CPM :వికసించిన ఎర్రగులాబీ

ABN , First Publish Date - 2022-11-07T04:30:49+05:30 IST

జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలని భావిస్తోన్న సీఎం కేసీఆర్‌కు.. బీజేపీని దీటుగా ఎదుర్కొనేందుకు మునుగోడులో కమ్యూనిస్టులు తోడయ్యారు. ‘ఎర్ర’గులాబీతో కారు+సారు=సర్కారు

CPM :వికసించిన ఎర్రగులాబీ

కారుకు ‘కమ్యూనిస్టు’ ఇంధనం.. కలిసొచ్చిన కామ్రేడ్ల ఓటు బ్యాంకు

హైదరాబాద్‌/నల్లగొండ, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలని భావిస్తోన్న సీఎం కేసీఆర్‌కు.. బీజేపీని దీటుగా ఎదుర్కొనేందుకు మునుగోడులో కమ్యూనిస్టులు తోడయ్యారు. ‘ఎర్ర’గులాబీతో కారు+సారు=సర్కారుకు మార్గం సుగమం చేశారు. బీజేపీని అడ్డుకునే లక్ష్యంతో పనిచేస్తున్న కామ్రేడ్లకూ కేసీఆర్‌ రూపంలో మంచి మిత్రుడు తోడయ్యారు. మునుగోడు సాక్షిగా కారు, కంకికొడవలికి మధ్య కుదిరిన స్నేహంతో.. ‘కమ్యూనిస్టు’ ఇంధనంతో కారు మైలేజీ బాగా పెరిగింది! కమ్యూనిస్టుల ఓటు బ్యాంకున్న మండలాలు అధికార పార్టీకి బాగా కలిసొచ్చాయి. తొలి నాలుగు రౌండ్ల ఓట్ల లెక్కింపు చౌటుప్పల్‌ ఓట్లకు సంబంధించింది కాగా.. 5-10 రౌండ్లలో సంస్థాన్‌ నారాయణపురం, మునుగోడు, చండూరు మండలాల ఓట్లను లెక్కించారు. ఇక్కడ సీపీఎం బలంగా ఉంది. ఈ మండలాల్లో టీఆర్‌ఎస్‌కు స్వల్ప ఆధిక్యత కొనసాగింది. 11వ రౌండ్‌ నుంచి పరిస్థితి మారుతూ వచ్చింది. గట్టుప్పల్‌, మర్రిగూడ, నాంపల్లి మండలాల ఓట్లను 10-15 రౌండ్లలో లెక్కించారు. ఈ మూడు మండలాల్లో సీపీఐకి గట్టి పట్టుంది. కమ్యూనిస్టుల ఓట్లు ఇక్కడ టీఆర్‌ఎస్‌ ఆధిక్యతను పెంచేందుకు దోహద పడ్డాయి. 10 రౌండ్ల వరకు టీఆర్‌ఎస్‌ ఆధిక్యం వెయ్యి ఓట్ల లోపే ఉండగా.. 11వ రౌండ్‌లో 1,361, 12లో 2,000, 13లో 1,345, 14లో 1,055 మెజారిటీ వచ్చింది. ఈ నాలుగు రౌండ్లలో అధికార పార్టీ 5,761 ఓట్ల ఆధిక్యతతో విజయాన్ని ఖరారు చేసుకుంది. కారు విజయంలో కామ్రేడ్లు కీలకంగా మారినట్లు స్పష్టమైంది. ఈ పరిణామాలతో కమ్యూనిస్టులు సంబరపడుతున్నారు.

ఫలితమిచ్చిన పొత్తు..

మునుగోడులో కమ్యూనిస్టుల ప్రభావాన్ని ముందే అంచనా వేసిన కేసీఆర్‌.. వారి మద్దతు కూడగట్టడంపై ప్రత్యేక శ్రద్ధ చూపారు. మునుగోడు నియోజకవర్గ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు మొత్తం 12 సార్లు ఎన్నికలు జరగ్గా.. కాంగ్రెస్‌ 6 సార్లు, సీపీఐ 5 సార్లు గెలుపొందాయి. అధికార టీఆర్‌ఎస్‌ 2014లో మొదటిసారి ఇక్కడ బోణీ కొట్టింది. నియోజకవర్గం పరిధిలో సీపీఐ, సీపీఎంలకు దాదాపు 15-20 వేల ఓట్లున్నాయి. నియోజకవర్గంలో కమ్యూనిస్టుల బలాన్ని ఊహించి, సీఎం కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయమే పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించిందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

కమ్యూనిస్టులకు బలమైన కేడర్‌

మునుగోడులో సీపీఎంకు పెద్ద సంఖ్యలో సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, వార్డు మెంబర్లు ఉన్నారు. దీంతో కమ్యూనిస్టులు.. తాము పోటీ చేసి, ఓట్లను చీల్చేకంటే.. బీజేపీని ఢీ కొట్టే శక్తి ఉన్న పార్టీకి మద్దతివ్వడమే సరైందని భావించడంతో కారుతో కలిసి ప్రయాణాన్ని ప్రారంభించారు. ఇరు పార్టీల క్యాడర్‌తో చండూరులో ప్రత్యేకంగా బహిరంగ సభ నిర్వహించారు. అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని వారికి పరిచయం చేసి, ఆయన్ను గెలిపించుకోవాల్సిన బాధ్యతను వివరించారు. కమ్యూనిస్టు పార్టీల సీనియర్‌ నేతలు కేసీఆర్‌తో కలిసి సభలో పాల్గొన్నారు. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కూడా.. కమ్యూనిస్టుల ఓటుబ్యాంకు టీఆర్‌ఎ్‌సకు కలిసొచ్చిందని వ్యాఖ్యానించడం గమనార్హం..!

Updated Date - 2022-11-07T04:30:49+05:30 IST

Read more