ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

ప్రమాదంలో పత్రికాస్వేచ్ఛ

ABN, First Publish Date - 2022-05-04T07:42:10+05:30

ప్రపంచ పత్రికా స్వేచ్ఛాదినోత్సవం సందర్భంగా మంగళవారం రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ (ఆర్ ఎస్ఎఫ్) అనే అంతర్జాతీయ సంస్థ వివిధ దేశాల్లో పత్రికాస్వేచ్ఛ ఏ స్థాయిలో పరిఢవిల్లుతున్నదో చెప్పే...

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

ప్రపంచ పత్రికా స్వేచ్ఛాదినోత్సవం సందర్భంగా మంగళవారం రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ (ఆర్ ఎస్ఎఫ్) అనే అంతర్జాతీయ సంస్థ వివిధ దేశాల్లో పత్రికాస్వేచ్ఛ ఏ స్థాయిలో పరిఢవిల్లుతున్నదో చెప్పే నివేదికను విడుదల చేసింది. 180 దేశాలకు సంబంధించిన ఈ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ లో భారతదేశం 150వ స్థానంలో ఉన్నది. ఆరేళ్ళక్రితం 133వ ర్యాంకులో ఉన్న దేశం ఇలా 17 స్థానాలు దిగజారిందంటే పతనం ఎంత వేగంగా పరుగులు తీస్తున్నదో అర్థం చేసుకోవచ్చు.


ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం అని ఘనంగా చెప్పుకొనే భారతదేశంలో పత్రికాస్వేచ్ఛ ప్రమాదంలో ఉన్నదని ఈ సంస్థ వ్యాఖ్యానించింది. ఇందుకు బీజేపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. జర్నలిస్టులకు ప్రమాదకరమైన దేశంగా మోదీ పాలనలో ఉన్న భారతదేశం పరిణమించిందని వ్యాఖ్యానించింది. వలసపాలనకు వ్యతిరేకంగా అద్భుతపోరాటం చేసిన కాలంలో భారతదేశంలో పత్రికలు ఎంతో ప్రగతిశీలంగా ఉండేవని ప్రశంసిస్తూ, ఆ తరువాతి కాలంలో పత్రికల నిర్వహణలో మార్పులు వచ్చినప్పటికీ, మోదీ ప్రధాని అయ్యాక మీడియా తీరే మారిపోయిందని నివేదిక చెబుతున్నది. రిలయెన్స్ అధినేత ముఖేష్ అంబానీ చేతుల్లో దాదాపు డెబ్బై మీడియా సంస్థలున్నాయనీ, కోట్లాదిమందిని ఇవి ప్రభావితం చేస్తున్నాయనీ, మీడియాపై బీజేపీ పట్టుకు ఇది ఓ ఉదాహరణ అని ఆ సంస్థ అంటోంది. పాత్రికేయులను భయపెట్టడం, మీడియా సంస్థలను అదుపాజ్ఞల్లో ఉంచడం వంటివి జరుగుతున్నాయంటూ పలు ఘటనలను ఉటంకించింది. కరోనా విపత్తుకాలంలో ప్రభుత్వ వైఫల్యాలను వెలుగులోకి తెచ్చిన పత్రికా సంస్థలపై ప్రభుత్వం దాదాపుగా ప్రత్యక్షయుద్ధమే చేసిందనీ, కఠిన సత్యాలను విప్పిచెప్పిన యాభైఐదుమంది పాత్రికేయులను మోదీ ఆయన అనుచరగణం కేసులతో వేధించారని వివరించింది. ఏటా సగటున ముగ్గురు లేదా నలుగురు పాత్రికేయులు హత్యకు గురవుతున్న భారతదేశంలో విలేకరులపై హింసాదౌర్జన్యాలు పెరిగిపోయాయనీ, పోలీసులు, రాజకీయనాయకులు, క్రిమినల్ గ్యాంగులు, అవినీతి అధికారులు వారిని భౌతికంగా హింసిస్తున్నారని నివేదిక చెబుతోంది. హిందూత్వ గ్రూపుల ప్రత్యక్ష దాడుల నుంచి సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్ వరకూ విలేకరులు ఎదుర్కొంటున్న సమస్యలను, దేశంలో పూర్తిగా మారిన వాతావరణాన్నీ ఈ సంస్థ విపులంగా ప్రస్తావించింది. మహిళాజర్నలిస్టుల కష్టాలు మరింత ఎక్కువనీ, రాజకీయ నాయకులూ వారి అనుయాయులూ తమకు గిట్టని మహిళా జర్నలిస్టుల వ్యక్తిగత వివరాలను ఆన్‌లైన్‌లో ఉంచడం ద్వారా వారిపై భౌతిక హింస జరిగేట్టుగా చూస్తున్నారని నివేదిక వివరించింది. చాలా చిన్నచిన్న కారణాలపైన తమకు నచ్చని పాత్రికేయులను ఉగ్రవాదం, దేశద్రోహం వంటి తీవ్ర అభియోగాలతో నిర్బంధించడం భారతదేశంలో యథేచ్ఛగా సాగిపోతున్నదని ఈ సంస్థ వివరించింది.


