ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మరణశాసనం రాసి మూడేళ్లు!

ABN, First Publish Date - 2022-12-16T01:34:09+05:30

పోరూపోటీ సమఉజ్జీల మధ్య జరగడం యుద్ధనీతి. ప్రభుత్వం నీతి తప్పి రాష్ట్ర ప్రయోజనాల కోసం భూములు త్యాగం చేసిన బక్కరైతులపై యుద్ధం చేస్తోంది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పోరూపోటీ సమఉజ్జీల మధ్య జరగడం యుద్ధనీతి. ప్రభుత్వం నీతి తప్పి రాష్ట్ర ప్రయోజనాల కోసం భూములు త్యాగం చేసిన బక్కరైతులపై యుద్ధం చేస్తోంది. తాము ఇస్తున్న భూముల్లో రాష్ట్ర భవిష్యత్ నిర్మితం కాబోతుందన్న ఆనందంతో అమరావతి రాజధానికి 34 వేల ఎకరాలు ఇచ్చిన రైతుల ఆనందం ఆవిరై, వారి భవిష్యత్ సమాధై ఇప్పటికి ముచ్చటగా మూడేళ్లైంది. రాజధాని అమరావతి ప్రాంతంలో ఏర్పాటు చేయాలని ఏ ఒక్క రైతూ ఆనాటి ప్రభుత్వాన్ని అడగలేదు. ప్రభుత్వమే రాజధాని నిర్మాణానికి భూములు అడిగింది. రాష్ట్ర విభజన వల్ల ఏర్పడిన ఆర్థిక సంక్షోభం కారణంగా నష్టపరిహారం ఇచ్చేందుకు కూడా నిధులు లేవు. అందుకే ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు తీసుకుంది.

తాము తరతరాలుగా నమ్ముకున్న భూమిలో నిర్మించిన శాసనసభలోనే 2019 డిసెంబర్ 17న జగన్ రెడ్డి మూడు రాజధానులు ప్రకటించి అమరావతి రాజధానికి మరణ శాసనం రాశారు. అప్పటి నుంచి భూమి పోయి, భుక్తి పోయి మానసిక క్షోభతో వారానికి ఇద్దరు రైతుల చొప్పున సుమారు 230 మంది ప్రాణాలు కోల్పోయారు. మహిళలు ముందుండి ఆవేదనతో, ఆక్రోశంతో సాగిస్తున్న ఈ సుదీర్ఘ పోరాటం దేశ ఉద్యమాల చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోతుంది. శాంతియుతంగా గాంధేయ మార్గంలో ఉద్యమాన్ని నడిపిస్తున్నారు.

ఆనాటి అధికార, ప్రతిపక్షాలు, మిగిలిన రాజకీయ పక్షాలు, ప్రజాసంఘాలు అందరూ కలిసి అమరావతి రాజధానిని ఆమోదించారు. దీనిని దృష్టిలో పెట్టుకుని 2019 సెప్టెంబరు 4న గత తెలుగుదేశం ప్రభుత్వం అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. రాజధాని రాష్ట్రానికి నడిబొడ్డులో ఉండాలి, కనీసం 30వేల ఎకరాలు కావాలి, 13 జిల్లాల చిన్న రాష్ట్రం కాబట్టి ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టడం ఇష్టంలేక అమరావతి రాజధానిని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాను అని అసెంబ్లీలో ఆనాటి ప్రతిపక్ష నేత జగన్రెడ్డి చేసిన బాసలు తాను అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే మాట తప్పారు.

