రాజకీయ గ్రహణంలో ‘సహకార’ స్ఫూర్తి
ABN, First Publish Date - 2022-12-27T03:00:20+05:30
భారతదేశ వ్యవసాయ రంగంపై కార్పొరేట్ కంపెనీల, ముఖ్యంగా విదేశీ బహుళ జాతి కంపెనీల ఆధిపత్యాన్ని ఎక్కువ మంది వ్యతిరేకిస్తారు...
భారతదేశ వ్యవసాయ రంగంపై కార్పొరేట్ కంపెనీల, ముఖ్యంగా విదేశీ బహుళ జాతి కంపెనీల ఆధిపత్యాన్ని ఎక్కువ మంది వ్యతిరేకిస్తారు. కార్పొరేట్‌ల ప్రవేశంతో, దేశీయ ఆర్థిక వ్యవస్థ దివాళా తీస్తుందని, దేశ రాజకీయ స్వాతంత్ర్యం, ఆహార భద్రత కూడా ప్రమాదంలో పడతాయని కూడా సరిగానే విశ్లేషిస్తారు. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీని జ్ఞాపకం తెచ్చుకుని, మరీ భవిష్యత్ ప్రమాదాన్ని గురించి హెచ్చరిస్తారు. ఇంతవరకూ బాగానే ఉంది. కానీ వీటికి ప్రత్యామ్నాయం గురించి అడిగితే మాత్రం అనేక మంది గందరగోళంలో పడిపోతున్నారు.
నిజానికి ఇప్పటికే దేశ వ్యవసాయ రంగంలో కార్పొరేట్లు ప్రవేశించాయి. వ్యవసాయ ఉపకరణాల (రసాయనాలు, యంత్రాలు) రంగంలో మెజారిటీ వాటాను అవి ఆక్రమించాయి. విత్తన రంగంపై ఈ కార్పొరేట్లు ఆధిపత్యం సంపాదించాయి. వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ రంగంలో, ముఖ్యంగా రిటైల్ రంగంలో అనేక బహుళ జాతి సంస్థలు ఇప్పటికే ప్రవేశించి, వేగంగా చిన్న పట్టణాలకు కూడా విస్తరిస్తున్నాయి. ముఖ్యంగా ఆన్‌లైన్ రిటైల్ సంస్థలు కూడా బాగా వేళ్లూనుకుంటున్నాయి. దేశీయ బడా రిటైల్ కంపెనీలు ఈ బహుళ జాతి కంపెనీలలో జూనియర్ భాగస్వాములుగా చేరుతున్నాయి, లేదా విలీనమవుతున్నాయి. 2020లో కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజల పైకి తోసిన మూడు రైతు వ్యతిరేక చట్టాలు వెనక్కు పోకుండా, పూర్తి స్థాయిలో అమలయి ఉంటే మరిన్ని దేశ, విదేశీ కార్పొరేట్ కంపెనీలు మన వ్యవసాయ, అనుబంధ రంగాలలోకి చొచ్చుకు వచ్చేవి.
కార్పొరేట్ల ప్రధాన లక్షణమే లాభాపేక్ష. వాళ్ళు తెచ్చే స్వంత నిధులు తక్కువే అయినా, దేశీయ బ్యాంక్ రుణాలతో పెట్టుబడులను సమకూర్చుకోవడం, కొత్త టెక్నాలజీ ఏమీ తీసుకు రాకుండానే, ఇప్పటివరకూ దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషించిన ప్రభుత్వరంగ సంస్థలను, దశాబ్దాలుగా పోగుపడిన వాటి ఆస్తులను కబ్జా చేయడం, వినియోగదారీ సాంస్కృతిక ఆధిపత్యంతో, దేశ ప్రజలను కేవలం తమ సరుకుల వినియోగదారులుగా మార్చడం ద్వారా ప్రైవేట్ రంగ వ్యాపార సంస్థలు, కార్పొరేట్ కంపెనీలు తమ లాభాలను పెంచుకోవాలని తహతహలాడుతుంటాయి. మరో వైపు రైతులు, మహిళలు, ఇతర వృత్తిపరమైన ప్రజలు ఏర్పరుచుకునే సహకార సంఘాలు ప్రకటించుకున్న ప్రధాన లక్ష్యం పరస్పర సహాయం, సహకారం. సమష్టిగా కొన్ని కార్యక్రమాలను నిర్వహించుకోవడం ద్వారా ఉమ్మడిగా అభివృద్ధి సాధించడం.
1965లో అమలులోకి వచ్చిన పిఎసిఎస్ చట్టం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో 903 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు ఏర్పడ్డాయి. 1995లో అమలులోకి వచ్చిన ఎంఎసిఎస్ చట్టం క్రింద ఎస్‌ఈఆర్‌పి సహకారంతో 45 లక్షల మంది మహిళల భాగస్వామ్యంతో మహిళా సహకార సంఘాలను నిర్మించుకున్నారు. గొర్రెల, మేకల పెంపకందారులు, మత్స్యకారులు, గీత కార్మికులు కూడా ఈ చట్టం క్రింద సంఘాలను నిర్మించుకున్నారు. గ్రామ, జిల్లా స్థాయిలో పాల రైతుల సహకార సంఘాలు కూడా ఏర్పడి మంచి ఫలితాలు సాధిస్తున్నాయి. 1956 కంపెనీ చట్టంలో చేసిన సవరణ ద్వారా, 2013 నుండి రాష్ట్రంలో రైతు ఉత్పత్తిదారుల సంఘాలు/ కంపెనీలు (ఎఫ్‌పిఓ) ఏర్పడుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో సుమారు లక్షన్నర మంది గ్రామీణ రైతులు, ఇతర ఉత్పత్తిదారులు వాటాదారులుగా 500కు పైగా కంపెనీలు ఏర్పడ్డాయి.
ఇక్కడే కొన్ని ప్రశ్నలకు అందరం జవాబులు వెతకాలి. రాష్ట్రంలో ఇంత పెద్ద సంఖ్యలో రైతుల, ప్రజల సహకార సంఘాలు ఉనికిలో ఉన్నా సరే గ్రామీణ ప్రాంత సంక్షోభం ఎందుకు కొనసాగుతున్నది? ప్రభుత్వాల రైతు, ప్రజా వ్యతిరేక తప్పుడు నిర్ణయాలను ఈ సహకార సంఘాలు ఎందుకు ప్రశ్నించడం లేదు? ప్రభుత్వాల ముందు, ఈ సంఘాలు ఎందుకు నిర్దిష్ట డిమాండ్లు ఉంచడం లేదు? ఈ సహకార సంఘాలు పని చేస్తున్న గ్రామాలలో కూడా రైతులు ఎందుకు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు?
పరిశీలించిన మేరకు దీనికి కొన్ని కారణాలు కనపడుతున్నాయి. దశాబ్దాల క్రితమే ఏర్పడి, ఇప్పటికీ కొనసాగుతున్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలపై రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఒక రూపంలో అజమాయిషీ కొనసాగిస్తున్నది. ఆయా రాజకీయ పార్టీలు కూడా ఈ సహకార సంఘాలపై ఆధిపత్యం సాధించి, తమ గుప్పెట్లో పెట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నాయి. ప్రభుత్వమూ, రాజకీయ పార్టీలూ కలసి ఈ సహకార సంఘాల నిజమైన స్ఫూర్తిని చంపేశాయి.
2015 నుండి రాష్ట్రంలో ఏర్పడుతున్న రైతు ఉత్పత్తిదారుల కంపెనీలు (ఎఫ్‌పిసి) ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ సంస్థల సహకారంతో రాష్ట్రంలో చిన్న, పెద్ద స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఏర్పడుతున్నాయి. వీటిని ప్రోత్సహిస్తున్న చాలా స్వచ్ఛంద సంస్థలు, ఎంత నిజాయితీగా పని చేసినా, ఆర్థికంగా బలహీనమైనవి. ప్రభుత్వాలు, లేదా ఇతర బడా సంస్థలు నిర్దిష్ట కాలానికి ఇచ్చే ప్రాజెక్టులపై ఆధారపడి కార్యక్రమాలు కొనసాగించేవి. రాజకీయ ప్రక్రియకు దూరంగా, క్షేత్ర స్థాయిలో అందరినీ కలుపుకుపోయి కొన్ని కార్యక్రమాలను అమలుచేయాల్సిన బాధ్యత కలిగినవి.
అందుకే రోజువారీ ప్రజల సమస్యలను అర్థం చేసుకున్నా, ఈ సమస్యలతో రైతులు, ప్రజలు ఇబ్బంది పడుతున్నట్లు కనపడుతున్నా, వాటిని పరిష్కరించే విధంగా ప్రభుత్వాలపై, ఒక్కోసారి ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలపై ఒత్తిడి చేయలేని నిస్సహాయ స్థితిలో ఈ సంస్థలు ఉండిపోతున్నాయి. వీరు ప్రోత్సహించే సహకార సంఘాలు తమ సభ్యులకు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అమ్మేందుకు అవసరమైన లైసెన్సులు ఇచ్చేందుకు వ్యవసాయ విస్తరణ అధికారులు లంచాలు అడిగితే, ఎదిరించలేక వేల రూపాయలు లంచాలు సమర్పించుకోవడం చాలాసార్లు సాధారణమైపోయింది. ఈ స్థితిలో ప్రభుత్వాల తప్పుడు విధానాలను ఈ సహకార సంఘాలు, వాటిని ప్రోత్సహిస్తున్న సంస్థలు కనీసం ప్రశ్నించలేకపోవడాన్ని మనం అర్థం చేసుకోవచ్చు.
రాజ్యాంగాన్ని, చట్టాలను, ప్రభుత్వ జీవోలను అమలు చేయమని అడగటాన్ని ప్రభుత్వాలు నేరంగా చూస్తున్నాయి. తమను ఎదిరించినట్లుగా భావిస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీలే కాదు, సమాజంలో ఎవరు ప్రశ్నించినా, తమ సమస్యల పరిష్కారం కోసం ఏ డిమాండ్లు పెట్టినా సహించలేని స్థితికి ప్రభుత్వాలు చేరుకున్నాయి. ఆయా సంస్థలను అవమానించడం, బెదిరించడం, ఆర్థిక వనరులపై దెబ్బ కొట్టడం, నిర్బంధాన్ని ప్రయోగించడం సాధారణమైపోయింది. ఈ నేపథ్యంలో స్వచ్ఛంద సంస్థలు, అవి ప్రోత్సహిస్తున్న రైతుల, ప్రజల సహకార సంఘాలు ప్రభుత్వాల తప్పుడు విధానాలకు వ్యతిరేకంగా ఏ క్రియాశీల కార్యాచరణ చేపట్టగలుగుతాయి? రైతుల, ప్రజల సహకార సంఘాలు, రైతు ఉత్పత్తిదారుల కంపెనీలు ఇప్పుడు కొనసాగిస్తున్న కార్యక్రమాలు తప్పకుండా అవసరమైనవే కానీ, వాటి ఆలోచనా ధోరణిని, కార్యక్షేత్రాన్ని మరింత క్రియాశీలంగా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. గ్రామ స్థాయిలో సహకార సంఘాలను రాజకీయ పార్టీలకు అతీతంగా ఉంచాల్సిందే కానీ, రైతుల, తమ సభ్యుల ప్రాథమిక హక్కులపై పని చేసే, ప్రశ్నించే స్వభావాన్ని తప్పకుండా పెంచుకోవాల్సిన అవసరం ఉంది.
ప్రజలు తమ హక్కులు అడగడమే, తమ డిమాండ్లను ప్రభుత్వం ముందు పెట్టడమే ‘రాజకీయమై’ పోదు. ఉదాహరణకు లక్షలాది కౌలు రైతులను గుర్తించే 2011 చట్టాన్ని, పోడు రైతులకు పట్టాలు ఇచ్చే అటవీ హక్కుల చట్టాన్ని, ప్రకృతి వైపరీత్యాలకు నష్టపరిహారం ఇవ్వాలనే 2021 రాష్ట్ర హైకోర్టు తీర్పును, ఒకే విడతలో రైతుల ఋణ మాఫీ హామీని, పంటల బీమా పథకాలను అమలు చేయాలని, అన్ని పంటలకూ కనీస మద్దతు ధరలు అందాలని ప్రభుత్వాలను అడగడమూ తప్పేమీ కాదు. ఇవన్నీ ఆయా సహకార సంఘాల, రైతు ఉత్పత్తిదారుల కంపెనీల సభ్యుల న్యాయమైన కోర్కెలు.
ఇలాంటి ప్రాథమిక అంశాలపై కూడా మాట్లాడకపోతే, సహకార సంఘాల సమష్టితత్వానికి, బలానికి ఉండే ప్రయోజనమేమిటి? రైతు సహకార సంఘాలు తమ సభ్యుల నిత్య జీవిత, వృత్తిపరమైన సమస్యలపై మాట్లాడనంత కాలం వారి సమస్యలు పరిష్కారం కావు. అవసరమైతే ఈ సంఘాలు రాష్ట్ర స్థాయిలో ఒక ఫోరంగా ఏర్పడి ఉమ్మడిగా అడగాలి. రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు ఈ సహకార సంఘాల స్ఫూర్తిని కాపాడడానికి విచక్షణను ప్రదర్శించాలి.
కన్నెగంటి రవి
రైతు స్వరాజ్య వేదిక
Updated Date - 2022-12-27T03:00:24+05:30 IST