మీడియా స్వేచ్ఛను కాపాడండి, విలేకరులపైనా ఆన్ లైన్ విమర్శకులపైనా దాడులు చేయకండి అని ఈ సంస్థ విజ్ఞప్తి చేస్తున్నది. మన పొరుగుదేశాల్లో పాకిస్థాన్ ఒక్కటే మనకంటే మరో ఏడుర్యాంకులు దిగజారింది తప్ప, చిన్నదేశాలంటూ మనం అనుకొనేవి అనేకం మనకంటే విలువల్లో ఉన్నతంగానే ఉన్నాయి. పాలకపక్షానికి వ్యతిరేకమైన వార్తలు, కథనాలను ప్రసారం చేసే మీడియా సంస్థలపైన ప్రభుత్వం గుప్పిట్లో ఉన్న దర్యాప్తు సంస్థలు విరుచుకుపడతాయని, భారతప్రభుత్వం పెగాసస్ స్పైవేర్ ను విలేకరులపై కూడా ప్రయోగించినట్టుగా వార్తలు వచ్చాయని ఈ సంస్థ వ్యాఖ్యానించింది. కశ్మీర్ లో జర్నలిస్టుల కష్టాలను, ప్రమాదకరపరిస్థితులను నివేదిక విపులంగా ప్రస్తావించింది. యూపీలో 66మంది పాత్రికేయులపై యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కేసులు పెట్టడం, యాభైమందిమీద దాడులు జరగడం గురించి చెబుతూ సిద్దిఖీ కప్పన్ ఘటనను వివరించింది. 2020 అక్టోబర్ లో హథ్రాస్ గ్యాంగ్ రేప్ ఘటన నేపథ్యంలో ఇతడు న్యూఢిల్లీ నుంచి బయలుదేరి యూపీలో కాలూనగానే ఉగ్రవాదం, దేశద్రోహం ఇత్యాది కేసులుపెట్టి నిర్బంధంలోకి నెట్టేసి 575రోజులయింది. ఆయనపై ఉపా ప్రయోగించి బెయిల్ దక్కనివ్వకుండా చేస్తే, మరికొంతమంది విలేకరులపై ఒకదానితరువాత మరో కేసుపెట్టి జైల్లోనే ఉండేట్టు పాలకులు చేస్తున్నారు. ఈ నివేదిక మీద పాలకులు ఒకవేళ స్పందించినా, అసత్యాలు దట్టించిన అంతర్జాతీయ కుట్రగా దీనిని తీసిపారేయవచ్చు. కానీ, ప్రమాదం పత్రికాస్వేచ్ఛకు మాత్రమే కాదనీ, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యానికి కూడానని సమాజం గ్రహించడం అవసరం.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!