విలువలేం మిగిలాయని ఈ వీరాలాపాలు!

ABN , First Publish Date - 2022-12-08T03:43:48+05:30 IST

దైవక్షేత్రాలలో భక్తుల రద్దీ పెరిగిపోతున్నప్పుడు, ‘చూశారా గురువుగారూ, మా మెజారిటీ పెరిగిపోతూనే ఉన్నది’ అంటూ ఒక ఆస్తిక విద్యార్థి తన నాస్తిక గురువుతో పరిహాసంగా...

విలువలేం మిగిలాయని ఈ వీరాలాపాలు!

దైవక్షేత్రాలలో భక్తుల రద్దీ పెరిగిపోతున్నప్పుడు, ‘చూశారా గురువుగారూ, మా మెజారిటీ పెరిగిపోతూనే ఉన్నది’ అంటూ ఒక ఆస్తిక విద్యార్థి తన నాస్తిక గురువుతో పరిహాసంగా అన్నాడట. ‘కంటికి కనిపించే వాపును చూసి బలుపు అనుకోకు, ఆస్తికులు కావడానికి ఏ ప్రయత్నం అక్కరలేదు, ఎంతో చదివి తర్కించుకుని కానీ ఒక మనిషి నాస్తికుడు కాలేడు, వారి సంఖ్య ఏ మాత్రం పెరిగినా అదే బ్రహ్మాండమైన పెరుగుదల, ఒకరు ఇద్దరయ్యారంటే రెట్టింపు అయినట్టు, అంతిమంగా వారి సంఖ్యే పెరుగుతూ పోతుంది’ అని ఆ గురువు సమాధానం చెప్పాడట. పైకి కనిపించే లెక్కల్లో కాక, సారాంశంలో గెలుపోటములను చూడాలన్నది ఆ ఉపాధ్యాయుడి ఉపదేశం. అన్ని ఎగ్జిట్ పోల్స్ ఊదరగొట్టినట్టుగా, గుజరాత్ లో రికార్డుస్థాయి విజయాన్ని బిజెపి దక్కించుకున్నా, హిమాచల్ లో హోరాహోరీ కూడా బిజెపికే మొగ్గుగా మారినా, ఆ విజయాలు, బుధవారం నాటి ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసిడి) ఫలితాలకు సాటిరావు. ఎప్పటినుంచో గెలుస్తూ వస్తున్న ఒక మహాస్థానిక సంస్థను, ఎదురులేనంత ఎదిగిపోయినట్టు కనిపిస్తున్న జాతీయ బాహుబలి పార్టీ, అదికూడా దేశరాజధానిలో నిలబెట్టుకోలేకపోవడం అంటే, బహుశా అవరోహణం మొదలయిందేమో?

చీకటిలో ఉన్నవారికి వెలుతురు కలలు తప్ప మరేవీ ధైర్యం ఇవ్వలేకపోవచ్చు. ఆశ అత్యవసరమైనప్పుడు, ప్రతి శిలలో దైవం కనిపించవచ్చు. మిణుగురులోనూ మహాకాంతిని దర్శించవచ్చు. ఈ ఎన్నికల వలయంలో ఏ చమత్కారమో అద్భుతమో జరిగి ఊపిరాడని వర్తమానం నుంచి విముక్తి దొరుకుతుందనుకుందాం, పాతను తీసివేసి కొత్తగా వచ్చేది మాత్రం ఏమిటి?

కొన్ని వ్యాఖ్యలతో, ప్రశ్నలతో ఈ సన్నివేశాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. మద్యం కుంభకోణం అని చెప్పి కేంద్రప్రభుత్వం, దాని ఏజెన్సీలు ఎంత హడావిడి చేసినా, ఢిల్లీ ప్రజలు ఖాతరు చేయలేదు. పైగా స్థానిక సంస్థలో అధికారంలో ఉన్న జాతీయ అధికారపార్టీని ఓడించారు. ఆ కుంభకోణం అసత్యం అని, కేంద్రం వేధింపు మాత్రమే అని ప్రజలు నమ్మారా? ఆ ఆరోపణలు ఏమైనా, ఢిల్లీలో ఆమ్ ఆద్మీపార్టీ పాలన మెరుగుగా ఉన్నదని అనుకుని, కేవలం సత్పరిపాలనకే ఓటు చేశారా? బిజెపి కంటె ‘ఆప్’ తక్కువ ప్రమాదకారి అని అనుకుని ఎంచుకున్నారా? అవినీతి వ్యతిరేక ఉద్యమం నుంచి పుట్టిన ‘ఆప్’ను ఇంకా స్వచ్ఛమైన రాజకీయపార్టీగానే జనం విశ్వసిస్తున్నారా? వివిధ రాష్ట్రాలలో విస్తరిస్తూ, ఎన్నికలలో పోటీచేస్తున్న ఆ పార్టీ ఎన్నికల కమిషన్ గీసిన గిరులకు, బరులకు లోబడే ఖర్చు చేస్తున్నదా?

