపీకి 33.86% ఓట్లు అంటే ఏకంగా 17% వరకు తేడా ఉందని సర్వే రిపోర్టు ఇచ్చింది. తమ ఎగ్జిట్‌ పోల్‌ సర్వేలో టీఆర్‌ఎస్‌కు 42%, బీజేపీకి 35% ఓట్లు వస్తాయని తేలినట్లు ‘రాష్ట్ర’ వెల్లడించింది. టీఆర్‌ఎస్‌ 7% ఓట్ల మెజారిటీతో విజయం సాధిస్తుందని తెలిపింది. ‘అపరేషన్‌ చాణక్య’ అనే సంస్థ మాత్రం టీఆర్‌ఎస్‌కు 46% ఓట్లు పోలయ్యాయని పేర్కొంది. బీజేపీకి 38%, కాంగ్రెస్‌కు 16% ఓట్లు పోలయ్యాయని తెలిపింది. ఈ లెక్కన బీజేపీపై టీఆర్‌ఎస్‌ 9-16 వేల ఓట్ల మెజారిటీతో గెలిచే అవకాశాలున్నాయని వెల్లడించింది. ‘కౌటిల్య’ సర్వే మాత్రం.. టీఆర్‌ఎస్‌ కంటే బీజేపీకి 5.36ు ఎక్కువ ఓట్లు వస్తున్నట్లు, బీజేపీ గెలుస్తున్నటు ప్రకటించటం గమనార్హం. బీజేపీకి 44.62% ఓట్లు వస్తాయని, టీఆర్‌ఎస్‌కు 39.26% మాత్రమే ఓట్లు వస్తాయని కౌటిల్య సంస్థ వెల్లడించింది. కానీ సీన్‌ రివర్స్‌ అయ్యింది. టీఆర్‌ఎస్‌ గెలిచింది. మునుగోడులో కమలం వికసిస్తుందని ‘మిషన్‌ చాణక్య’ ఎన్నికల సర్వే సంస్థ వెల్లడించింది. టీఆర్‌ఎస్‌పై బీజేపీ 1.78% మెజారిటీ వస్తుందని, బీజేపీకి 40.16% ఓట్లు, టీఆర్‌ఎస్‌కు 38.38% ప్రకటించింది. కానీ ఈ రెండు కీలక సంస్థలు కూడా ఓటరు నాడిని అంచనా వేయలేకపోయాయి.

Updated Date - 2022-11-07T04:37:36+05:30 IST

Read more