రాజధాని ప్రాంతాన్ని పాడుబెట్టి అక్కడ ఉన్న నిర్మాణ సామాగ్రి, ఇనుము, ఇసుక, మట్టి... చివరకు రోడ్లు కూడా తవ్వి తరలించారు. రాజధాని రైతుల ఉద్యమం అణచివేసేందుకు జగన్ ప్రభుత్వం చెయ్యని ప్రయత్నం లేదు. సెక్షన్ 144, సెక్షన్ 30 విధించి ప్రజలను స్వేచ్ఛగా తిరగనివ్వకుండా నిర్బంధించి, పోలీసులు కవాతులు చేసి భయబ్రాంతులకు గురిచేశారు. కౌళ్లు కూడా సకాలంలో ఇవ్వడం లేదు. రైతులను అడుగడుగునా అవమానిస్తూ వారి న్యాయమైన హక్కుల కోసం చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని కర్కశంగా అణచివేశారు. గత ప్రభుత్వ అభివృద్ధిని, ఒప్పందాలను కొనసాగించి ఉంటే రాష్ట్రానికి 130 సంస్థలు వచ్చి 12.50 లక్షల ఉద్యోగాలు యువతకు లభించేవి. పాలకుల స్వార్థ రాజకీయం అమరావతి రాజధానికే కాదు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకి శాపంగా మారింది.

రాజధాని సమస్య ఒక్క 29 గ్రామాల రైతులు, రైతు కూలీలదే కాదు. ఐదు కోట్ల ఆంధ్రుల భవిష్యత్తుతో ముడిపడిన సమస్య. రాజధాని మార్పు వల్ల ఎక్కువగా నష్టపోయేది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలేనని చెప్పాలి. భూములిచ్చిన వారిలో 50శాతానికి పైగా వారే ఉన్నారు. ఇప్పటికే రాజధాని ప్రాంతంలో విట్, ఎస్ఆర్ఎం, అమృతమయి యూనివర్సిటీలు, వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఎయిమ్స్, కొండవీటివాగు ఎత్తిపోతల పథకం మొదలైనవి పూర్తయినవి. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఐఏఎస్, ఐపీఎస్, ఇతర ఉద్యోగుల గృహసముదాయాలు 70శాతం పూర్తయ్యాయి. దేశంలోనే గ్రీన్ ఫీల్డ్ సిటీగా అవతరించబోతున్న తొలిప్రాంతం ఇది. రూ.15వేల కోట్ల అభివృద్ధి పనులు జరిగాయి. మరో రూ.30వేల కోట్ల పనులు ప్రారంభమయ్యాయి. శాసనసభ, శాసనమండలి సమావేశాలు జరుగుతూనే ఉన్నాయి. సచివాలయం, కోర్టులు పని చేస్తున్నాయి. రాజాధాని నిర్మాణం నిలిపివేయ్యకుండా ఉంటే సంపద సృష్టించే కల్పవృక్షంగా మారి ఉండేది. ఇప్పటికే పరిశ్రమలు తరలిపోయి సుమారు రూ.2లక్షల కోట్ల పెట్టుబడులు ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయి. సంపద సృష్టి లేకపోవడంతో ఆదాయం కూడా లేకుండాపోయింది. అమరావతి ఆగిపోవడంతో తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు లాభదాయకంగా మారింది. నిర్మాణ రంగం, రియల్ ఎస్టేట్ అక్కడ బాగా అభివృద్ధి చెంది ఆయా రాష్ట్రాలకు ఆదాయం పెరిగింది. సాక్షాత్తు ముఖ్యమంత్రే రాజధాని అంశాన్ని ఉద్దేశపూర్వకంగా వివాదాస్పదంగా మార్చారు. పాలకుడు మారిన ప్రతిసారీ రాజధాని మార్చుకుంటూ పోతే జరిగేది అభివృద్ధి కాదు, వినాశనం. జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల నిర్ణయం ఒక రాజకీయ వికృత క్రీడ. ఇదొక చారిత్రక తప్పిదం.

