Group-1 సిలబస్‌ విషయంలో ఎలాంటి అవగాహన ఉండాలి

ABN , First Publish Date - 2022-05-11T17:17:34+05:30 IST

టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1 పరీక్ష నోటిఫికేషన్‌ విడుదల చేసిన సందర్భంలో సిలబస్‌ విషయంలో విద్యార్థులు సరైన అవగాహన కలిగి ఉండాలి. ప్రిలిమ్స్‌ పరీక్ష సిలబస్‌లో మొత్తం 13 టాపిక్‌లు ఉంటాయి. భారతదేశ చరిత్ర, తెలంగాణ చరిత్ర - సంస్కృతికి సంబంధించి రెండు టాపిక్‌లు..

Group-1 సిలబస్‌ విషయంలో ఎలాంటి అవగాహన ఉండాలి

భారత సాంస్కృతిక వారసత్వం, నాగరికత పరిణామ క్రమ అవగాహన అవసరం  

తెలంగాణ కంపొనెంట్‌కు వెయిటేజ్‌

రాజకీయేతర అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. 

సొంతంగా నోట్స్‌ ప్రిపేర్‌ చేసుకుంటే మంచిది. 


టీఎస్‌పీఎస్సీ(tspsc) గ్రూప్‌-1 పరీక్ష నోటిఫికేషన్‌ విడుదల చేసిన సందర్భంలో సిలబస్‌ విషయంలో విద్యార్థులు సరైన అవగాహన కలిగి ఉండాలి. ప్రిలిమ్స్‌ పరీక్ష సిలబస్‌లో మొత్తం 13 టాపిక్‌లు ఉంటాయి. భారతదేశ చరిత్ర, తెలంగాణ చరిత్ర - సంస్కృతికి సంబంధించి రెండు టాపిక్‌లు ఉంటాయి. భారతదేశ చరిత్ర, సాంస్కృతిక వారసత్వం, తెలంగాణ సమాజం, సంస్కృతి, వారసత్వం, కళలు, సాహిత్యం. సాధారణంగా సివిల్స్‌ పరీక్షకు ప్రిపేరయ్యే విద్యార్థులు గ్రూప్‌-1 సిలబస్‌( Group 1 Syllabus) ప్రత్యేక అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే సిలబస్‌ తెలంగాణ కంపొనెంట్‌కు వెయిటేజ్‌ ఎక్కువగా ఉంటుంది. చారిత్రక వారసత్వం, హిస్టరీ, జాగ్రఫీ, ప్రభుత్వ విధానాలు ప్రముఖంగా ఉన్నాయి. 


సివిల్స్‌(Civils‌)తో పోల్చినప్పుడు సిలబస్‌లో తెలంగాణ అంశాల ప్రాధాన్యతను విద్యార్థులు అర్థం చేసుకోవాలి. గ్రూప్‌-1 సిలబస్‌ మొత్తంగా రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై ఫోకస్‌ కలిగి ఉన్నది. ముఖ్యంగా చరిత్ర, సంస్కృతికి సంబంధించి సంప్రదాయ పద్ధతిలో కాకుండా సామాజిక, ఆర్థిక, కళలు, వాస్తుశిల్పం వగైరా అంశాలను దృష్టిలో ఉంచుకోవాలి. పోటీ పరీక్షల చరిత్ర సిలబస్‌ బీఏ, ఎంఏ సిలబస్‌ కంటే భిన్నంగా ఉంటుంది. జనరల్‌ డిగ్రీ స్థాయి సిలబస్‌, ఓరియంటేషన్‌ పోటీ పరీక్ష కంటే భిన్నంగా ఉంటుంది. ఉదాహరణకు గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ సిలబస్‌లో ‘చరిత్ర- భారతదేశ సాంస్కృతిక వారసత్వం’ అనే టాపిక్‌ ఉంది. సాధారణంగా విద్యార్థులు చరిత్ర అనేటప్పటికి రాజవంశాలు, యుద్ధాలు, సంధులు, ఒడంబడికలు, తేదీల ప్రాముఖ్యం కలిగి ఉంటుందని అనుకుంటారు. అది తప్పుడు అవగాహన. 


చరిత్ర వారసత్వం అనే అంశం ప్రధానంగా సాంస్కృతిక, మత, తాత్వికత, కళలు, వాస్తుశిల్పానికి సంబంధించి ఉంటుంది. కాబట్టి రాజకీయ, వంశం, పాలన సంబంధాల గురించి ఫోకస్‌ చేయాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ప్రిలిమ్స్‌ పరీక్షలో తేదీలకు సంబంధించిన ప్రస్తావన ప్రముఖంగా ఉండదు. అయితే ప్రముఖ రాజవంశాలు, ప్రసిద్ధ రాజుల గురించిన అవగాహనను విద్యార్థులు కలిగి ఉండాలి. భారతదేశ సాంస్కృతిక వారసత్వానికి సంబంధించినంత వరకు నాగరికత పరిణామక్రమాన్ని అవగాహన చేసుకోవాలి. సింధు నాగరికత, ఆర్యన్‌/వేదిక్‌ నాగరికత మౌలిక లక్షణాలు, జైన, బౌద్ధ మతాల సిద్ధాంతాలు, తాత్వికత. ఈ రెండు మతాల మధ్య తేడాలు, పోలికలు, వైదిక వాజ్మయం, తాత్వికత, మత పరిస్థితుల గురించి అవగాహన తప్పకుండా ఉండాలి. ఎందుకంటే ప్రాచీన భారత నాగరికత పరిణామక్రమంలో అంతర్లీనంగా ఉన్నటువంటి అంశాల గురించి తెలుసుకోవడం అవసరం. 


సాధారణంగా ప్రిలిమ్స్‌ ప్రశ్నపత్రంలో రాజకీయ అంశాల కంటే సాంస్కృతిక, మత, తాత్వికత అంశాలకు ప్రాధాన్యం ఉంటుంది. కాబట్టి విద్యార్థులు సామాజిక, సాంస్కృతిక అంశాలను దృష్టిలో పెట్టుకొని నోట్స్‌ ప్రిపేర్‌ చేసుకోవాలి. వైదిక యుగానికి సంబంధించినంత వరకు ఆనాటి సామాజిక వ్యవస్థ, మత పరిస్థితులు, సాహిత్యం, జీవన విధానం వగైరా లాంటి అంశాలపై నిర్దిష్ట అవగాహన ఉండాలి. అలాగే  తొలి, వేద, మలి వేదకాలం నాటి సామాజిక వ్యవస్థ, మత వ్యవస్థల్లో వచ్చిన మార్పులు. వాటి కారణాలకు సంబంధించిన అవగాహన కూడా ఉండాలి. అదేవిధంగా ప్రాచీన భారత నాగరికతలో జైన, బౌద్ధ మతాల ప్రాముఖ్యం, వాటి సిద్ధాంతాలు, సిద్ధాంతకర్తలు, వాటి పరిణామ క్రమం, క్షీణత గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ప్రాచీన భారతదేశంలో వెలసిల్లిన శిల్పకళలు, లలిత కళలు, వాస్తుశిల్పం, పాళీ, సంస్కృత సాహిత్యం గురించిన అంశాలపై ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది.


కొంతమంది విద్యార్థులు ముఖ్యమైన టాపిక్స్‌ లేదా తమకు ఇష్టమైన అంశాల గురించి ప్రత్యేక శ్రద్ధ చూపించి, కొన్ని అంశాలపై నిర్లక్ష్యం చేసే అలవాటు ఉంటుంది. అది సరైన పద్ధతి కాదు. ప్రిలిమ్స్‌ పేపర్‌ సెట్టింగ్‌లో ప్రతి టాపిక్‌ గురించి ప్రశ్నలు ఉంటాయి. కాబట్టి విద్యార్థులు సిలబస్‌ మొత్తంపైన సరైన అవగాహన కలిగి ఉండాలి.


మధ్యయుగాల చరిత్ర

మధ్యయుగాల భారతదేశ చరిత్ర, సాంస్కృతిక  వారసత్వానికి సంబంధించినంత వరకు భక్తి, సూఫీ ఉద్యమాలు వాటి ప్రాముఖ్యం గురించి తెలుసుకోవాలి. ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశంలో వెలసిల్లిన భక్తి, సంస్కరణ ఉద్యమాల గురించిన అవగాహన, ఇస్లాం మత ప్రభావం, సూఫీయిజం మౌలిక లక్షణాలపై తులనాత్మక దృక్పథం కలిగి ఉండాలి. ఢిల్లీ సుల్తానులు, మొఘల్‌ రాజులు, విజయనగర సామ్రాజ్యం, చోళులు, చాళుక్యులు, కాకతీయుల కాలం నాటి సాహిత్యం, కళలు, సామాజిక, మత, సాంస్కృతిక, ఆర్థిక పరిస్థితులు, కట్టడాలు, వాస్తుశిల్పం, నిర్మాణ శైలి గురించి అధ్యయనం చేయాలి. ఆధునిక యుగానికి సంబంధించి  ప్రభావం 19-20ల శతాబ్దాలలో జరిగిన సంఘ సంస్కరణ ఉద్యమాలు, వాటి ప్రాధాన్యం, ప్రభావం, ఉత్తర, దక్షిణ భారతదేశంలో చెలరేగిన సామాజిక చైతన్యం, కుల వ్యతిరేక అస్తిత్వ ఉద్యమాలు గురించి తెలుసుకోవాలి. అదేవిధంగా స్వాతంత్రోద్యమ చరిత్ర, వివిధ ఘట్టాలు, గాంధీయుగం గురించిన అంశాలపై ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. స్థూలంగా ఆధునిక యుగంలో సంభవించిన సంఘ సంస్కరణ, బ్రిటిష్‌ వ్యతిరేక పోరాటాలు, కార్మిక, కర్షక, ఆదివాసి ఉద్యమాలు గురించి తెలుసుకోవాలి.


సాధారణంగా ప్రిలిమ్స్‌ ప్రశ్నపత్రంలో రాజకీయ అంశాల కంటే సాంస్కృతిక, మత, తాత్వికత అంశాలకు ప్రాధాన్యం ఉంటుంది. కాబట్టి విద్యార్థులు సామాజిక, సాంస్కృతిక అంశాలను దృష్టిలో పెట్టుకొని నోట్స్‌ ప్రిపేర్‌ చేసుకోవాలి.


తెలంగాణ చరిత్ర

తెలంగాణ చరిత్రకు సంబంధించి శాతవాహనుల నుంచి ఆసఫ్‌జాహీల పాలన వరకు సిలబస్‌ ప్రకారం ప్రశ్నలు వస్తాయి. అయితే ఇక్కడ రాజకీయ, పాలన అంశాలు, తెలంగాణ ఉద్యమానికి సంబంధించి కాకుండా సామాజిక, సాంస్కృతిక, వారసత్వం, కళలు - సాహిత్యం గురించిన ప్రస్తావన మాత్రమే ఉంది. కాబట్టి విద్యార్థులు ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రిపేర్‌ కావాల్సి ఉంటుంది. ప్రాచీన తెలంగాణకు సంబంధించినంత వరకు శాతవాహన, శాతవాహన తదనంతర కాలం, నాటి సామాజిక పరిస్థితులు, సాహిత్యం, కళలు, సాంస్కృతిక అంశాలపై, మత పరిస్థితులు అంటే బౌద్ధ, జైనం, వైదిక మతం గురించి ఫోకస్‌ పెట్టాలి. శాతవాహన యుగానికి సంబంధించి కట్టడాలు, వాస్తుశిల్పం ముఖ్యంగా బౌద్ధ, జైన కట్టడాల ప్రాముఖ్యత గురించి తెలుసుకోవాలి. మధ్యయుగ తెలంగాణలో  కాకతీయులు, పద్మనాయకులు, కుతుబ్‌షాహీల కాలం నాటి సాంస్కృతిక, మత పరిస్థితులు, భక్తి, సూఫీ ఉద్యమాల గురించి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా కాకతీయులు, పద్మనాయకులు, కుతుబ్‌షాహీల సాహిత్య సేవ, కట్టడాలు, వాస్తుశిల్పం, లలిత కళలు, నిర్మాణ శైలి గురించిన అవగాహన ఉండాలి. అదేవిధంగా ఆసఫ్‌జాహీల కాలం నాటి మత, సాంస్కృతిక, సాహిత్య వికాసం గురించి కూడా తెలుసుకోవాలి. మొత్తంగా చూసినట్లయితే సామాజిక పరిణామక్రమం, సాహిత్య వికాసం, వాస్తుశిల్ప శైలిలు, కళలు తదితర అంశాలపై ప్రశ్నలు ఉంటాయి. అందువల్ల విద్యార్థులు రాజకీయేతర అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ప్రిలిమ్స్‌ పరీక్షలో విద్యార్థుల తులనాత్మక, విమర్శనాత్మక, సాపేక్షిక అవగాహనను బేరీజు వేయడం జరుగుతుంది. అందువల్ల వీలైనంత వరకు విద్యార్థులు విషయ నిపుణులు రాసిన పుస్తకాలను చదవాలి. మార్కెట్‌లో లభించే గైడ్‌లు, స్టడీ మెటీరియల్‌, రెడీమేడ్‌ నోట్స్‌పై ఆధారపడకూడదు.


ప్రిలిమ్స్‌ సిలబస్‌లో ఉన్న పదమూడు టాపిక్‌లను విద్యార్థులు క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. ఏ ఒక్క టాపిక్‌ను కూడా వదిలిపెట్టకూడదు.  కొంతమంది విద్యార్థులు ముఖ్యమైన టాపిక్స్‌ లేదా తమకు ఇష్టమైన అంశాల గురించి ప్రత్యేక శ్రద్ధ చూపించి, కొన్ని అంశాలపై నిర్లక్ష్యం చేసే అలవాటు ఉంటుంది. అది సరైన పద్ధతి కాదు. ప్రిలిమ్స్‌ పేపర్‌ సెట్టింగ్‌లో ప్రతి టాపిక్‌ గురించి ప్రశ్నలు ఉంటాయి. కాబట్టి విద్యార్థులు సిలబస్‌ మొత్తంపైన సరైన అవగాహన కలిగి ఉండాలి. సిలబస్‌ను కూలంకషంగా అధ్యయనం చేసి తదనుగుణంగా సొంతనోట్స్‌ ప్రిపేర్‌ చేసుకుంటే మంచిది. 


-అడపా సత్యనారాయణ

విశ్రాంత ఆచార్యులు

ఉస్మానియా యూనివర్సిటీ



Read more