‘ఆప్’ మీదనే ప్రత్యేకంగా గురిపెట్టనక్కరలేదు కానీ, ఇప్పడున్న రాజకీయార్థిక వాతావరణంలో దేశంలో ఏ పార్టీ కూడా పరిపాలననుంచి, ప్రజాధనం నుంచి రాజకీయాదాయాన్ని సమకూర్చుకోకుండా మనుగడ సాగించే స్థితి లేదని మాత్రం గుర్తించాలి. ప్రభుత్వం ఒక క్రమబద్ధీకరణ వ్యవస్థగా మాత్రమే ఉండాలని ఉద్బోధించిన నూతన ఆర్థిక విధానాలు, పనిలోపనిగా, దేశపు, సమాజపు, ప్రజల ఉమ్మడి వనరులను ఉచితంగానో కారుచవకగానో కొందరు భుక్తం చేసుకునేందుకు వీలయిన విన్యాసాలకు ఆస్కారం ఇచ్చాయి. పీవీ నరసింహారావుతో మొదలైన ఈ మూడుదశాబ్దాల కాలం, ఆయనే పశ్చాత్తాపపడేంత అసభ్య, అమానుష, అనైతిక ఆర్థిక సంస్కృతికి దారితీసింది. తొలి దశల సంస్కరణలు ఆనాటికి ఇంకా తమ వికృత బీభత్స విశ్వరూపాన్ని ప్రదర్శించలేదు. ఆ నాటికి ఇంకా వ్యాపార కార్పొరేట్ రంగాలకు, రాజకీయాలకూ, ప్రభుత్వానికీ మధ్య మాటవరస దూరాలైనా ఉండేవి. ఎవరేమి చేస్తున్నారో మీడియా వేయి కళ్లు పెట్టి చూసేది.

ఒక కోణం నుంచి చూస్తే ఢిల్లీ ఫలితాలకు ప్రాముఖ్యం ఉన్నది కానీ, నరేంద్రమోదీకి గుజరాత్ ఫలితాలే ముఖ్యం. ఆయన ఆమోదనీయతకు, ఆరోహణకు కేంద్రస్థానం అదే. ప్రధానమంత్రిగానే కాక, గుజరాత్ ముఖ్యమంత్రిగా కూడా నరేంద్రమోదీ ముఖమే అక్కడి జనంలో ఇంకా కొనసాగుతోంది. శాంతిభద్రతలకు, రాజకీయాలకూ వ్యూహకర్త అమిత్ షా, ఆసియాలోనే అతి ధనవంతుడిగా, ప్రపంచంలోనే మూడో సంపన్నుడిగా తానే తీర్చిదిద్దిన గౌతమ్ అదానీ, ఈ ఇద్దరి అధికారానికీ ప్రాభవానికీ గుజరాతే పునాది. అత్యంత విషాదకరమైన 2002 హింస, దాని మీద నిర్మితమైన కొత్త ఆధిపత్యం, అదనంగా ఆర్థికవిధానాల నూతన నమూనాకర్తగా ప్రచారం ఇవన్నీ కలగలసిన సోపానపటం మీద మోదీ–షాల ప్రయాణం సాగింది. ఇవన్నీ జాగ్రత్తగా ముందే రచించిన పథకం ప్రకారం జరిగాయా, పరిస్థితులు కూడా కలసివచ్చాయా అన్నది చరిత్రకారులు తేల్చాలి. గుజరాత్ నుంచి రాజకీయాధికారం విస్తరించినట్టే, ఆర్థికాధికారం కూడా వ్యాపించింది. ఈ క్రమానికి ప్రతీకాత్మకంగా, 2014లో ఎన్నికల ఫలితాల తరువాత మోదీ, అదానీ కంపెనీ సొంత విమానంలోనే ఢిల్లీకి వచ్చారు. ఆ తరువాత, అనేక విదేశ ప్రయాణాలకు అదానీని తోడు తీసుకుని వెళ్లి, ఆయనకు వేల కోట్ల డాలర్ల కాంట్రాక్టులు రావడానికి సాయపడ్డారు. శ్రీలంక విషయంలో అటువంటి పైరవీ చాలా అప్రదిష్ట కూడా తెచ్చింది. వివిధ రాష్ట్రాలలో సొంత ప్రభుత్వాలను ఏర్పాటు చేయడానికి బిజెపి ఎన్నికలను, ‘ఇతర’ పద్ధతులను అనుసరించినట్టే, అదానీ కంపెనీలు కూడా తమ విస్తరణ కోసం సాధారణ పద్ధతులతో పాటు, ప్రభుత్వ స్నేహాన్ని, సామదానభేద దండోపాయాలను విరివిగా ఉపయోగించుకున్నాయని తెలుసుకుని ఆశ్చర్యపోతాము. ఇప్పుడు బొంబాయిలో ధారవి మురికివాడలను సంస్కరించే ప్రాజెక్టు అదానీదే! జగన్మోహన్ రెడ్డి ఇట్లాగే మౌనసహాయం కొనసాగిస్తే విశాఖ ఉక్కు కూడా వారిదే! రవిగాంచనిచో కవి గాంచును అంటారు, మోదీకి ప్రవేశం లేని సీమలలో కూడా అదానీకి రాజమార్గాలుంటాయి. రాజస్థాన్ లో కాంగ్రెస్ ప్రభుత్వమైనా సరే, కేరళలో కమ్యూనిస్టుల ప్రభుత్వమైనా సరే, అదానీ పెట్టుబడులకు ఎర్రతివాచీ పరచవలసిందే! ‘అన్ని పక్షాల నాయకులతో, సామాజిక నేతలతో సత్సంబంధాలు కలిగిన వ్యక్తి కనుకనే, అదానీకి ఇంత ఆమోదనీయత లభించింది’ అని ఆయన జీవితచరిత్రకారుడు వ్యాఖ్యానించాడు. ఈ మధ్యే ప్రచురితమైన ఈ పుస్తకం ఆవిష్కరణకు పట్టుమని పాతికమంది కూడా రాలేదన్న సమాచారం, ఆయన విమర్శకుల అసూయానందానికి తప్ప ఎందుకూ పనికిరాదు!

గుజరాత్ సీఎం ప్రధాని స్థానానికి ఎదిగాడు కాబట్టి, అక్కడి పెట్టుబడిదారులు ఇంతింతై వటుడింతయ్యారు. ప్రకటిత ప్రాంతీయపార్టీలకు, ఖర్మవశాన ప్రాంతీయపార్టీలుగా కుదించుకుపోయిన పార్టీలకు కూడా వారి వారి సొంత ఆశ్రిత అదానీలున్నారు. రాజకీయాన్ని, వ్యాపారాన్ని కలగలపి డబ్బు పంటపండించగలవారున్నారు. లేకపోతే, తెలంగాణ, ఆంధ్ర ప్రభుత్వాలకు సన్నిహితులైన సంపన్నులతో పాటు, రాజకీయవాదులు కూడా ఢిల్లీకి వెళ్లి సారాబేరాలు చేయడం ఏమిటి? మద్యం, ప్రాథమిక సదుపాయాల కాంట్రాక్టులు ప్రభుత్వాలకు దగ్గరగా ఉండే ఆదాయమార్గాలు. ఈ దారుల్లో డబ్బు ఒక్కోసారి ముందుకూ ప్రయాణిస్తుంది లేదంటే, క్యాష్ బాక్ పద్ధతుల్లో వెనక్కు కూడా ప్రవహిస్తుంది. వందల వేల కోట్లు ఎట్లా ప్రయాణిస్తాయి? నోట్ల రద్దు గండాన్ని వీళ్లందరూ ఎట్లా తప్పించుకున్నారు? ఎవరు ఎవరికి కప్పాలు కడుతున్నారు? 2003 నుంచి నరేంద్రమోదీ, యుపిఎ హయాంలో కాంగ్రెస్ నేతలు, తరువాత కాలంలో కెసిఆర్, జగన్మోహన్ రెడ్డి దాకా కిరాయివిమానాల ఖర్చులు ప్రభుత్వం భరించినా, కంపెనీలు భరించినా అదేమంత మర్యాదైన విషయం కాదు. అటు ఫిరాయింపుల కోసం కేంద్రపార్టీ పెద్దలు, మధ్యవర్తులు, ఇటు మద్యం స్కామ్ లో పాత్రధారులు ప్రత్యేక కిరాయి విమానాల్లో రాకపోకలు సాగించారంటే, ఎంతటి వెగటు పుడుతుంది! అందుకే, కేంద్రప్రభుత్వంపై సైద్ధాంతిక పోరాటం చేస్తున్నామంటున్న కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల ప్రకటనలలోని నిజాయితీపై సందేహం కలుగుతుంది. ఇంతా చేసి, ఇది ప్రాంతీయ ప్రభుత్వాల ఆశ్రిత కార్పొరేట్లకు, జాతీయ ప్రభుత్వం ఆశ్రిత కార్పొరేట్లకు నడుమ స్పర్థయేమో అనిపిస్తుంది! ఏ స్థాయిలో వారైనా, బలవంతులకు, బలహీనులకు మధ్య పోరాటంలో, సాపేక్ష న్యాయపక్షాన్ని ఎంచుకోవలసి రావడం ప్రజల దురదృష్టం.

ఒకనాడు కల్తీ వ్యాపారులు, దొంగనిల్వదారులు, ఆ తరువాత స్మగ్లర్లు, మాఫియాలు ప్రతినాయకులుగా ఉండేవారు. ఇప్పుడు, ప్రత్యేక సొంత విమానాల్లో ఎగిరే జాతీయ అంతర్జాతీయ వ్యాపారులు, ప్రజల వనరులను ప్రభుత్వ సాయంతో కబళించే కార్పొరేట్లు ఖల్ నాయకులు. స్వాతంత్ర్యం వచ్చిన తొలిదశకాల పెట్టుబడిదారులు కనీసం హుందాగా, ఏవో తమకు తోచిన కొన్ని విలువలతో ఉండేవారు. రాజకీయవాదులు కూడా అప్రదిష్టలకు భయపడేవారు. ఇప్పుడు అంతా, ఆడంబరం, కపటం, నిస్సిగ్గు అభినయం! తలదించుకోవలసిన పని చేసి కూడా, బాధితుల వలె, వీరుల వలె ప్రలాపాలు!

ఎక్కడా నికార్సయిన పక్షం లేదు. వెన్నెముక కలిగిన వ్యక్తిత్వం లేదు. ప్రగల్భంగా దిగజారని మాట లేదు. అయినా, పెద్ద విపత్తు ఒకటి కత్తివలె వేలాడుతున్నది కాబట్టి, దిగమింగుకోవాలి. తక్కువ ప్రమాదంతో జట్టు కట్టాలి! ఎంత విషాద సందర్భం!

కార్పొరేట్ రంగంలో జరిగిన అత్యంత భయానకమైన టేకోవర్ ఎన్డీటీవీది. అదానీకి సత్యాసత్యాల గురించి కూడా అభిప్రాయాలున్నాయి. ‘ఎన్డీటీవీ నిష్పాక్షికత గురించి ఏ భయమూ అక్కరలేదు. ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తే, ఆ విషయం చెప్పాలి. అట్లాగే, ప్రభుత్వం ఏదైనా సరైన పనిచేస్తే, అది చెప్పే ధైర్యం కూడా ఉండాలి’ అన్నారాయన. ఈ మహత్తర విలువను అమలుచేయడానికి ఆయన రిపబ్లిక్ టీవీని ఎందుకు కొనుక్కోలేదో?

కె. శ్రీనివాస్

Updated Date - 2022-12-08T03:43:48+05:30 IST

Read more