అమరావతి నుండి అరసవెల్లికి, తిరుపతికి రైతులు చేపట్టిన పాదయాత్రలకు ప్రజల నుంచి అపూర్వమైన స్పందన వచ్చింది. అది చూసిన పాలకపక్షంలో వణుకు మొదలై పాదయాత్ర చేస్తున్న రైతులపై ఉక్కుపాదం మోపారు. అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. రక్షణ కల్పించాల్సిన పోలీసులే దాడులను ప్రోత్సహించారు. రాజధానిని మార్చే హక్కు, మూడు రాజధానులు పెట్టే అధికారం ప్రభుత్వానికి లేదని తెలిసి కూడా మూడు రాజధానుల పేరిట ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. రాజధానిని మార్చే అధికారం ఉంటే పార్లమెంటులో ప్రైవేటు బిల్లు, సుప్రీంకోర్టులో పిటీషన్ ఎందుకు వేశారు? సుప్రీంకోర్టులో విచారణ దశలో ఉన్నప్పుడు గర్జనలు, ర్యాలీలు, ఆత్మగౌరవ సభలు ఎందుకు పెడుతున్నారు? ఒకవైపు ఆర్థిక సంక్షోభం, మరోవైపు రాజకీయ సంక్షోభాలతో అధికారం పోతుందనే అభద్రతాభావంతో అభివృద్ధి వికేంద్రీకరణ తెరపైకి తెచ్చారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ వెనుకబాటు పేరుతో సాక్షాత్తూ ముఖ్యమంత్రే కృత్రిమ ఉద్యమాలను రెచ్చగొడుతున్నారు.

ప్రజలు, ప్రజాసంఘాలు, ప్రతిపక్షాలు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు గర్జనలు, ర్యాలీలు, ఆత్మగౌరవ సభలు పెడతాయి. కానీ పాలకపక్షమే స్వయంగా సభలు, సమావేశాలు ఏర్పాటుచేస్తోంది. ఆయా సభల్లో ఆ ప్రాంత అభివృద్ధి గురించి చర్చించడం మానేసి మూడు రాజధానులు, చంద్రబాబుపై విమర్శలు తప్ప మరో ఎజెండా లేదు. మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకున్నట్లు హైకోర్టు, సుప్రీంకోర్టులో చెప్పారు. హైకోర్టు అమరావతిలోనే ఉంటుందని, కర్నూలుకు తరలించడం లేదని ప్రభుత్వ న్యాయవాదితో సుప్రీంకోర్టుకు చెప్పించారు. మళ్ళీ రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు కోసం ఎందుకు గర్జనలు చేశారో, ఎవరిని మభ్యపెట్టడానికో జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు సమాధానం చెప్పగలరా? జగన్ చెప్పే అధికార వికేంద్రీకరణ అంతా ఒక బూటకమని మంత్రి ధర్మాన మాటల ద్వారా తేటతెల్లమైంది. అసలు రాజధాని విశాఖే అని తేల్చేశారు. విశాఖలో జగన్రెడ్డి అండ్ కో భూకబ్జాల ద్వారా 42 నెలల్లో 40వేల కోట్ల లూటీ చేశారు. విశాఖలో అవినీతి సామ్రాజ్య నిర్మాణం కోసం అమరావతిని అటకెక్కించారు. తమ సామంతరాజులుగా ఎంపీ విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలను నియమించుకుని యథేచ్ఛగా భూకబ్జాలు చేశారు. మంత్రి ధర్మాన, స్థానిక ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కోట్లాది రూపాయల విలువైన భూములను కాజేశారు.

రాజ్యాన్ని నేరస్థులు ఏలుతున్నారంటే మేధావులు స్వార్థపరులైనా అయిఉండాలి, లేదా పిరికివారైనా అయిఉండాలి. రాష్ట్ర అభివృద్ధి కోసం, భావితరాల భవిత కోసం విజ్ఞులు, మేధావులు, సమాజహితులు తమ స్వార్థాన్ని, మౌనాన్ని వీడాలి. ఇప్పటికైనా ప్రభుత్వం పట్టుదలకు పోకుండా అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగిస్తూ, మూడు రాజధానుల తంతుకు ముగింపు పలకాలని ప్రజలు కోరుకుంటున్నారు.

మన్నవ సుబ్బారావు

(డిసెంబరు 17: అమరావతి ఉద్యమానికి మూడేళ్లు)

Updated Date - 2022-12-16T01:34:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising