వాణిజ్య భారతానికి పాఠశాల!
ABN, First Publish Date - 2022-12-15T00:58:38+05:30
ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యాసంస్థగా ఎదిగిన హైదరాబాద్‌లోని ‘ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్ బి)’ ఏర్పాటు వెనుక రెండు దశాబ్దాల క్రితం ఒక నాయకుడి అవిరళ కృషి...
ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యాసంస్థగా ఎదిగిన హైదరాబాద్‌లోని ‘ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్ బి)’ ఏర్పాటు వెనుక రెండు దశాబ్దాల క్రితం ఒక నాయకుడి అవిరళ కృషి, అప్పుడు చోటుచేసుకున్న ఆసక్తికరమైన పరిణామాలు ఉన్నాయి. ఆర్ధికవ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో, పారిశ్రామికరంగానికి సూక్ష్మస్థాయి నైపుణ్యాలలో శిక్షణ పొందిన యువకుల అవసరం ఉన్నదని గుర్తించి 1996లో కొందరు అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలు ఆసియాలో ఒక ప్రపంచస్థాయి ప్రత్యేక వ్యాపార కళాశాల ఏర్పాటుకు పూనుకున్నారు. తదనుగుణంగా, ఏడాదిలోపే వార్టన్ స్కూల్, కెల్లాంగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్తో కలిసి ఒక అంతర్జాతీయ అకడమిక్ కమిటీ ఏర్పడింది. ఆ తర్వాత లండన్ బిజినెస్ స్కూల్ కూడా బోర్డులో భాగస్వామి అయింది. భారతదేశంలోని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కళాశాలను తమ రాష్ట్రంలో ప్రారంభించాలని కోరాయి. మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాలు వివిధ ప్రతిపాదనలతో పోటీపడ్డాయి. ఈ తరుణంలో, అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వేగంగా పావులు కదిపి, బిజినెస్ స్కూల్ ప్రతినిధి బృందాన్ని మెప్పించి, ఒప్పించడంతో అంతవరకూ కనీసం ఆలోచనలో కూడా లేని హైదరాబాద్‌లో ఆ సంస్థ ఏర్పాటు కావడం, తద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అవకాశాలను పుణికిపుచ్చుకొనే అవకాశం యువతకు దక్కడం ఒక విశేషమైన పరిణామం.
ఇతర రాష్ట్రాలు ఐఎస్బి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న తరుణంలో, బిజినెస్ స్కూల్ ప్రతినిధి బృందాన్ని చంద్రబాబు తన నివాసంలో బ్రేక్ ఫాస్ట్‌కు ఆహ్వానించారు. వారికి స్వాగతం పలకడానికి ఒక మంత్రిని విమానాశ్రయానికి పంపారు. బృందంలోని సభ్యులకు తానే స్వయంగా అల్పాహార విందు వడ్డించారు. ఆ తరువాత, ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా హైదరాబాద్‌లో క్యాంపస్ ఏర్పాటు ఆవశ్యకతను, ప్రయోజనాలను వారికి విశదీకరించారు. పోటీలో ఉన్న మిగతా రాష్ట్రాలకంటే ఎక్కువ రాయితీలు, సత్వర అనుమతులకు హామీ ఇచ్చారు. అనుకున్న సమయానికి సంస్థను ఆరంభించేట్టు చేసే బాధ్యత తనదన్నారు. అప్పటివరకు ఐఎస్బి ఏర్పాటు జాబితాలో హైదరాబాద్ నగరం లేదనీ, కానీ చంద్రబాబు ప్రభుత్వం దాని విషయంలో చూపిన చొరవ, వసతుల కల్పనలో ప్రదర్శించిన చిత్తశుద్ధితో అక్కడ ఏర్పాటు చేశామని ఆ తరువాత ప్రతినిధి బృందం మీడియా ముందే ప్రకటించింది కూడా. 2001 డిసెంబర్ 2న ఆనాటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి చేతుల మీదుగా హైదరాబాద్‌లో ఐఎస్బి ఆరంభమైంది. ఈ ఏడాది మే 26న ద్విదశాబ్ది వేడుకల ప్రారంభోత్సవంలో ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడుతూ, ఈ సంస్థలో ఇప్పటివరకు 50 వేల మంది నిష్ణాతులైనారనీ, ఆసియాలోని అత్యున్నతస్థాయి బిజినెస్ స్కూల్ ఇదని ప్రశంసించారు.
చంద్రబాబు దృష్టిలో పరిపాలన అంటే ప్రజలకు బతుకు దారి చూపడం. తదనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ప్రగతి కోసం 1998లోనే 20 ఏళ్ళ విజన్ డాక్యుమెంట్ రూపొందించి, అంతర్జాతీయ ఆర్థిక నిపుణుల సాయంతో రాష్ట్ర ప్రగతిని పరుగులు పెట్టించారు. పారిశ్రామిక వసతులకు సమగ్ర ప్రాధాన్యం ఇవ్వడమే కాక, విద్యారంగంలో సాంకేతిక విద్యకు అగ్రస్థానం ఇచ్చి పారిశ్రామిక అవసరాలకు అవసరమైన కోర్సులతో ఐఎస్బి వంటి సంస్థలను ప్రోత్సహించారు. ఆయన హయాంలో హైదరాబాద్, విశాఖ వంటి నగరాలలో వేలకోట్ల పెట్టుబడులు రావడంతో, ఉపాధి అవకాశాలు వెల్లువెత్తి యువతజీవితాలు దేదీప్యమానమైనాయి. నాలెడ్జ్ ఎకానమీ సృష్టించాలన్న లక్ష్యంతో అమెరికా వీధుల్లో 14 రోజులు ఫైళ్లు చేతపట్టుకొని తిరిగి నిర్మించిన ఒక మహాసౌధం కారణంగా హైదరాబాద్ నేడు సాఫ్ట్వేర్ రంగానికే తలమానికమైంది. హైటెక్ సిటీ నిర్మాణంతో సైబరాబాద్ అనే ఒక శివారు నగరం ఏర్పడింది. ప్రణాళికా సంఘం మాజీ అధ్యక్షులు మాంటేక్ సింగ్ అహ్లువాలియా ఈ మధ్య మాట్లాడుతూ ‘హైదరాబాద్‌లో ఐటీ రంగంలో ఉద్యోగాలు చేస్తున్న వారంతా చంద్రబాబుకు ధన్యవాదాలు చెప్పాలి’ అన్నారు. హైదరాబాద్ నగరాన్ని విశాలమైన రోడ్లతో, ఫ్లైవోవర్లతో, పారిశ్రామిక పార్క్‌లతో, ప్రపంచస్థాయి విద్యాసంస్థలతో, అంతర్జాతీయ టూరిజం స్పాట్లతో తీర్చిదిద్దారాయన. విద్య, వైద్య రంగాలకు హైదరాబాద్‌ను రాజధాని చేశారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కన్స్ట్రక్షన్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, నల్సార్ యూనివర్సిటీ, పోచారం ఐటీ హబ్ ఏర్పడ్డాయి. మెట్రోకి, అవుటర్ రింగ్ రోడ్డుకు అంకురార్పణ జరిగింది. అంతర్జాతీయ విమానాశ్రయం వచ్చింది. మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్ఎస్బిసి, డెల్, ఒరాకిల్ వంటి సంస్థలు వచ్చాయి. దేశంలోని నాలుగు మెట్రో నగరాలను మించి భాగ్యనగరం అంతర్జాతీయ నగరంగా నిలబడటానికి చంద్రబాబే కారణం. హైటెక్ సిటీ, హైటెక్స్ కన్వెన్షన్ వంటి ప్రగతిపాదులతో పాటు, శిల్పారామం వంటి ఎన్నో పర్యాటక ప్రదేశాలు ఆవిర్భవించాయి. ఐటి అభివృద్ధితో రియల్ ఎస్టేట్, రవాణా, పర్యాటక రంగాలు ఎదిగాయి. స్టార్ హోటల్స్ వచ్చాయి. హైదరాబాద్ అంతర్జాతీయ సదస్సులకు వేదికైంది.
చదువుకొన్న ప్రతి ఒక్కరికీ ఉద్యోగం లభించిన మంచి కాలం అది. లక్షలాది తెలుగుయువత సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడ్డారు. వేలాదిమంది చక్కని ఉద్యోగాలకోసం విదేశాలకు వెళ్ళారు. జీతాలు వేలల్లోనుంచి లక్షల్లోకి మారాయి. ప్రపంచాన్నే గడగడలాడించిన కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ కనుగొన్నది మా భారతదేశమని ప్రధాని మోదీ అంతర్జాతీయ వేదికలపై గర్వంగా చెప్పుకున్నారంటే అందుకు చంద్రబాబు వేసిన పునాదులే కారణం. హైదరాబాద్‌లో ఆయన ముందుచూపుతో నెలకొల్పిన జీనోమ్ వ్యాలీలో 18దేశాలకు చెందిన 200 పైగా లైఫ్ సైన్సెస్ కంపెనీల్లో 15వేల మంది సైంటిస్టులు, నిపుణులు పనిచేస్తున్నారు, నిత్య పరిశోధనలకు అది వేదికైంది. 150 కోట్లతో చంద్రబాబు నిర్మించిన గాంధీ ఆసుపత్రి యావత్ తెలంగాణకి కరోనా వైద్యాన్ని అందిస్తే, గచ్చీబౌలీలో నిర్మించిన స్పోర్ట్స్ కాంప్లెక్స్ నేడు ‘టిమ్స్‘గా మారి ఉపయోగపడుతున్నది.
వరల్డ్ బిజినెస్ స్కూళ్లలో అగ్రగామిగా నిలిచిన ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఈ నెల 16న తన 20వ వార్షికోత్సవం ఘనంగా జరుపుకుంటున్న తరుణంలో, దాని సృష్టికర్త చంద్రబాబు ఆ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొనడం సముచితం, గర్వకారణం.
నన్నూరి నర్సిరెడ్డి
టిడిపి జాతీయ అధికార ప్రతినిధి
Updated Date - 2022-12-15T00:58:46+05:30 IST